సాక్షి, న్యూఢిల్లీ : కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై శుక్రవారం జరిగిన చర్చలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఆయనపై నిప్పులు కురిపించారు. ఆవేశంలో కొన్నిసార్లు తడబడ్డారు కూడా. అప్పుడు మోదీ చిద్విలాసంగా నవ్వుతూ కనిపించారు. తడబాటును సర్దుకుంటూ చివరికంటా ఉద్రేకపూరితంగా మాట్లాడిన రాహుల్ చివరలో తనకు ఎవరి పట్ల విద్వేషం లేదని, అందరిని ప్రేమిస్తానని చెప్పి సరాసరి మోదీ వద్దకు వెళ్లారు. ఆయన ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. తన సీటులోకి వచ్చి కూర్చున్నారు. ఎలా ఉంది నా ప్రసంగం ? అన్నట్లు పక్కన ఎవరినో చూస్తూ కన్నుగీటారు.
ఈ సన్నివేశం సభలో వేడిని తగ్గించి నవ్వులను పూయించగా ట్విట్టేరియన్లు తమదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలను సంధించడం మొదలుపెట్టారు. వారిలో ఒకరు.. కొద్దిరోజుల క్రితం అందరిని అలరించిన మలయాళ నటి ప్రియా ప్రకాష్ వారియర్ కన్నుగీటుతో రాహుల్ కన్నుగీటును కలిపి పోస్ట్ చేయడం విశేషంగా ఆకర్షిస్తోంది. లోక్‌సభలో రాహుల్ గాంధీ కన్నుగీటిన వార్త విని ప్రియా ప్రకాష్ వారియర్ హర్షం వ్యక్తం చేశారు. తనకెంతో పేరు తెచ్చిన విన్యాసాన్ని రాహుల్ ప్రదర్శించడం సంతోషాన్నిచ్చిందని వ్యాఖ్యానించారు.
జాదు కీ జప్పీ కాపీ కొట్టారా?
ఆప్యాయంగా కౌగిలింకుంటే విద్వేషాలు తగ్గుతాయని, శాంతమూర్తులుగా మారతారని మున్నాభాయ్ ఎంబీబీఎస్ సినిమాలోని భావనను రాహుల్ గాంధీ కాపీ కొట్టారని కొంత మంది వ్యాఖ్యానించారు. మోదీని ఎలుగుబంటి కౌగిలి ఇచ్చిన రాహుల్ గాంధీ ట్విటర్ ట్రెండింగ్‌లో నిలిచారు. కాగా, మోదీ అనుమతి లేకుండా బలవంతంగా వాటేసుకున్న రాహుల్‌పై కేసు పెట్టాలని కొందరు డిమాండ్ చేశారు. ఇందుకే రాహుల్‌ను ‘పప్పు’ అంటున్నారని మరికొందరు వ్యాఖ్యానించారు. ‘పప్పు’ హ్యాష్‌టాగ్ కూడా ట్విటర్ ట్రెండింగ్ కావడం కొసమెరుపు.
Comments
Please login to add a commentAdd a comment