సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు ప్రయోజనం కలిగేందుకు లోక్‌సభలో లభించిన మంచి అవకాశాన్ని టీఆర్‌ఎస్ చేజార్చుకుందని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. టీఆర్‌ఎస్, బీజేపీల మధ్య ఉన్న బంధం అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా బట్టబయలైందన్నారు. శనివారం గాంధీభవన్‌లో ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు రసూల్‌ఖాన్, ప్రధాన కార్యదర్శి వినోద్‌రెడ్డి, యూత్‌కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్‌కుమార్ యాదవ్‌లతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు.
తెలంగాణ హక్కుల విషయంలో టీఆర్‌ఎస్ ఎంపీలు చేసిన ప్రసంగం పేలవంగా ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర విభజన చట్టంలోని హామీలను నెరవేర్చలేదని లోక్‌సభలో ప్రధాని మోదీని ఎందుకు నిలదీయలేకపోయారని ప్రశ్నించారు. విభజన హామీల గురించి కేంద్రంపై పోరాడటంలో విఫలమైన టీఆర్‌ఎస్, ‘మీ హృదయంలో ప్రేమ ఉంటే చాలు’ అంటూ మోదీనుద్దేశించి వ్యాఖ్యానించడం అవకాశవాద రాజకీయాలకు నిదర్శనమని విమర్శించారు.
ఖమ్మంలోని ఏడు మండలాలను ఆంధ్రలో కలిపినప్పుడు సీఎంగా కేసీఆర్ ఏం చేశారని ప్రశ్నించారు. కేసీఆర్, కవితలిద్దరూ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇవ్వాలని గతంలో మాట్లాడారని, మరిప్పుడు అదే విషయంలో కేం ద్రంపై పెట్టిన అవిశ్వాసం తీర్మానానికి ఎందుకు మద్దతివ్వలేదని నిలదీశారు. మైనార్టీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపామని, ఆ రిజర్వేషన్ల ఫైలు ఏం చేశారని కేంద్రాన్ని ఎందుకు అడగలేకపోయారని ఉత్తమ్ నిలదీశారు.
కేసీఆర్ మోదీ ఏజెంటు...
తెలంగాణ ప్రయోజనం కోసం ఎవరినైనా ఎదిరిస్తానని బీరాలు పలికిన కేసీఆర్ ఇప్పుడు అవిశ్వాసం విషయంలో ఎందుకు తటస్థంగా ఉన్నారని, తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ప్రధాని మోదీ మాట్లాడితే టీఆర్‌ఎస్ ఎంపీలు ఎందుకు నోరెత్తలేదని ప్రశ్నించారు. జాతీయ సాగునీటి ప్రాజెక్టుల కోసం పోరాడితే 90 శాతం నిధులు కేంద్రం నుంచి వచ్చేవని, అప్పుడు రాష్ట్రానికి అప్పులు తగ్గేవని అన్నారు.
కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ, ఎయిమ్స్, ఐఐఎం, గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు, హైకోర్టు విభజన లాంటి హామీలు నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉండేందుకు టీఆర్‌ఎస్, బీజేపీలే కారణమని విమర్శించారు. అవిశ్వాసం సమయంలో వీరి నిజస్వరూపం బయటపడిందని, మోదీ ఏజెంట్ కేసీఆర్ అని తేలిపోయిందన్నారు. తెలంగాణ ప్రజలు అమాయకులు కారని, టీఆర్‌ఎస్, బీజేపీలకు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధమవుతున్నారని చెప్పారు. రానున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే బీజేపీకి వేసినట్టేననే విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనించాలని కోరారు.
రాహుల్ ప్రసంగం అద్భుతం
మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం సందర్భంగా జరిగిన చర్చలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ అద్భుతంగా మాట్లాడాని, ఆయన ప్రసంగం చరిత్ర లో నిలిచిపోతుందని ఉత్తమ్ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment