న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు ఎక్కుపెట్టిన అవిశ్వాస తీర్మానంపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆసక్తి నెలకొంది. భరత్ అనే నేను సినిమాను ప్రస్తావిస్తూ.. అవిశ్వాసం తీర్మాన చర్చను టీడీపీ తరుఫున కేశినేని నానికి బదులు గల్లా జయదేవ్ ప్రారంభించారు. ఇది ఓ ధర్మ యుద్ధమని, పార్లమెంట్ చరిత్రలోనే ఇది చాలా ముఖ్యమైన రోజని అభివర్ణించారు. ఇది మెజారిటీకి, మొరాలిటీకి జరిగే యుద్ధమని గల్లా జయదేవ్ అన్నారు. అయితే లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ ప్రారంభం కావడానికి కంటే ముందే బిజూ జనతాదళ్(బీజేడీ) సభ నుంచి వాకౌట్ చేసింది. విపక్షాలకు మాట్లాడేందుకు ఇచ్చిన సమయం సరిపోదంటూ కాంగ్రెస్ విపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే మాట్లాడుతున్న వేళ, బీజేడీ పక్ష నేత తనకు మైక్ కావాలని తీసుకున్నారు. తాము సభ నుంచి వాకౌట్ చేస్తున్నామని, అవిశ్వాసంతో ఒడిశాకు ఒరిగేదే ఏమీ లేదన్నారు.
ఒడిశాకు జరిగే అన్యాయంపై ఏ ప్రభుత్వంపై పట్టించుకోవడం లేదని, అందుకే సభ నుంచి వాకౌట్ చేస్తున్నామని తెలిపారు. తమ రాష్ట్రానికి కేంద్రం చాలా అన్యాయం చేసిందని, కేంద్రం వైఖరికి నిరసనగానే తాము వాకౌట్ చేస్తున్నామని, రెండు మాటలు చెప్పి బయటకు వెళ్లిపోయారు. కాగ, అవిశ్వాసంపై చర్చలో మాట్లాడేందుకు బీజేడీకి స్పీకర్ 15 నిమిషాల సమయం కేటాయించిన సంగతి తెలిసిందే. మొత్తం లోక్‌సభలో బీజేడీ తరుఫున 20 మంది ఎంపీలున్నారు. వీరెవరూ అవిశ్వాసంపై జరిగే ఓటింగ్‌లో పాల్గొనరని తెలిసింది. మరోవైపు అవిశ్వాసంపై చర్చకు స్పీకర్ కేటాయించిన సమయం సరిపోదని, మరికొంత సమయం కావాలని విపక్షాలు కోరుతున్నాయి. అయితే లంచ్ సమయంలో కూడా చర్చను కొనసాగిస్తామని స్పీకర్ చెప్పారు. అవిశ్వాసంపై చర్చలో పాల్గొనకుండా ముందే సభ నుంచి వెళ్లిపోయిన బీజేడీపై కాంగ్రెస్ పార్టీ సైతం సీరియస్ అయింది. బీజేపీకి కొమ్ము కాస్తూ సభ నుంచి వెళ్లిపోతారా? అంటూ వ్యాఖ్యానించింది.
Comments
Please login to add a commentAdd a comment