‘మీరు రాసిందే నిజం.. చెప్పిందే సత్యం.. | police officer corruption in S Kota Police Station | Sakshi
Sakshi News home page

‘మీరు రాసిందే నిజం.. చెప్పిందే సత్యం..

Published Thu, Nov 9 2017 10:36 AM | Last Updated on Sat, Sep 22 2018 8:25 PM

police officer corruption in S Kota Police Station - Sakshi

సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఎస్‌ కోట సర్కిల్‌లో ఉన్నతాధికారి అవినీతి దందాలపై ఇటీవల కాలంలో సాక్షి ప్రచురించిన వరుస కథనాలు జిల్లా వ్యాప్తంగా సంచలనమైన విషయం విది తమే. సాక్షి కథనాలు పోలీస్‌ శాఖలో గుబులు రేపాయి. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ జి.పాలరాజు స్పందించారు. అసిస్టెంట్‌ ఎస్పీ అట్టాడ వెంకటరమణను విచారణాధికారిగా నియమించారు. కొద్ది రోజుల క్రితమే  వెంకటరమణ ఎస్‌ కోట వెళ్లి పలువురు సాక్షులను, అక్కడి సిబ్బం దిని విచారించారు. ఈ క్రమంలో తన దందా వ్యవహారాన్ని ఎవరు బయటపెట్టారనే కోణంలో సీఐ కూడా విచారణ చేస్తున్నారు. అనుమానం ఉన్నవారి కాల్‌ డేటా తీయించడం, స్టేషన్‌కు పిలిపించి ప్రశ్నించడం, తన అనుచరుల ద్వారా అడిగించడం, కొందరికి ఫోన్లు చేయించడం వంటి ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు తనకు ఎదురుతిరిగిన వారిని టార్గెట్‌ చేశారు. దానిలో భాగంగా కొంత కాలం క్రితం తనకు ఎదురుతిరిగిన మురళిని ముందుగా ఎంపిక చేసుకున్నా రు. ఆ తర్వాత ఏం జరిగిందనేది మురళి మాటల్లోనే..

నన్ను వాడుకున్నారు...
మాది ఎస్‌ కోట. ముస్లిం యువతిని ప్రేమించి పోలీసులు, మీడియా సమక్షంలోనే ఆదర్శ వివాహం చేసుకున్నాను. మా ప్రాంతంలో రక్తదాన, అన్నదాన కార్యక్రమాలు, పలు సేవా కార్యక్రమాలు చేస్తుంటాను. నాకు ఒక కారు, ఒక లారీ, ఒక ట్రాక్టర్‌ ఉన్నాయి. అవి కూడా అప్పు చేసి కొన్నాను. వాటితో ఇసుక, రాళ్లు రవాణా చేస్తుంటాను. ట్రాక్టర్‌ను వ్యవసాయపనులకు వినియోగిస్తుంటాను. మరోవైపు పోలీస్‌మిత్రగా కూడా సేవలందించేవాడిని. మా ప్రాంతానికి సీఐగా వచ్చిన రమణమూర్తితో పరిచ యం ఏర్పడింది. ఆయనకు అవసరమైనప్పుడల్లా నా కారు వినియోగించుకునేవారు. ఆయన కుటుంబ సభ్యులు కూడా నా కారులోనే తిరిగేవారు. నేనే డ్రైవర్‌గా కూడా పనిచేసేవాడిని. 

