కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న చీపురపల్లి రాజశేఖర్
పెందుర్తి: సబ్బవరం పోలీస్‌స్టేషన్‌లో ఓ వ్యక్తి గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. చేయని నేరాన్ని అంగీకరించాలని పోలీసులు తీవ్ర ఒత్తిడి చేయడమే ఘటనకు కారణంగా తెలుస్తుంది. పోలీస్‌స్టేషన్‌లోని కిటికీ అద్దాన్ని పగలగొట్టిన బాధితుడు(నేరారోపిత వ్యక్తి) అదే అద్దంతో పీక కోసుకున్నాడు. ప్రస్తుతం బాధితుడు కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. సబ్బవరం మండలం చినగొల్లలపాలెంలో మూడు రోజుల క్రితం జరిగిన ఓ వివాహంలో జరిగిన చోరీ నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు విషయాన్ని గోప్యంగా ఉంచారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన వివరాలు బాధితుని వాగ్మూలం ప్రకారం ఇలా ఉన్నాయి. సబ్బవరం మండలం అమృతపురానికి చెందిన చీపురపల్లి రాజశేఖర్ నాయుడుతోట సమీపంలోని ఓ ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈ నెల 10న సబ్బవరం మండలం చినగొల్లలపాలెంలో తన స్నేహితుడు పల్లా రాజేష్ వివాహానికి ఉదయం, సాయంత్రం హాజరయ్యాడు. ఆ రోజు రాత్రి భోజనం అనంతరం వివాహం నుంచి అమృతపురంలోని తన ఇంటికి వచ్చిన రాజశేఖర్ కాసేపటి తరువాత నాయుడుతోటలో తన స్నేహితుడి రూమ్‌కి వెళ్లిపోయాడు.
పోలీసుల నుంచి కబురు
మరుసటి రోజు(ఆదివారం) విధులకు హాజరైన రాజశేఖర్‌కు ‘ఓ భూ తగదాలో నీ మీద కేసు ఉంది..దానిపై విచారణకు హాజరు కావాలని’ సబ్బవరం పోలీస్‌స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది. దీంతో ఆందోళనకు గురైన అతడు వెంటనే స్టేషన్‌కు వెళ్లగా ‘నువ్వు నిన్న పెళ్లిలో దొంగతనం చేశావు.. నీ మీద పెళ్లింటివారు కేసు పెట్టారు’ అని ఎస్‌ఐ వివరించాడు. దీంతో తాను ఎటువంటి చోరీ చేయలేదని రాజశేఖర్ చెప్పినా పోలీసులు పట్టించుకోలేదు. నేరం అంగీకరించాలని ఒత్తిడి తెచ్చారు. రాజశేఖర్ నేరం ఒప్పుకోకపోవడంతో ఆ రోజంతా పోలీస్‌స్టేషన్‌లోనే అతడ్ని ఉంచారు.
ఎస్‌ఐల ఓవరాక్షన్
ఈ క్రమంలో సోమవారం సబ్బవరం ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డి, భోగాపురం ఎస్‌ఐ మహేష్(పల్లా రాజేష్‌కు బంధువు), గాజువాక పోలీస్‌స్టేషన్‌కు చెందిన ఓ కానిస్టేబుల్(రాజేష్‌కు పరిచయస్తుడు) నేరాంగీకారం కోసం రాజశేఖర్‌పై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. నేరం ఒప్పుకోకపోతే గంజాయి కేసులో ఇరికిస్తానని ఎస్‌ఐ మహేష్ తనను బెదిరించినట్లు రాజశేఖర్ వివరించాడు. నేరం ఒప్పుకోమని పోలీసులు తనను తీవ్రంగా హింసించారని ఆరోపించాడు. తనకు ఎటువంటి నేర చరిత్ర లేదని..కేవలం పెళ్లింటివాళ్లు కక్షపూరిత ఆరోపణలు.. కేసుతో సంబంధం లేని ఎస్‌ఐ మహేష్ ఓవరాక్షన్ కారణంగానే తనకు దిక్కుతోచలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఆత్మహత్యాయత్నం చేయాల్సి వచ్చిందని వాగ్ములంలో పేర్కొన్నాడు.
అంతా గోప్యత: సబ్బవరం పోలీస్‌స్టేషన్‌లో జరిగిన ఘటనపై పోలీసులు నోరు మెదపడం లేదు. వాస్తవానికి పెళ్లింటిలో చోరీ జరిగినట్లు వరుడు రాజేష్ బంధువులు నోటిమాటతోనే ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుదారులు చేసిన ఆరోపణ మీద రాజశేఖర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో రాజేష్ బంధువైన ఎస్‌ఐ మహేష్ తనకు సంబంధం లేని కేసులో ఓవరాక్షన్ ప్రదర్శించారు. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన రాజశేఖర్ పోలీస్‌స్టేషన్‌లోనే గొంతు కోసుకున్నాడు. దీంతో నష్టనివారణ చర్యలకు దిగిన పోలీసులు బాధితుడ్ని సోమవారం పోలీస్ వాహనంలోనే సబ్బవరం పీహెచ్‌సీకి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం కేజీహెచ్‌కు తరలించారు. ఈ ఘటనపై సబ్బవరం ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డిని వివరణ కోరగా తమకు ఎటువంటి లిఖిత పూర్వక ఫిర్యాదు అందలేదని, రాజశేఖర్‌ను తాము అదుపులోకి తీసుకోలేదని చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment