సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం మంగళవారం లోక్‌సభలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఈ తీర్మానానికి ఇప్పటికే అనేక విపక్ష పార్టీలు మద్దతుగా నిలిచాయి. వైఎస్సార్‌సీపీ బాటలో నడిచిన టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా నోటీసులివ్వగా తాజాగా ఆ జాబితాలో సీపీఎం, ఆర్‌ఎస్‌పీలు చేరాయి. ఆరు రోజులుగా ఏఐఏడీఎంకే, టీఆర్‌ఎస్ సభ్యులు సభా కార్యాకలాపాలకు అడ్డుతగులుతూ వస్తున్నారు. ఇది బీజేపీకి ఇబ్బందికరంగా మారడంతో ఆ పార్టీ ఎట్టకేలకు అవిశ్వాసాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. వరుసగా సభకు అంతరాయలు కలుగుతున్న నేపథ్యంలో పార్టీపట్ల ప్రజల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీలోని ఉన్నతస్థాయి వర్గాల వెల్లడించాయి. మరోవైపు.. అవిశ్వాసం వల్ల బీజేపీకి ఎలాంటి నష్టం ఉండబోదని.. ప్రభుత్వానికి అవసరమైన సంఖ్యాబలం పూర్తిగా ఉందని కూడా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే, తీర్మానంపై చర్చ జరిగే సందర్భంగా ఘాటుగా స్పందించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సైతం సిద్ధమవుతున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి.
వెల్‌లో నిరసనలకు టీఆర్‌ఎస్ దూరం..
ప్రత్యేక హోదా సంకల్పానికి పలు విపక్ష పార్టీలు మద్దతుగా నిలవటమేకాకుండా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాము వెల్‌లో ఉండడంవల్ల పరోక్షంగా కేంద్రానికి మద్దతుగా నిలుస్తున్నట్లు నెలకొన్న అపోహలను తొలగించేందుకు మంగళవారం నుంచి వెల్‌లో నిరసనలు కొనసాగించబోమని టీఆర్‌ఎస్ సోమవారం ప్రకటించింది. దీంతో ఇక మిగిలింది ఏఐఏడీఎంకే మాత్రమే. ఆ పార్టీ నేత తంబిదురై తమ పార్టీ ఎంపీల నిరసన కొనసాగుతుందని, సీఎం చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసమే నాటకాలు ఆడుతున్నారని ఇటీవల వ్యాఖ్యానించారు.
అనుమతిస్తే పది రోజుల్లోపు చర్చ
అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు అవసరమైన 50 మంది సభ్యుల బలం లెక్కించేందుకు వీలుగా వైఎస్సార్ సీపీ, టీడీపీ, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, సమాజ్‌వాదీ, ఆర్జేడీ, ఎన్సీపీ, జేఎంఎం, ఎంఐఎం, ఆమ్ ఆద్మీ, తదితర విపక్షాలన్నీ లేచి నిలబడుతున్నాయి. తాజాగా, కాంగ్రెస్‌తోపాటు సీపీఎం, ఆర్‌ఎస్‌పీ నోటీసులు ఇవ్వడంతో అవిశ్వాసంపై దేశం దృష్టి కేంద్రీకృతమైంది. తీర్మానానికి సభాపతి అనుమతిస్తే పది రోజుల్లోపు చర్చించాలన్న నిబంధన ప్రకారం ఏదో ఒక నిర్దిష్ట తేదీని కేటాయిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment