
సాక్షి, వైఎస్సార్ కడప : కడప ఉక్కు పరిశ్రమ కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చేపట్టిన 48 గంటల నిరహార దీక్ష పూర్తైంది. గురువారం ప్రొద్దుటూరులో ఆయన దీక్షను విరమించారు. కడప ఉక్కు-రాయలసీమ హక్కు అనే నినాదంతో పరిశ్రమ స్థాపన కోసం జిల్లాలోని ఎమ్మెల్యేలంతా రాజీనామాలు చేస్తామని రాచమల్లు ప్రకటించారు.
ఉక్కు పరిశ్రమ కోసం దీక్ష చేపట్టిన తెలుగుదేశం పార్టీ ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాజీనామాలు చేయడానికి సిద్ధమా? అని సవాల్ విసిరారు. టీడీపీతో రాజీనామాలు చేయించే బాధ్యతను అఖిలపక్షం తీసుకోవాలన్నారు. కడపలో స్టీల్ ప్లాంట్ రాకపోవడానికి కారణం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలేనని చెప్పారు. స్టీల్ ప్లాంట్ కోసం ఎందాకైనా పోరాటం చేస్తామని అన్నారు.
స్టీల్ ప్లాంట్ గురించి నాలుగేళ్లుగా మాట్లాడని తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పటికిప్పుడు దీక్షలు చేయడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో కేవలం ఓట్లు కోసమే టీడీపీ మొసలి కన్నీరు కార్చుతోందని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment