సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం రాజకీయాలను పక్కనపెట్టి పోరాటం చేద్దామని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పిలుపునిచ్చారు. హోదా పోరాటం కీలక దశలో ఉందని, హోదా కోసం ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చారని, ఇది శుభపరిణామం అని ఆయన అన్నారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఎంపీ మిథున్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. తాము స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామాలకు సిద్ధంగా ఉన్నామని, చిత్తశుద్ధి ఉంటే టీడీపీ కూడా తమతో కలిసి రావాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలో కూర్చుని అఖిలపక్షం పెడితే లాభం లేదని, అందరం కలిసి రాజీనామాలు చేసి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని మిథున్ రెడ్డి సూచించారు.
రాష్ట్రానికి అన్యాయం జరిగిందని 25 మంది ఎంపీలు రాజీనామా చేస్తే దేశవ్యాప్తంగా ప్రకంపనలు వస్తాయన్నారు. ఏమైనా రాజకీయాలు ఉంటే అసెంబ్లీ ఎన్నికల సమయంలో చూసుకుందామని, ఇప్పుడు హోదా కోసం కలిసికట్టుగా రాజీనామాలు చేద్దామని మిథున్ రెడ్డి అన్నారు. ఉప ఎన్నికలు వస్తే కేంద్రం మీద ఒత‍్తిడి పెరుగుతుందన్నారు. రాజస్థాన్, కర్ణాటకలోనూ అలాగే జరిగిందని, రాష్ట్ర ప్రజయోజనాల కోసం పదవులు వదులుకోవడానికి తాము సిద్ధమని స్ఫష్టం చేశారు.
అవిశ్వాసం ప్రకటించిందే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని, అదే ఇప్పుడు ఒక కుదుపు కుదిపిందన్నారు. వైఎస్ జగన్ ముందడుగు వెయ్యడం వల్లే ... అన్ని పార్టీలు కదిలాయన్నారు. టీడీపీ ఎంపీలు రాజీనామా చేయకపోతే లాలూచీ పడినట్లేనని ఆయన అన్నారు. ప్రత్యేక హోదాపై వైఎస్‌ఆర్ సీపీ వెనక్కి తగ్గేది లేదని సోమవారం అయినా లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం మీద చర్చ జరుగుతుందనే నమ్మకం ఉందని మిథున్‌రెడ్డి పేర్కొన్నారు. వైఎస్ జగన్ ముందుగా ప్రకటించినట్లే తాము ఏప్రిల్ 6వ తేదీన రాజీనామాలకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఒకవేళ టీడీపీ ఎంపీలు అంతకంటే ముందే రాజీనామాలు చేసినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. వారి రాజీనామాలు చేశాక తాము చేస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment