
సాక్షి, విజయవాడ : నాలుగేళ్లుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేశారని వైఎస్సార్‌సీపీ నేత మల్లాది విష్ణు మండిపడ్డారు. ఆ విషయాన్ని కప్పిపుచ్చకునేందుకే టీడీపీ అవిశ్వాసం పెడుతోందని ఆయన మండిపడ్డారు. గత పార్లమెంట్ సమావేశాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున వైవీ సుబ్బారెడ్డి 13సార్లు అవిశ్వాస నోటీసులు ఇచ్చారని, అయినా కేంద్రం పరిగణలోకి తీసుకోలేదని ఆయన విమర్శించారు. కానీ ఈ పార్లమెంట్ సమావేశాల్లో తొలిరోజే అవిశ్వాస నోటీస్‌ను పరిగణలోకి తీసుకోవడం వెనుక ఉన్న ఒప్పందం ఏంటో బయట పెట్టాలని డిమాండ్ చేశారు.
బీజేపీ, టీడీపీ లాలూచీ రాజకీయాలకు అద్దం పడుతోందని ఆయన ధ్వజమెత్తారు. నాలుగేళ్లు కేంద్రంలో ఉన్న చంద్రబాబు రాష్ట్రానికి ఏం సాధించారని మల్లాది నిలదీశారు. టీడీపీ నిజస్వరూపాన్ని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి బయటపెట్టారని చెప్పారు. నాలుగేళ్లుగా విభజన హామీలపై ఎందుకు పోరాడలేదని ప్రశ్నించారు. నేడు అవిశ్వాస తీర్మానం పెట్టి ప్రజల కోసం పోరాడుతున్నామని టీడీపీ గొప్పలు చెప్పుకుంటోందని మండిపడ్డారు. అవిశ్వాసం పెట్టి ఏం సాధించారో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.
టీడీపీకి దమ్ముంటే ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని మల్లాది విష్ణు సవాల్ విసిరారు. విభజన హామీల సాధనకు వైఎస్సార్‌సీపీ ఎంపీలు రాజీనామాలు చేస్తే.. టీడీపీ మాత్రం ప్రజలను మభ్యపెట్టేందుకు నాలుగేళ్లపాటు భాగస్వామిగా ఉన్న కేంద్ర కేబినెట్ నుంచి బయటకు వచ్చిందని ఆరోపించారు. టీడీపీ, బీజేపీలు కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నారని, ప్రజలు వారి నాటకాలను గమనిస్తున్నారని చెప్పారు. ఏపీకి బీజేపీ, టీడీపీలు చేసిన అన్యాయంలో చంద్రబాబు ప్రాధాన పాత్ర పోషించారని, కానీ ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని మల్లాది విష్ణు విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment