సాక్షి, అమరావతి:కడప ఉక్కు కర్మాగారం నిర్మాణాన్ని రెండేళ్లలో పూర్తి చేస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటనను మరో ఎన్నికల డ్రామాగా రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. నాలుగేళ్ల ఎనిమిది నెలలపాటు అధికారాన్ని అనుభవిస్తూ కడప ఉక్కు కర్మాగారం ఊసే ఎత్తని చంద్రబాబు ఇప్పుడు ఎన్నికలకు కేవలం మూడు నెలల ముందు, ఎన్నికల నోటిఫికేషన్ జారీకి నెలన్నర మాత్రమే సమయం ఉన్న సమయంలో ఆర్భాటంగా శంకుస్థాపన చేయడం ఓట్ల కోసం ప్రజలను మభ్యపెట్టడమేనని మేధావులు, రాజకీయ విశ్లేషకులు కుండబద్దలు కొడుతున్నారు. నిజంగా కడపలో స్టీల్ ప్లాంటు ఏర్పాటు చేయాలనే చిత్తశుద్ధి ముఖ్యమంత్రికి ఉంటే నాలుగేళ్ల క్రితమే శంకుస్థాపన చేసి ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసి ఉండేవారని రాయలసీమ వాసులు పేర్కొంటున్నారు.
గనుల నిక్షేపాలేవీ? నిధులేవీ?
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం కడప స్టీల్‌ప్లాంట్‌ను కేంద్ర ప్రభుత్వమే నిర్మించాలి. ఈ దిశగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయించాల్సిన బాధ్యత తనపై ఉన్నప్పటికీ చంద్రబాబు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. టీడీపీ కేంద్ర ప్రభుత్వంలో నాలుగేళ్లపాటు భాగస్వామిగా ఉంటూ కేంద్రంలో మంత్రి పదవులను కూడా అనుభవిస్తూ స్టీల్‌ప్లాంట్ గురించి ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదు. సొంత పనులు, పైరవీలు చేసుకుంటూ ఆస్తులు కూడబెట్టుకున్నారే గానీ వెనుకబడిన ప్రాంత ప్రజలకు ఉపాధి కల్పించే కడప స్టీల్‌ప్లాంట్‌ను ఏర్పాటు చేద్దామన్న ఆలోచనే చేయలేదు. ఇప్పటివరకూ ఈ కర్మాగారం కోసం ఇనుప ఖనిజ నిక్షేపాలనే కేటాయించలేదు. నిర్మాణానికి బడ్జెట్‌లో రూపాయి కూడా ఇవ్వలేదు. నీటి కేటాయింపుల గురించి ప్రస్తావించలేదు. చేయాల్సిన ఈ పనులేవీ చేయకుండా హడావుడిగా శంకుస్థాపన చేయడం అంటే ప్రజలను మభ్యపెట్టడం తప్ప మరేమీ కాదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఆర్థిక సంస్థల నుంచి రుణం తీసుకోవాలన్నా సరిపడా గనులు, నీటి కేటాయింపులను చూపడం తప్పనిసరి వారు వివరిస్తున్నారు.
2017 నవంబర్ 12న దువ్వూరులో జరిగిన వైఎస్ జగన్ బహిరంగ సభ ప్రసంగం క్లిపింగ్
జగన్ ప్రకటించి ఏడాది దాటినా?
కేంద్ర ప్రభుత్వం ముందుకు రాకపోతే.. తమ ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లోగా వైస్సార్ జిల్లాలో స్టీల్ ప్లాంటు నిర్మాణానికి శంకుస్థాపన చేసి, మూడేళ్లలో పూర్తి చేస్తామని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 2017 నవంబరు 12న ప్రకటించారు. వైఎస్సార్ జిల్లా దువ్వూరులో జరిగిన బహిరంగ సభలో జగన్ ఈ హామీ ఇచ్చారు. ఇది జరిగి ఏడాది దాటినా చంద్రబాబు స్పందించలేదు. నిజంగా చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే అప్పుడైనా శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించి ఉండేవారు. అప్పుడు స్పందించకుండా తీరా ఇప్పుడు ఎన్నికలు ముంచుకొస్తుండడంతో చంద్రబాబు వైఎస్సార్ జిల్లాలో స్టీల్‌ప్లాంటు నిర్మాణానికి భూమి పూజ చేశారు.
బాబు మోసం బట్టబయలు
కడపలో స్టీల్ ప్లాంటు ఏర్పాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తగిన సహకారం అందించలేదని, సమాచారం ఇవ్వలేదని కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ప్లాంటు నిర్వహణకు ఇనుప ఖనిజ నిక్షేపాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలపాలని టాస్క్‌ఫోర్సు కోరినా స్పందించలేదని కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టింది. దీంతో ఈ వ్యవహారంలో చంద్రబాబు సర్కారు కపట నాటకం బట్టబయలైంది. చంద్రబాబుకు నిజంగా వైఎస్సార్ జిల్లాలో స్టీల్ ప్లాంటు ఏర్పాటు కావడం ఇష్టం లేదని, కేవలం ఇప్పుడు ఓట్ల కోసం శంకుస్థాపన డ్రామా ఆడారని తేటతెల్లమవుతోంది. కేంద్ర ప్రభుత్వ టాస్క్‌ఫోర్సు కోరిన సమాచారం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదంటే చంద్రబాబు ఉద్దేశం ఏమిటో సులభంగా అర్థం చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment