ప్రొద్దుటూరు క్రైం : ‘కొట్టింది మేమే.. ఏం చేస్తారు.. వైఎస్సార్‌సీపీ నాయకులు, పోలీసులు ఏం చేస్తారు’ ఈ మాటలు అన్నది ఒక అధికార పార్టీ కౌన్సిలర్. ఎక్కడో కాదు.. సాక్షాత్తు పోలీస్ స్టేషన్‌లో. పోలీసుల సాక్షిగా స్టేషన్‌లో అందరూ చూస్తుండగా ప్రొద్దుటూరులోని అధికార పార్టీ కౌన్సిలర్ తలారి పుల్లయ్య అన్న మాటలివి. ఎవరికైనా అన్యాయం జరిగితే పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయిస్తారు. అయితే స్టేషన్‌కు వెళ్లిన బాధితుడి ముందే కౌన్సిలర్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అధికార పార్టీ నేతల ఆగడాలు రోజు రోజుకు శ్రుతిమించి పోతున్నాయి. ఓర్వలేనితనంతో సామాన్యులపై కూడా వారు అధికార దర్పం ప్రదర్శిస్తున్నారు.
ఫేస్‌బుక్‌లో పోస్టింగ్ పెట్టాడని..
నాలుగు రోజుల క్రితం ఆర్ట్స్‌కాలేజి రోడ్డుకు చెందిన ఇంటర్ చదివే బాలుడు టీడీపీ నాయకుల పోస్టింగ్‌పై ఫేస్‌బుక్‌లో లైక్ కొట్టాడు. పోస్టు పెట్టిన వారిని కాకుండా లైక్ కొట్టిన ఆ బాలుడిని అధికార పార్టీ నాయకులు కొందరు టీడీపీ కార్యాలయానికి తీసుకొని వెళ్లారు. కార్యాలయంలోనే బాలుడిని నిర్బంధించి రామేశ్వరం రోడ్డుకు చెందిన ఒక కౌన్సిలర్‌తో పాటు టీడీపీ నాయకులు కలిసి చితక్కొట్టారు. నేను లైక్ చేశానని, నాకేం తెలియదని చెప్పినా వారు కనికరించలేదు. తర్వాత బ్లూకోల్ట్ పోలీసులకు ఫోన్ చేసి బాలుడిని వారికి అప్పగించారు. ఇందులో బాలుడి తప్పు ఉంటే కేసు నమోదు చేయాల్సిందే. పోస్టింగ్‌తో అతనికి సంబంధం లేకున్నా అధికార పార్టీ నాయకులు విచక్షణా రహితంగా కొట్టడంపై విమర్శలు వస్తున్నాయి. బాలుడిపై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేయాల్సిన పోలీసులు కూడా బాలుడినే మందలించడం గమనార్హం. గతంలో కూడా తమకు వ్యతిరేకంగా పోస్టింగ్‌లు పెట్టారని టీడీపీ నాయకులు రూరల్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు వారం రోజుల పాటు వారిని లాకప్‌లో వేసి నరకం చూపించారు. ఇదంతా సీనియర్ నాయకుడి కనుసన్నల్లో జరుగుతున్నట్లు ప్రజలు భావిస్తున్నారు.
ఎమ్మెల్యే రాచమల్లుకు దండ వేశాడని..
ఇటీవల రామేశ్వరంలోని చర్చి వీధిలోకి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి వెళ్లారు. అదే వీధిలో నివాసం ఉంటున్న బెనర్జీ అనే యువకుడు అభిమానంతో ఎమ్మెల్యే రాచమల్లుకు దండ వేసి ఆయనతో పాటు వీధిలో తిరిగాడు. అయితే దీన్ని జీర్ణించుకోలేని టీడీపీ నాయకులు మూకుమ్మడిగా యువకుడిపై దాడి చేశారు. మంగళవారం ఉదయం బెనర్జీ రామేశ్వరం రోడ్డులోని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ వద్ద పేపర్ చదువుతుండగా కౌన్సిలర్ తలారిపుల్లయ్య, మార్కాపురం గణేష్‌బాబుతో పాటు మరి కొందరు అతనిపై దాడి చేశారు. దాడిలో యువకుడికి రక్తగాయాలు అయ్యాయి. మా వీధిలో ఉంటూ మాకు వ్యతిరేకంగా పని చేస్తావా అంటూ వారు కులం పేరుతో దూషించారు. దీనిపై అతను వెంటనే వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు ఫిర్యాదు చేయడానికి వెళ్లాడు. తనపై జరిగిన దాడిని పోలీసులకు వివరిస్తుండగా అక్కడికి వెళ్లిన కౌన్సిలర్ తలారి పుల్లయ్య ‘ కొట్టింది నేనే.. ఏం చేస్తారు..? అంటూ పోలీసులతో అన్నాడు. ఒకరిపై దాడిన చేసిన వారే స్టేషన్‌కు వెళ్లి నేనే కొట్టాను.. ఏం చేసుకుంటారని చెప్పడం చూస్తుంటే ప్రొద్దుటూరు టీడీపీ నేతల దౌర్జన్యం ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. జరిగిన సంఘటనపై బాధితుడు పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో సీఐ, ఎస్‌ఐలు ఆ సమయంలో స్టేషన్‌లో ఉన్న కానిస్టేబుళ్లను విచారించగా కౌన్సిలర్ తలారి పుల్లయ్య ‘కొట్టింది నేనే.. ఏం చేసుకుంటారని’ చెప్పిన మాట వాస్తవమేనని చెప్పారు. ఈ విషయంపై పోలీసు అధికారులు సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సంఘటనపై కౌన్సిలర్లు తలారి పుల్లయ్య, మార్కాపురం గణేష్‌బాబు సహా మరో ముగ్గురిపై వన్‌టౌన్ పోలీసులు ఎస్టీ ఎస్సీ అట్రాసిటి కేసు నమోదు చేశారు. ప్రొద్దుటూరు పట్టణంలో టీడీపీ నాయకుల వ్యవహార శైలి తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment