ప్రతీకాత్మక చిత్రం
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల : పోలీస్‌శాఖలో అవినీతి సర్వసాధారణం. కానిస్టేబుల్ నుంచి ఉన్నతాధికారి వరకు మామూళ్లకు అతీతులు కాదనే విషయం బహిరంగ రహస్యమే. కానీ పోలీస్‌స్టేషన్‌లలో ఎస్‌ఐ, సీఐ, డీఎస్‌పీ స్థాయి అధికారులకు నెలానెలా మామూళ్లు వసూలు చేసి అందించే ప్రత్యేక వ్యవస్థ ఉందని చాలా మందికి తెలియదు. పోలీస్‌స్టేషన్ల పరిధిలో గుట్టుగా సాగే ఈ వ్యవహారం గురువారం బట్టబయలైంది. రాష్ట్రంలో ఆయా పోలీస్‌స్టేషన్ల పరిధిలో మామూళ్లు వసూలు చేసే పోలీసుల వివరాలను నిఘా వర్గాలు సేకరించాయి. జిల్లాల్లో పోలీస్‌స్టేషన్ల వారీగా ఎస్‌ఐ, సీఐ, డీఎస్‌పీ స్థాయి అధికారులకు మామూళ్లు వసూలు చేసి ఇచ్చే కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్‌ఐల జాబితాను రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డికి అందజేశాయి.
రాష్ట్ర వ్యాప్తంగా 391 మంది పోలీసులతో కూడిన ఈ జాబితాలో ఉమ్మడి ఆదిలాబాద్‌లోని నాలుగు జిల్లాలకు చెందిన 19 మంది ఐడీ పార్టీ, క్రైం పార్టీ పోలీసుల పేర్లు కూడా ఉండడం విశేషం. ఏ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఎవరు ఎవరి కోసం మామూళ్లు వసూలు చేస్తారనే వివరాలు, పోలీసుల పేర్లు, గుర్తింపు నెంబర్‌తో సహా పోలీస్ పెద్దల దృష్టికి వచ్చింది. ఈ మేరకు గురువారం మధ్యాహ్నం నుంచి పలు సామాజిక వె»Œబ్‌సైట్లలో కూడా ‘అవినీతి పోలీసుల చిట్టా’ పేరుతో 391 మంది పోలీసుల జాబితా చక్కర్లు కొట్టింది. దీంతో పోలీసులు అభాసుపాలయ్యారు. ఈ వివరాలన్నీ అధికారికమే కావడంతో పోలీస్‌స్టేషన్లలో ‘కలెక్టర్’ల పేరుతో గుట్టుగా సాగే మామూళ్ల వసూలు వ్యవహారం బట్టబయలైంది.
ఆదిలాబాద్ టౌన్‌తోపాటు మండలాల్లో...
ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని ఆరు పోలీస్‌స్టేషన్లలో మామూళ్లు వసూలు చేసే వ్యవస్థ కొనసాగుతోందని పోలీస్ నిఘా వర్గాల నివేదికలో తేలింది. ఆదిలాబాద్ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఇద్దరు కానిస్టేబుళ్లు వసూల్‌రాజాలుగా నిలిచారు. మావల, ఆదిలాబాద్ రూరల్, ప్రస్తుతం వన్‌టౌన్‌కు అటాచ్ అయిన మహిళా పోలీస్‌స్టేషన్లలో కానిస్టేబుళ్లు పై అధికారులకు మామూళ్లు వసూలు చేసే పనిలోనే ఉంటారు. మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న తాంసి మండలంలో వసూళ్ల కోసం ఓ హెడ్ కానిస్టేబుల్‌ను నియమించారు. తాంసి పరిధి దాటితే మహారాష్ట్రలోని యావత్‌మాల్ జిల్లా ఉంది. ఇక్కడ పాటన్‌బోరి ప్రాంతం పేకాట, మట్కా, సట్టా వంటి జూదానికి పెట్టింది పేరు. ఇక్కడ ఆడేందుకు కరీంనగర్, నిజామాబాద్, హైదరాబాద్ నుంచి కూడా కస్టమర్లు వస్తున్నందున తాంసి పోలీసులకు సరిహద్దు వద్ద పండుగే. ఈ నేపథ్యంలో ఇక్కడ పనిచేసే ఎస్‌హెచ్‌ఓకు మామూళ్లు వసూలు చేసి ఇచ్చేందుకు ఏకంగా ఓ హెడ్‌కానిస్టేబులే పనిచేస్తుండడం గమనార్హం.
మంచిర్యాల జిల్లాలో 8మంది..
పోలీస్ అక్రమాలకు పేరుమోసిన మంచిర్యాల జిల్లాలో ఎనిమిది మంది పోలీసులు శాంతిభద్రతలను గాలికి వదిలి మామూళ్లు వసూళ్లకు పనిచేస్తున్నారు. ఆదాయం అధికంగా ఉండే పోలీస్‌స్టేషన్లతో పాటు కొత్త పోలీస్‌స్టేషన్లలో కూడా ఎస్‌ఐ, సీఐ స్థాయి అధికారులు ఈ వసూల్‌రాజాల వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం విశేషం. అధికాదాయ వనరులున్న జైపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఏకంగా ఏఎస్‌ఐకే ఈ బాధ్యతలు అప్పగించినట్లు పోలీస్ నిఘా వర్గాలు స్పష్టం చేశాయి. ఇక జిల్లాలో అక్రమ దందాలకు నిలయంగా మారిన జన్నారం పోలీస్‌స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్ మామూళ్లు వసూలు చేసే పనిలో ఉన్నాడట. బెల్లంపల్లి పోలీస్‌స్టేషన్‌లో కూడా హెడ్ కానిస్టేబుల్‌కే సంబంధిత ఉన్నతాధికారి వసూళ్ల డ్యూటీ అప్పగించారు. హెడ్ కానిస్టేబుల్‌తో పాటు ఓ హోంగార్డు కూడా ఇదే పనిలో ఉండడం గమనార్హం. లక్సెట్టిపేట, కోటపల్లి, తాండూర్‌లలో కానిస్టేబుళ్లు వసూళ్ల దందా సాగిస్తున్నారు.
కాగజ్‌నగర్‌లో ఇద్దరు కానిస్టేబుళ్లకు డ్యూటీ
కుమురంభీం జిల్లాలో ప్రధాన ఆదాయవనరు కాగజ్‌నగర్. ఇక్కడ అక్రమ దందాలకు అడ్డూ అదుపూ ఉండదు. ఇక్కడి పోలీస్‌స్టేషన్‌లో ఉన్నతాధికారి పోస్టు కోసం భారీ ప్రయత్నాలు సాగుతాయి. ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఒక్క పోలీసుతో మామూళ్ల వసూలు కష్టం. అందుకే ఇద్దరు కానిస్టేబుళ్లకు వసూళ్ల బాధ్యతలు అప్పగించినట్లు పోలీస్ ఇంటలిజెన్స్ వర్గాలు నిగ్గు తేల్చాయి. ఆసిఫాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ కానిస్టేబుల్‌కు వసూళ్ల పనిలో ఉన్నాడు. నిర్మల్ జిల్లా పరిధిలోని ఖానాపూర్ పోలీస్‌స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్, ముథోల్‌లో కానిస్టేబుల్ వసూళ్ల బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
మిగతా మండలాల్లో సక్రమమేనా..?
ఉమ్మడి జిల్లాలో 70 మండలాలు ఉన్నాయి. ఆదిలాబాద్, బెల్లంపల్లి, మంచిర్యాలల్లో ఒకటికి మించి పోలీస్‌స్టేషన్లు కొనసాగుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో మండలాలతో సంబంధం లేకుండా ప్రత్యేకంగా పోలీస్‌స్టేషన్లు ఉన్నాయి. కానీ పోలీస్ ఇంటలిజెన్స్, స్పెషల్ బ్రాంచిల నుంచి విడుదలైనట్లు చెపుతున్న వసూల్‌రాజాల జాబితాలో జిల్లాకు చెందిన 19 మంది పోలీసుల పేర్లే ఉన్నాయి. దీన్నిబట్టి మిగతా పోలీస్‌స్టేషన్‌లలో అన్నీ సక్రమమే అనుకుంటే పొరబాటే. అక్రమాలకు అలవాటుపడ్డ పోలీస్ అధికారులు కొన్ని చోట్ల ప్రత్యేకంగా సిబ్బందిని నియమించి వసూలు చేస్తుంటే, మరికొన్ని చోట్ల నేరుగానే రంగంలోకి దిగుతున్నారు. కొత్త జిల్లాలు ఏర్పాటు కావడంతో ఇటీవల తరచూ పోలీస్‌స్టేషన్లలో ఎస్‌ఐ, సీఐల మార్పులు జరిగాయి. ఈ నేపథ్యంలో ఇంకా కుదురుకోని కొందరు అధికారులు వసూళ్ల కోసం ప్రత్యేకంగా పోలీసులను నియమించుకోలేదు. ఆదాయ వనరులు అధికంగా ఉన్న పోలీస్‌స్టేషన్లకు సీఐ, ఎస్‌ఐల బదిలీల్లో చేతులు మారే లక్షల రూపాయలను బట్టే వారి ఆదాయం ఏ మేరకు ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
వసూల్‌రాజాల డ్యూటీ ఏంటంటే...
స్టేషన్ ‘కలెక్టర్’గా పిలవబడే వసూల్‌రాజా అంటే ఆ స్టేషన్ పరిధిలో అందరికీ హడలే. పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగే అక్రమాలన్నీ ఈ స్టేషన్ ‘కలెక్టర్’ల కనుసన్నల్లోనే సాగుతాయి. మద్యం దుకాణాలు, బార్లు, గుడుంబా తయారీదారులు, కల్లు సొసైటీల నుంచి ప్రతినెలా ముందుగానే నిర్ధేశించిన మేరకు వసూలు చేయడం జరుగుతుంది. ఎస్‌హెచ్‌ఓలు నేరుగా మాట్లాడి సెటిల్ చేసే సివిల్ వివాదాలకు సంబంధించి కూడా క్యాష్ కలెక్షన్ బాధ్యత వీరిదే. సంబంధిత స్టేషన్ అధికారికి ‘రైట్‌హ్యాండ్’గా వ్యవహరించే ఈ స్టేషన్ ‘కలెక్టర్’ అంటే అక్కడ పనిచేసే ఇతర పోలీసులకు కూడా హడలే.
Comments
Please login to add a commentAdd a comment