పోలీసుల బదిలీ
సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల్లో ఆర్డర్ టు సర్వ్ పద్ధతిలో పనిచేస్తున్న పోలీసుల బదిలీలకు అడ్డంకులు తొలగిపోయాయి. కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో తాత్కాలిక పద్ధతిలో కేటాయించిన పోలీస్ సిబ్బందిని బదిలీ చేసే అధికారం డీజీపీకి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. దీంతో ఏడాదిగా బదిలీల కోసం ఎదురుచూస్తున్న పోలీసులకు ఊరట లభించినట్లైంది. రాష్ట్ర ప్రభుత్వం 2016 అక్టోబర్‌లో కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. అన్నిశాఖల్లో పాత జిల్లాల పరిధిలోని ఉద్యోగులను విభజించి ఆర్డర్ టు సర్వ్(తాత్కాలిక) పద్ధతిలో కొత్త జిల్లాలకు కేటాయించింది. పోలీసుశాఖ కూడా ఇదే పద్ధతిని అమలు చేసింది. కానిస్టేబుల్ నుండి సబ్ ఇన్‌స్పెక్టర్ల వరకు తాత్కాలికంగానే కేటాయించారు.
అప్పటి నుండి శాశ్వత బదిలీల కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు. ఆర్డర్ టు సర్వ్ విధానం వల్ల పోలీసుశాఖలో ప్రమోషన్ల ప్రక్రియ ఏడాదిన్నరగా ఆగిపోయింది. పదోన్నతులు ఇవ్వాలంటే సీనియారిటీతోపాటు ఆ జిల్లాల్లో ఖాళీలుండాలి. ఇవి తాత్కాలిక కేటాయింపులు కావడంతో ఏ జిల్లాలో ఎన్ని పోస్టులున్నాయో ఖచ్చితమైన లెక్కలులేవు. దీంతో కానిస్టేబుళ్లకు, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్‌ఐ, ఎస్‌ఐ పదోన్నతులు నిలిచిపోయాయి. ఈ కారణంగా కిందిస్థాయి పోలీసు ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమైంది. దీనిపై పోలీసుశాఖ ఉన్నతాధికారులు ఈ విషయాన్ని ప్రభుత్వానికి నివేదించారు. ఆర్డర్ టు సర్వ్ పద్ధతిలో కేటాయించిన పోలీసు సిబ్బందిని బదిలీ చేసే అధికారం డీజీపీకి అప్పగించాలని హోంశాఖ ముఖ్యమంత్రిని కోరింది. పోలీస్‌శాఖ విజ్ఞప్తి మేరకు ఆర్డర్ టు సర్వ్‌లో పనిచేస్తున్న పోలీసు సిబ్బంది బదిలీకి సీఎం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. దీనికి న్యాయపరమైన చిక్కులు రాకుండా న్యాయసలహా తీసుకున్నారు.
దరఖాస్తు చేసుకుంటేనే...
ప్రభుత్వ నిర్ణయం ప్రకారం తాత్కాలిక పద్ధతిలో కొత్త జిల్లాల్లో పనిచేస్తున్న పోలీసు సిబ్బంది బదిలీల కోసం డీజీపీకి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నిర్ణయంతో కొత్త జిల్లాల్లో పోలీసు కానిస్టేబుళ్లు, ఎస్‌ఐల బదిలీలకు పదోన్నతులకు లైన్ క్లియరైంది. కొత్త జిల్లాల కేటాయింపుల విషయమై ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ఇకపై కొత్తగా వచ్చే పోస్టులను పాత జిల్లాల ఎస్పీలకు కేటాయిస్తారు. పాత హెడ్ క్వార్టర్లో ఉన్న అధికారి ఆ జిల్లా పరిధిలో ఏర్పడ్డ కొత్త జిల్లాలకు పోస్టులను కేటాయించే అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment