
సాక్షి, హైదరాబాద్: కడపలో టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ చేపట్టిన దీక్ష వెనుక చిత్తశుద్ధి ఏపాటిదో, ఆందోళనలంటే ఆ పార్టీ ప్రజాప్రతినిధులకు ఎంత చులకన భావం ఉందో ఎంపీల మాటల్లో బయటపడిందని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. నిరాహార దీక్షలను ఒళ్లు తగ్గించుకునే కార్యక్రమంగా చేస్తున్నారని, ఢిల్లీలో టీడీపీ ఎంపీలు మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయని చెప్పారు. ప్రజా సమస్యలపై చిత్తశుద్ధితో పోరాటం సాగించేతత్వం టీడీపీకి ఏమాత్రం లేదని మరోసారి స్పష్టమైందన్నారు. నిరాహారదీక్షలను పలుచనచేసి మాట్లాడటం ద్వారా ఢిల్లీలో తెలుగువారి పరువు మంటగలిపారని మండిపడ్డారు. ఎంపీల బాతాఖానీని టీవీ చానళ్లలో ప్రసారం చేయకుండా ఆపించేందుకు చంద్రబాబు అష్టకష్టాలు పడ్డారని, బాబును నెత్తిన పెట్టుకునే చానళ్లు ఈ వీడియాను ప్రసారం చేయకపోయినా మిగతా ఒకటి రెండు చానళ్లు మాత్రం చూపాయన్నారు. టీడీపీ ఎంపీల బాగోతాన్ని మసిపూసి మారేడుకాయ చేసేందుకు బాబు ప్రయత్నిస్తున్నారని అంబటి వివరించారు.
డైటింగ్ ప్రోగ్రాంలా దీక్షలు
డైటింగ్ ప్రోగ్రాంలా సీఎం రమేశ్ నిరాహార దీక్ష చేస్తున్నారని అంబటి విమర్శించారు. పది రోజులుగా దీక్ష చేస్తున్నా ఆరోగ్యం ఏమాత్రం క్షీణించకపోవడం వెనుక సీఎం రమేశ్ పఠిస్తున్న మంత్రమేమిటో? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పదకొండో రోజు చంద్రబాబు వచ్చేవరకూ సుగర్ స్థాయిలు పడిపోకుండా మేనేజ్ చేస్తున్నారని మండిపడ్డారు.
దమ్ముంటే రాజీనామాలు చేయాలి
రాష్ట్ర ప్రయోజనాల కోసం వైఎస్సార్‌సీపీ ఎంపీలు పదవులను త్యజించి రాజీనామాలు చేశారని, చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే ఎంపీలతో రాజీనామాలు చేయించాలని రాంబాబు సవాల్ విసిరారు. ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకోవడం కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ కాళ్లను రాష్ట్ర మంత్రి పట్టుకున్నారని ఆరోపించారు. బాబు పాలనలో వ్యవసాయరంగ వృద్ధిరేటు మైనస్‌లోకి వెళ్లిపోయిందన్నారు. అయితే ఏరువాక సాక్షిగా చంద్రబాబు ఆమదాలవలసలో పచ్చి అబద్ధాలు మాట్లాడారని, ఏరువాకను రాజకీయం చేస్తూ వ్యవసాయంపై కంటే విపక్ష నేత వైస్ జగన్, వైఎస్సార్‌సీపీపై విమర్శలకే ఎక్కువ సమయం కేటాయించారని ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment