రాజమహేంద్రవరం క్రైం: పోలీస్‌స్టేషన్లు సెటిల్‌మెంట్లకు కేంద్రాలుగా మారుతున్నాయి. ఫిర్యాదు వచ్చిన వెంటనే కేసులు నమోదు చేసి కోర్టుకు పంపకుండా తమ స్వలాభం కోసం హౌస్ ఆఫీసర్లు ఇరువర్గాల వద్ద లంచాలు గుంజుకోవడానికే ప్రయత్నిస్తున్నారు. జిల్లాలోని దాదాపు ప్రతి పోలీస్‌స్టేషన్‌లో సెటిల్‌మెంట్లు ఎక్కువగా కొనసాగుతున్నాయి. దీనికి తోడు స్థానిక రాజకీయ నేతల అంగీకారం లేనిదే ఆ నియోజకవర్గంలోని పోలీస్ స్టేషన్‌లో హౌస్ ఆఫీసర్ విధులు నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహించాలంటే ఆయా నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులను ప్రసన్నం చేసుకొని అనంతరం వారు చెప్పిన రేటు చెల్లించిన తరువాత పోస్టింగ్‌లు తీసుకోవలసి వస్తుందని పోలీస్ అధికారులే బహిరంగంగా చెబుతున్నారు. ఇలా చెల్లించిన మొత్తాన్ని రాబట్టుకోవాలని కొందరు పోలీస్ అధికారులు లంచాలకు
పాల్పడుతున్నారు.
ఏసీబీకీ చిక్కిన సౌత్‌జోన్ డీఎస్పీ
అలాగే 2017 మే 31వ తేదీన రాజమహేంద్రవరం రూరల్, రాజవోలు గ్రామానికి చెందిన పాస్టర్ తాడికొండ విల్సన్ కుమార్, సామర్లకోటకు చెందిన కీర్తిప్రియ అనే మహిళ వద్ద ఇల్లు కొన్నాడు. ఇంటి అగ్రిమెంట్ చేసుకున్న తరువాత కీర్తిప్రియ ఇంటికి మరికొంత ఎక్కువ సొమ్ము ఇవ్వాలని డిమాండ్ చేయడంతో వివాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 26వ తేదీన విల్సన్ కుమార్‌పై కీర్తిప్రియ ధవళేళ్వరం పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టింది. ఈ కేసులో సౌత్‌జోన్ డీఎస్పీ నారా యణరావు, కీర్తిప్రియ వద్ద లంచం తీసుకొని వారికి అనుకూలంగా కేసు రాజీ చేసుకునే విధంగా విల్సన్ కుమార్‌పై వత్తిడి తెచ్చాడు. రూ.ఏడు లక్షల నష్టానికి విల్సన్, కీర్తిప్రియతో రాజీ చేసుకున్నాడు.
కేసు రాజీ కుదుర్చుకున్న అనంతరం సౌత్‌జోన్ డీఎస్పీ పి.నారాయణరావు తన వద్ద ఉన్న కానిస్టేబుల్ రమేష్‌తో ఫోన్లు చేయిస్తూ రాజీ కుదుర్చుకున్న తరువాత తనకు రావలసిన వాటా రూ.2 లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడు. దీంతో విల్సన్ కుమార్ రూ.50 వేలు డీఎస్పీకి, రూ.5 వేలు కానిస్టేబుల్ రమేష్‌కు ఇచ్చే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీనిపై బాధితుడు విల్సన్ కుమార్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. సౌత్ జోన్ డీఎస్పీ కార్యాలయంలో రూ.55 వేలు కానిస్టేబుల్ రమేష్‌కు ఇస్తుండగాఏసీబీ అధికారులు మే 31వ తేదీ గురువారం రాత్రి వలపన్ని పట్టుకున్నారు. ఈ లంచం కానిస్టేబుల్ రమేష్‌కు ఇవ్వాలని చెప్పి బయటకు వెళ్లిపోతున్న సౌత్‌జోన్ డీఎస్పీ పి.నారాయణరావును గేటు వద్ద అరెస్ట్ చేశారు. పోలీస్ శాఖలో కింది నుంచి పై స్థాయి వరకూ అవినీతి మయంగా మారింది. కొందరు అవినీతి పోలీస్ అధికారుల వలన మొత్తం వ్యవస్థకే చెడ్డ పేరు వస్తోంది.
పట్టుబడిన పోలీస్ అధికారులు వీరే
అవినీతికి పాల్పడుతూ పోలీస్ అధికారులు ఏసీబీకీ చిక్కుతున్నారు. 2016 మార్చి 15వ తేదీన రాజమహేంద్రవరం ప్రకాష్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో పని చేస్తున్న ఏఎస్సై రూ.5 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. అలాగే 2016 డిసెంబర్ 12వ తేదీన అమలాపురం రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా పని చేస్తున్న జక్కి నాగేశ్వరరావు, హోమ్ గార్డు గంటి శ్రీనివాసరావు హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అవనిగడ్డ టెంపోరావుకు చెందిన ఒక కేసు విషయంలో రూ.15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. 2017 ఫిబ్రవరి 22వ తేదీన ద్రాక్షారామ పోలీస్‌స్టేషన్‌లో ఎస్సైగా పని చేస్తున్న ఫజల్ రహ్మన్, రామచంద్రపురం మండలం కాపవరం గ్రామానికి చెందిన యనమదల భరత్ వద్ద ఒక కేసులో ముద్దాయిల్ని అరెస్ట్ చేయడానికి, చార్జ్‌షీట్ దాఖలు చేయడానికి రూ.5 వేలు లంచం డిమాండ్ చేశాడు. బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో రెడ్ హేండెడ్‌గా చిక్కాడు.
Comments
Please login to add a commentAdd a comment