
ప్రొద్దుటూరు: ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల స్కాంలో తన ప్రమేయం ఉందని పరోక్షంగా తనను ఉద్దేశించి ఆంధ్రజ్యోతిలో అబద్ధపు రాతలు రాశారని, నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతోపాటు రాజకీయాల నుంచి నిష్క్రమిస్తానని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి పేర్కొన్నారు. అలా నిరూపించలేని పక్షంలో ఆంధ్రజ్యోతి దినపత్రికను మూసివేస్తారా అని ఆ పత్రిక ఎండీ వేమూరి రాధాకృష్ణకు ఎమ్మెల్యే సవాల్ విసిరారు. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి మీడియాతోమాట్లాడుతూ.. ఆంధ్రజ్యోతిలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రూ.117 కోట్లు చెక్కేశారని అబద్దపు కథనాన్ని ప్రచురించారన్నారు.
తనపేరు ప్రస్తావించకపోయినా జిల్లాలో పది మంది ఎమ్మెల్యేల తరఫున తాను మాట్లాడుతున్నానని చెప్పారు. కాగా, తమ పార్టీ కార్యాలయంలో పనిచేసే చెన్నకేశవరెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇచ్చారని తేలడంతో వెంటనే విధుల నుంచి తొలగించానని చెప్పారు. భాస్కర్‌రెడ్డి అనే వ్యక్తి ఇందులో కీలకపాత్ర పోషించాడని వివరించారు. అలాగే ట్రస్టు పేరుతో డ్రా చేసేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ నకిలీ బాగోతాన్ని గుర్తించిందన్నారు.ఈ కేసులో సీబీఐ దర్యాప్తు కోరినా తనకు అభ్యంతరం లేదని రాచమల్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment