పార్లమెంటు ఆవరణలో హోదా కోసం నినాదాలు చేస్తున్న వైఎస్సార్‌సీపీ ఎంపీలు. చిత్రంలో బొత్స
సాక్షి, న్యూఢిల్లీ: వరుసగా ఎనిమిదోసారీ లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అవిశ్వాస తీర్మానాలను అనుమతించలేదు. కేంద్ర ప్రభుత్వంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, కాంగ్రెస్ సహా పలు పార్టీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానాలు బుధవారం కూడా లోక్‌సభలో చర్చకు నోచుకోలేదు. కావేరీ నదీజలాల యాజమాన్య బోర్డు ఏర్పాటు చేయాలంటూ అన్నాడీఎంకే సభ్యులు వెల్‌లో ఆందోళన చేపట్టడంతో సభ సజావుగా లేదంటూ స్పీకర్ అవిశ్వాస తీర్మానాలను ప్రవేశపెట్టేందుకు అనుమ తి ఇవ్వలేదు. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు సభాపతి ఈ అవిశ్వాస తీర్మానాలను ప్రస్తావించారు. ‘‘సభ్యులు వైవీ సుబ్బా రెడ్డి, పి.వి.మిథున్‌రెడ్డి, తోట నర్సింహం, కొనకళ్ల నారాయణరావు, శ్రీనివాస్ కేశినేని, మల్లికార్జున ఖర్గే, ఎన్.కె.ప్రేమ్‌చంద్రన్, పి.కరుణాకరన్, మహ్మద్ సలీం, పి.కె.కున్‌హలికుట్టి, ఎం.శ్రీనివాసరావు, అసదుద్దీన్ ఒవైసీ, జయదేవ్ గల్లా నుంచి అవిశ్వాస తీర్మానానికి నోటీసులు అందాయి. ఈ తీర్మానాలను ప్రవేశపెట్టేందుకు అవసరమైన బలాన్ని లెక్కించాలంటే సభ సజావుగా సాగాలి. అందువల్ల సభ్యులు తమ తమ స్థానాల్లోకి వెళ్లాలి’’అని ఆమె కోరారు. అయితే వెల్‌లో ఉన్న అన్నాడీఎంకే సభ్యులు కదల్లేదు. మరోవైపు అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టేందుకు వీలుగా బలం సమకూర్చుతూ వైఎస్సార్‌సీపీ, టీడీపీ, కాం గ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సీపీఎం, ఎస్పీ, ఎన్సీపీ, జేఎంఎం, సీపీఐ, ఎంఐఎం, ఆర్‌ఎస్ పీ, ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్ తదితర పార్టీల సభ్యులంతా లేచి నించున్నారు. అయినా సభ సజావుగా లేదంటూ సభాపతి సభను ఏప్రిల్ 2కి వాయిదా వేశారు.
మళ్లీ నోటీసులిచ్చిన వైఎస్సార్‌సీపీ, టీడీపీ
ఇదిలా ఉంటే.. ఏప్రిల్ 2వ తేదీనాటి సభా కార్యక్రమాల జాబితాలో అవిశ్వాస తీర్మానాలను చేర్చాలంటూ లోక్‌సభ సెక్రటరీ జనరల్ స్నేహలతా శ్రీవాస్తవకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభాపక్ష నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి, చీఫ్ విప్ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ పి.వి.మిథున్‌రెడ్డి బుధవారం మధ్యాహ్నం నోటీసులు ఇచ్చారు. టీడీపీ నుంచి ఆ పార్టీ లోక్‌సభాపక్ష నేత తోట నర్సింహం అవిశ్వాసానికి నోటీసులిచ్చారు.
కొనసాగిన ఆందోళన
అంతకుముందు ఉదయం 10.30కి పార్లమెంటు ప్రధాన ద్వారం వద్ద వైఎస్సార్‌సీపీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వి.విజయసాయిరెడ్డి, వెలగపల్లి వరప్రసాదరావు, పి.వి.మిథున్‌రెడ్డి, వైఎస్ అవినాష్‌రెడ్డిలు ఆందోళన నిర్వహించారు. హోదా వచ్చేవరకూ తమ పోరాటం కొనసాగుతుందన్నారు. సభ నిరవధికంగా వాయిదా పడిన రోజున రాజీనామాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. గాంధీ విగ్రహం వద్ద టీడీపీ ఎంపీలు ఆందోళన నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment