సాక్షి, అమరావతి: కేంద్రంపై పెట్టిన అవిశ్వాసం వల్ల లబ్ధి రాకపోగా ప్రజల్లో మరింత చులకనయ్యామని టీడీపీ నాయకులు మధనపడుతున్నారు. తాజా పరిణామాలన్నీ జాతీయ స్థాయిలో సీఎం చంద్రబాబు, టీడీపీ పరువు తీశాయనే ఆందోళన టీడీపీ శ్రేణులందరిలోనూ కనిపిస్తోంది. ప్రత్యేక హోదా, అవిశ్వాసం సహా పలు అంశాల్లో యూటర్న్‌లు తీసుకోవడంపై ప్రతిపక్ష పార్టీలు ఎంత చెప్పినా అనుకూల మీడియా ద్వారా మేనేజ్ చేశామని, కానీ స్వయంగా ప్రధానమంత్రే పార్లమెంట్‌లో చంద్రబాబు యూటర్న్‌పై మాట్లాడటంతో గాలి మొత్తం పోయిందనే భావన టీడీపీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
తాము కేంద్రంపై పోరాడుతున్నామని, ధర్మ పోరాటం చేస్తున్నామని కొద్దినెలల నుంచి రాష్ట్రంలో జనాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నా నేరుగా ప్రధానే వాస్తవాలు బయటపెట్టడంతో ఇకపై ఇబ్బందులు తప్పవని ఆ పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. చంద్రబాబు అంగీకారంతోనే ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించామని, ప్యాకేజీ ప్రకటించినందుకు ఆర్థిక మంత్రి జైట్లీని చంద్రబాబు సత్కరించారని మోదీయే చెప్పడం తమను తీవ్ర ఇరకాటంలోకి నెట్టిందని వారు భావిస్తున్నారు.
కొత్త విషయం ఏం చెప్పారు..?
టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ తన ప్రసంగంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక హోదా పోరాటంలో మొదటి నుంచి చెప్పిన విషయాలనే చెప్పడంతో కొత్తగా పార్లమెంటులో ఏం చెప్పారనే దానికి టీడీపీ నాయకుల వద్ద సమాధానం లేకుండాపోయింది. జయదేవ్ చెప్పిన విషయాలను వైఎస్ జగన్ అసెంబ్లీలో చెప్పినప్పుడు టీడీపీ తీవ్రంగా వ్యతిరేకించడం వంటివన్నీ ఇప్పుడు అధికారపక్షానికి ఇబ్బందికరంగా మారాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను పరిణితి చెందిన నేతగా ప్రధాని మోదీ పేర్కొనడాన్ని కూడా టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.
చంద్రబాబు ప్రతి దానికి గొడవలు పడేవారని, తమ జోక్యంతో కేసీఆర్ పరిణితి చూపించినా చంద్రబాబు మాత్రం మారలేదని చెప్పడం ద్వారా మోదీ, బాబు అసలు స్వరూపాన్ని బయటపెట్టినట్లయిందని, ఇది తీవ్ర అవమానకరమని టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు. చంద్రబాబు కూడా ఈ విషయాన్ని జీర్ణించుకోలేక అర్ధరాత్రి 12 గంటలకు మీడియా సమావేశం పెట్టి మరీ మోదీపై ఎదురుదాడి చేసిన విషయం తెలిసిందే. మోదీ మాటల ముందు బాబు చెప్పేవన్నీ ఇప్పుడు జనాలు పట్టించుకోరని టీడీపీ నేతలు అంచనావేస్తున్నారు. చంద్రబాబు వెంటనే ఢిల్లీ వెళ్లినా తమ అధినేత ఏమీ చేయలేకపోయారని, అది ఇంకా మైనస్‌గా మారిందని టీడీపీ నాయకులు ఆవేదన చెందుతున్నారు.
సోషల్ మీడియాతో బెంబేలు..
ఒకపక్క పరువు పోయి కుంగిపోతున్న టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో జరుగుతున్న దాడితో బెంబేలెత్తిపోతున్నారు. జయదేవ్ ప్రసంగం, మోదీ చెప్పిన అంశాలకు సంబంధించి సెటైర్లు, జోకులు, విమర్శలతో చేసిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో టీడీపీ శ్రేణులకు ఏం చేయాలో పాలుపోవడంలేదు. ఈ పరిస్థితుల్లో కేంద్రానికి వ్యతిరేకంగా శనివారం ఆందోళనలు చేయాలని సీఎం చంద్రబాబు పిలుపు ఇచ్చినా దానికి టీడీపీ క్యాడర్ పెద్దగా స్పందించలేదు. అక్కడక్కడా కొందరు బయటకు వచ్చి కొద్దిసేపు హడావుడి చేసినా ఇతరులెవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఇంకా పరువు పోగొట్టుకోవడమెందుకనే అభిప్రాయం వారిలో కనిపిస్తోంది. కేంద్రంపై అవిశ్వాసం పెట్టి సెల్ఫ్‌గోల్ చేసుకున్నామని టీడీపీ నాయకులు చర్చించుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment