సాక్షి, అమరావతి: కడపలో ఉక్కు ఫ్యాకర్టీ నిర్మిస్తే చదువుకున్నయువతకు ఉద్యోగాలు దొరుకుతాయని, ప్రజలకు ఉపాధి లభిస్తుందని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అన్నారు. కడపలో మానవ వనరులు అధికంగా ఉన్నాయని, ఉక్కు ఫ్యాక్టరీకి కావాల్సిన నీరు, విద్యుత్, ఖనిజం, భూమి, ఈ ప్రాంతంలో ఉన్నాయని పేర్కొన్నారు. ఇన్ని సహజ వనరులు ఉన్నచోట ఫ్యాక్టరీని ఎందుకు నిర్మించరని రాచమల్లు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ఉక్కు ఫ్యాక్టరీ సాధన కోసం కడపలో వైఎస్సార్ సీపీ నిర్వహించిన మహాధర్నాలో ఆయన ప్రసంగించారు.
నాలుగేళ్ల కేంద్రంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ పదవులు అనుభవించి ఇప్పుడు కొత్తగా ఉక్కు ఫ్యాక్యర్టీ కోసం దీక్ష చేయడం ఏమిటని రాచమల్లు ప్రశ్నించారు. కడపలో కర్మాగారం పెడితే లాభం రాదని కేంద్రం చెబుతోందన్న రాచమల్లు ప్రజల అభివృద్ధి కోసం కర్మాగారం నిర్మించాలిగానీ, లాభాల కోసం కాదని వ్యాఖ్యానించారు. కడపలో వైఎస్ జగన్‌ను దెబ్బతియాలనే ఉద్దేశంతోనే టీడీపీ దొంగ దీక్షలు చేస్తోందని విమర్శించారు. అర్హత, యోగ్యత, నైతిక విలువలు లేని రమేష్ నాయుడు (సీఎం రమేశ్) రాజకీయ లబ్ధి కోసమే దీక్ష చేస్తున్నారని ఆరోపించారు. 19 మంది ఎంపీలు ఉన్న టీడీపీ ఉక్కు ఫ్యాక్టర్టీ సాధించలేకపోతోందని, నాలుగేళ్లుగా చంద్రబాబు నాయుడు నిద్రపోయారా అని ధ్వజమెత్తారు. కేంద్రంతో విభేదించినప్పుడే చంద్రబాబు దీక్ష చేసి ఉంటే 67 మంది వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతు తెలిపేవారని అన్నారు.
ముగిసిన మహాధర్నా
ఉక్కు ఫ్యాక్టరీ కోసం వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన మహాధర్నా విజయవంతంగా ముగిసింది. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా కడప స్టీల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని వైఎస్సార్‌సీపీ నేతలు డిమాండ్ చేశారు. జిల్లాలోని పాత కలెక్టరేట్ వద్ద జూన్ 23 నుంచి 26 వరకు ధర్నా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వైఎస్సార్‌సీపీ ప్రకటించింది. ఈ నెల 24న బద్వేలులో మహా ధర్నా, 25న రాజాంపేటలో మహాధర్నా, జమ్మలమడుగులో భారీ దీక్షలు చేపడుతామని వైఎస్సార్‌సీపీ నేతలు తెలిపారు. నిరసనల్లో భాగంగా జూన్ 27న జాతీయ రహదారుల దిగ్బందిస్తామన్నారు. స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం డిమాండ్ చేస్తూ జూన్ 29న రాష్ట్ర బంద్‌కు వైఎస్సార్‌సీపీ పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో వైస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సమన్వయకర్తలు పాల్గొన్నారు.. కడప ఉక్కు- ఆంధ్రుల హక్కు అంటూ పెద్ద ఎత్తున నినదించారు.
Comments
Please login to add a commentAdd a comment