నిందితులతో కుమ్మక్కయ్యారు
పోలీస్‌ మిత్రగా నేను ఓ కేసు పట్టుకున్నాను. సీహెచ్‌ అబద్ధం అలియాస్‌ సురేష్‌ అనే వ్యక్తి ఉద్యోగాలిప్పిస్తామనంటూ కొందరి నుంచి రూ.30 లక్షల వరకూ వసూలు చేసి మోసం చేశాడు. అతనిని పట్టుకుని పోలీస్‌ స్టేషన్‌కు అప్పగిస్తే సీఐ రమణమూర్తి, కానిస్టేబుళ్లు శేఖర్, రాంనా యుడు, సూర్యనారాయణ అబద్ధంతో కుమ్మకై విడిచిపెట్టేశారు. దానికి ప్రతిఫలంగా కాపుసోంపురం–2లో యాభై సెంట్ల భూమిని రాయించుకున్నా రు. రెండు చెక్కులు కూడా తీసుకున్నారు. వాటిలో ఎంత రాశారనేది తెలియదు. నేనే కాదు నాలా మరికొంతమంది పోలీస్‌ మిత్రలు పట్టుకున్న కేసుల్లోనూ వీరు నిందితుల నుంచి డబ్బులు వసూలు చేసి వదిలేశారు. గంజాయి కేసులో దొరికిన చెవర్లేట్‌ కారును  వదిలేయడానికి డబ్బులు డిమాండ్‌ చేశారు. శెట్టి ఉమామహేశ్వరరావు అలియాస్‌ హుస్సేన్‌ బావ మరిది అకౌంట్‌లో ఆ కారు యజమాని రూ. 50వేలు డిపాజిట్‌ చేశారు. అతని నుంచి ఎస్‌ఐ నరేష్‌ ద్వారా సీఐకి ఆ డబ్బు చేరింది. శెట్టి ఉమామహేశ్వరరావు అనే వ్యక్తి గం జాయి స్మగ్లర్‌. ఇటీవల గంజాయి కేసులో అరెస్ట్‌ అయి ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్నారు. తాటిపూడి నుంచి తాగునీరు సరఫరా చేసేందుకు రోడ్డు పక్కన పైప్‌లైన్‌ పనులు జరుగుతున్నాయి. వారి నుంచి కూడా రూ. 25వేలు తీసుకున్నట్లు తెలిసింది. విశాఖ ఏజెన్సీకి చెందిన గంజాయి స్మగ్లర్‌ లారీని వదిలేసినందుకు సీఐకి రూ. 25లక్షలు ప్రతిఫలం దక్కినట్లు కూడా చెబుతున్నారు. ఉన్నతాధికారులు సరిగ్గా విచారిస్తే ఇవన్నీ బయటకొస్తాయి.

అడ్డుపడ్డానని కక్ష గట్టారు
ఇసుక అక్రమ వ్యాపారానికి సీఐ అండ పుష్కలంగా ఉంది. లారీ ఓనర్లంతా కలిసి ప్రతినెలా రూ. 5వేలు చొప్పున కానిస్టేబుల్‌ శేఖర్‌కు అందజేస్తుంటాం. ఆయన ద్వారా సీఐకి వెళుతుంది. ఇసుక లారీ ఓనర్ల మధ్య వివాదంలో అక్రమ ఇసుక రవాణా లారీని నేను మీడియాకు పట్టిచ్చాను. దాని వల్ల నెల నెలా వచ్చే మామూళ్లు ఆగిపోతాయనే కారణంతో సీఐ నాపై కక్ష గట్టారు. స్టేషన్‌కు రావాల్సిందిగా కొద్ది రోజులుగా కబురుపెడుతున్నారు. నాపై రౌడీషీట్‌ తెరుస్తున్నట్లు సమాచారం ఇచ్చారు. దానిని ఆపాలంటే రూ. 50వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. వారి నుంచి తప్పించుకుని తిరుగుతున్నాను. రౌడీషీట్‌ తెరిచేంత తప్పులు నేనేం చేశానో నాకే తెలియడం లేదు. అదే జరిగితే ఇక ఆత్మహత్యే శరణ్యం.

‘మీరు రాసిందే నిజం.. చెప్పిందే సత్యం.. ఎస్‌ కోట పోలీస్‌ సర్కిల్‌ పరిధిలోని అధికారి అక్రమాలు అన్నీ ఇన్నీ కావు.. వాటిలో కొన్నిటికి నేనే సాక్షిని. ఇప్పుడు నాపై కక్ష కట్టారు. రౌడీషీట్‌ తెరుస్తామని బెదిరిస్తున్నారు. నన్ను కాపాడమని పోలీసుల్లో ఎవరికీ చెప్పుకోలేక మిమ్మల్ని ఆశ్రయించాను. సీఐ అక్రమాలపై ఎక్కడైనా, ఎవరిదగ్గరైనా సాక్ష్యం చెప్పడానికైనా నేను సిద్ధం.’
– ‘సాక్షి’తో ఒకప్పటి పోలీస్‌ మిత్ర వాకాడ మురళి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement