ఆరో‘సారీ’... | Sumitra Mahajan was not not allowing the No Confidence Motion | Sakshi
Sakshi News home page

ఆరో‘సారీ’...

Published Sat, Mar 24 2018 1:45 AM | Last Updated on Wed, Oct 17 2018 6:18 PM

Sumitra Mahajan was not not allowing the No Confidence Motion - Sakshi

పార్లమెంట్‌ వద్ద మీడియాతో మాట్లాడుతున్న మేకపాటి. చిత్రంలో విజయసాయిరెడ్డి, వరప్రసాద్‌రావు

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పార్లమెంట్‌లో చర్చకు రావాలని యావత్‌ ఆంధ్రప్రదేశ్‌ ప్రజలంతా కోరుకుంటున్నా సభ సజావుగా సాగడం లేదన్న కారణంతో లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌  తీర్మా నాన్ని ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇవ్వడం లేదు. వరుసగా 6వ రోజైన శుక్రవారం కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. అవిశ్వాస తీర్మానాన్ని సభా కార్యక్రమాల జాబితాలో చేర్చాలని వైఎస్సార్‌ సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, టీడీపీ ఎంపీ తోట నరసింహం గురువారం మధ్యాహ్నమే నోటీసులు ఇవ్వటం తెలిసిందే. 

వెల్‌లో కొనసాగిన ఆందోళన
శుక్రవారం ఉదయం లోక్‌సభ ప్రారంభం కాగానే సభాపతి ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే కావేరి బోర్డు ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌తో ఏఐఏడీఎంకే సభ్యులు, రిజర్వేషన్ల కోటా పెంపు అధికారం రాష్ట్రాలకే కట్టబెట్టాలని కోరుతూ టీఆర్‌ఎస్‌ సభ్యులు వెల్‌లోకి వెళ్లి ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళనకు దిగారు. మరోవైపు బిహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ జన్‌ అధికార్‌ పార్టీ నేత పప్పూయాదవ్‌ ఆందోళన నిర్వహిం చటంతో కొద్ది సేపటికే సభ వాయిదా పడింది. తిరిగి సభ ప్రారంభం కాగానే 12.05 గంటల కు సభాపతి అవిశ్వాస తీర్మానాల ప్రస్తావన తెచ్చారు. కేంద్ర మంత్రి మండలిపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు వైవీ సుబ్బారెడ్డి, తోట నరసింహం నుంచి నోటీసులు అంది నట్లు ప్రకటించారు. తీర్మానం ప్రవేశపెట్టేం దుకు అవసరమైన 50 మంది సభ్యులు నిలుచుంటే లెక్కించేందుకు వీలుగా సభ సజావుగా నడవాలన్నారు. అప్పుడు మాత్రమే తీర్మానం ప్రవేశపెట్టటంపై నిర్ణయం తీసుకోగ లనని, సభ్యులంతా కూర్చోవాలని సూచించా రు. ‘కుడివైపు (అధికారపక్షం వైపు) ఉన్న సభ్యులు చర్చకు సిద్ధంగా ఉన్నారు. మీరంతా అంగీకరిస్తేనే దీన్ని చేపట్టగలను. ఇలా ఉంటే తీర్మానం అనుమతించడం సాధ్యం కాదు..’ అని పేర్కొన్నారు. 

టీడీపీ, కాంగ్రెస్‌ ఎంపీల్లో పలువురు గైర్హాజరు
అవిశ్వాస తీర్మానం ప్రస్తావనకు వచ్చిన సమ యంలో సభలో విపక్షాల హాజరు పలుచగా కనిపించింది. సభకు హాజరైన కాంగ్రెస్‌ సభ్యుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. టీడీపీ సభ్యుల్లో ఒకరిద్దరు హాజరుకాలేదు.

రాజ్యసభలో హోదాపై చర్చకు చైర్మన్‌ నిరాకరణ
ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావిస్తూ రాజ్యసభలో చర్చించేందుకు అవకాశం ఇవ్వాలని వైఎస్సార్‌ సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి కోరగా చైర్మన్‌ ఎం.వెంకయ్యనాయుడు అనుమతి ఇవ్వలేదు. వివిధ పార్టీల సభ్యుల ఆందోళనతో గందరగోళం నెలకొనడంతో రాజ్యసభను చైర్మన్‌ సోమవారానికి వాయిదా వేశారు.

ఏడోసారి అవిశ్వాసం నోటీసులు
కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు వైఎస్సార్‌ సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, టీడీపీ ఎంపీ తోట నరసింహం శుక్రవారం మధ్యాహ్నం ఏడోసారి నోటీసులను లోక్‌సభ సెక్రటరీ జనరల్‌ స్నేహలతా శ్రీవాస్తవకు అందజేశారు.

మద్దతు పలికిన విపక్షాలు
అవిశ్వాస తీర్మానం ప్రస్తావనకు రాగానే విపక్షాలకు చెందిన సభ్యులంతా మద్దతుగా నిలుచున్నారు. వైఎస్సార్‌ సీపీ, టీడీపీ, కాంగ్రెస్, తృణమూల్‌ కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, సమాజ్‌వాదీ, ఆర్జేడీ, ఎన్సీపీ, జేఎంఎం, ఎంఐఎం, ఆమ్‌ ఆద్మీ, తదితర విపక్షాలన్నీ అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలిపాయి. అయితే ఏఐఏడీఎంకే, టీఆర్‌ఎస్‌ సభ్యులు వెల్‌లోనే ఉండడంతో సభ సజావుగా లేనందున  అవిశ్వాస తీర్మానాలను సభ ముందుకు తీసుకురాలేకపోతున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు. అనంతరం సభను మంగళవారానికి  వాయిదా వేశారు.

పార్లమెంట్‌ వద్ద విపక్షాల ధర్నా 
ఉదయం 10.30 గంటలకు వైఎస్సార్‌ సీపీ ఎంపీలు పార్లమెంట్‌  ప్రధాన ద్వారం వద్ద ధర్నా నిర్వహించారు. ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వి.విజయసాయిరెడ్డి, వెలగపల్లి వరప్రసాదరావు, వై.ఎస్‌.అవినాష్‌రెడ్డి, పి.వి.మిథున్‌రెడ్డి ఇందులో పాల్గొన్నారు. టీడీపీ ఎంపీలు గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేశారు. కాంగ్రెస్‌ ఎంపీ కేవీపీ రామచంద్రరావు గాంధీ విగ్రహం వద్ద ధర్నాలో పాల్గొన్నారు. కాగా ఎన్డీయే నుంచి బయటకు వచ్చామని చెబుతూనే మళ్లీ లాలూచీ పడి కలిసి కాపురం చేస్తున్నారని అధికార తెలుగుదేశం పార్టీపై వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. తాము చేపట్టిన ధర్నా అనంతరం వైవీ మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు కోసం వెళ్లామని సాకులు చెబుతూ మళ్లీ ప్యాకేజీ కోసం ప్రయత్నాలు ప్రారంభించారని ఆరోపించారు. తాము రాజీనామాలు చేసే లోపు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు చేస్తున్న అన్యాయాన్ని బహిర్గతం చేస్తామన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement