సాక్షి, కర్నూలు: పోలీసు వ్యవస్థకు అవినీతి మరక అంటుకుంది. అడ్డగోలు ఆదాయానికి తెరతీస్తున్న కొందరు సిబ్బంది అక్రమాలను పెంచిపోషిస్తున్నారు. ఉన్నతాధికారుల కళ్లుగప్పి వక్రమార్గంలో పయనిస్తున్నారు. అడ్డదారినే రాదారిగా ఎంచుకుంటున్నారు. ఏళ్ల తరబడి పాతుకుపోయిన కొందరు ఘనాపాటీలు తమదైన దర్పాన్ని ప్రదర్శిస్తూ సొంత శాఖనే శాసిస్తున్నారు. ఓ దశలో ఉన్నతస్థాయి పైరవీలతో జిల్లా అధికారులను సైతం భయపెట్టేందుకు యత్నించారు. ఈ పరిస్థితికి చెక్ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇలాంటి వారిపై బదిలీ, సస్పెషన్ వేటు వేసేందుకు రంగం సిద్ధమవుతోంది.పోలీసు శాఖలో ప్రక్షాళనకు సర్కారు నిర్ణయించింది. జిల్లాలో పనిచేస్తున్న పోలీసు ఉద్యోగుల్లో సివిల్ పంచాయతీలు చేసే వారిని, అవినీతిపరులను గుర్తించి వారి సస్పెండ్ చేయడానికి రంగం సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. ఇప్పటి వరకు పని చేస్తున్న ఎస్‌ఐలు, సీఐల్లో సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహిస్తున్నదెవరు, నిర్లక్ష్యంగా పనిచేస్తున్నది ఎవరు, శాంతిభద్రతల పరిరక్షణలో విఫలమవుతున్న వారి వివరాలతో జాబితాను సిద్ధం చేయమని ప్రభుత్వం ఆదేశించింది.
ఎస్‌ఐలు, సీఐల్లో ఎవరెవరిపై శాఖపరమైన ఫిర్యాదులు నమోదయ్యాయి.. వాటిలో ఎంత మందిపై విచారణలు(చార్జి మెమోలు, ఓరల్ ఎన్‌క్వైరీస్)పెండింగ్‌లో ఉన్నాయో కూడా జాబితా తయారు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఇప్పటి వరకు లూప్‌లైన్(రైల్వే, సీఐడీ, ఇంటెలిజెన్స్ తదితర)లో పనిచేస్తున్న ఎస్‌ఐలు, సీఐలకు ప్రాధాన్యత కల్పించాలని భావిస్తున్నారు. పోస్టింగ్‌ల కోసం రాజకీయ నాయకులతో ఒత్తిడి చేయించే వాళ్లు, డబ్బులతో పైరవీలు చేస్తున్న వారి వివరాలపై ఆరా తీస్తున్నారు. ఈ ప్రక్రియ మొత్తం ముగిసిన తర్వాత ఎస్‌ఐలు, సీఐల స్థానచలనం చేసే అవకాశమున్నట్లు సమాచారం.
పోలీసుస్టేషన్‌లో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు..
అన్ని పోలీసుస్టేషన్లలో మౌలిక సదుపాయాలు కల్పించాలని డీజీపీ రాముడు ఆదేశించినట్లు సమాచారం. ఫిర్యాదుదారులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు స్టేషన్లలో తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాలని రాయలసీమ ఐజీ ఎస్పీకి సూచించినట్లు తెలుస్తోంది. ఫిర్యాదుదారులు కూర్చోవడానికి వీలుగా ప్రత్యేక గదుల(విజిటర్స్ రూమ్) ఏర్పాటు చేయనున్నారు. ఈ మొత్తం ప్రక్రియ రెండు నెలల్లో ముగించేలా ప్రణాళికలు సిద్ధం రూపొందిస్తున్నారు.
వేటుకు వేళాయె !
Published Fri, Aug 22 2014 2:31 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM
Advertisement