వంచనపై తిరుగుబాటే 24న బంద్‌: భూమన | Bhumana Karunakar Reddy Slams Cm Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

Published Sun, Jul 22 2018 12:11 PM | Last Updated on Wed, Oct 17 2018 6:18 PM

Bhumana Karunakar Reddy Slams Cm Chandrababu Naidu - Sakshi

భూమన కరుణాకర్ రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌ : వంచనపై తిరుగుబాటులో భాగమే మంగళవారం బంద్‌ అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. ఈ సారైనా బంద్‌లో పాల్గొంటున్న ప్రజలను భయపెట్టకుండా వారికి ఆటంకం కలిగించొద్దని ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం పార్టీ కేంద్రకార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్‌లో ఏపీ విభజన చట్టం హామీలను ఎవరూ ప్రస్తావించలేదన్నారు. ఎవరికి వారు వారి ప్రయోజనాల గురించే మాట్లాడారు తప్పా రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ఎవరైనా ప్రస్తావించారా అని ప్రశ్నించారు. 

చంద్రబాబు ఢిల్లీ ఎందుకెళ్లారు?
అవిశ్వాసం వీగిపోయిన తర్వాత సీఎం చంద్రబాబు ఢిల్లీ ఎందుకెళ్లారని, బీజేపీకి కృతజ్ఞతలు చెప్పడానికా? లేక కొత్త పొత్తుల కోసమా? అని ఎద్దేవా చేశారు. గతంలో కేంద్రం ప్యాకేజీ ఇచ్చినందుకు ధన్యవాద తీర్మానం చేయలేదా అని నిలదీశారు. హోదాపై చంద్రబాబు తీసుకున్నది యూటర్నా? లేక రైట్‌ టర్నా? ఏ టర్న్‌ అని ప్రజలు ప్రశిస్తున్నారని చెప్పారు. గతంలోప్యాకేజీనే మంచిదని సీఎంవో పుస్తకాలు కూడా ప్రచురించిందని గుర్తు చేశారు. తమ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి వాదననే టీడీపీ ఎంపీలు పార్లమెంట్‌లో చదివారన్నారు. టీడీపీ-బీజేపీ మధ్య సంబంధాలను కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ బయట పెట్టారని తెలిపారు. సాక్షాత్తు ప్రధానే టీడీపీ వైఎస్సార్‌ సీపీ ట్రాప్‌లో పండిందన్నారంటే అర్థం ఏంటనీ, చంద్రబాబు బీజేపీ మిత్రుడు కాబట్టే ప్రధాని అలా చెప్పారని భూమన పేర్కొన్నారు.

‘క’ గుణితమని కేకేను కలిస్తే ఎలా?
అవిశ్వాసంలో పక్క రాష్ట్రాలను చంద్రబాబు మేనేజ్‌ చేయలేకపోయారన్నారు. మద్దతు కోసం తెలంగాణ సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌లను కాకుండా ‘క’ గుణితమని కేకేను కలిస్తే ఇలానే ఉంటుందని సెటైర్‌ వేశారు. కేవలం ప్రచారం కోసమే చంద్రబాబు అవిశ్వాసం పెట్టారన్నారు. గతంలో వైఎస్సార్‌ సీపీ పిలుపునిస్తే పట్టించుకోలేదని, ఇప్పుడు కంటి తుడుపు చర్యగా అవిశ్వాసం పెట్టి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. మీ పాలనపై మీరే అవిశ్వాసం పెట్టుకుంటే బాగుంటుందని సలహా ఇచ్చారు. చంద్రబాబు నైజాన్ని ఖండిస్తూ  24న వైఎస్‌ జగన్‌ పిలుపునిచ్చిన బంద్‌ను విజయవంతం చేయాలని భూమన ప్రజలను కోరారు.

చదవండి: 24న ఏపీ బంద్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement