జనగామ డీఎస్పీ వ్యవహారం నేపథ్యంలో గుబులు
సాక్షి, హన్మకొండ : జనగామ డీఎస్పీ కార్యాలయం కేంద్రంగా జరిగిన అవినీతి వ్యవహారంలో పాలుపంచుకున్న అధికారుల గుండెల్లో గుబులు రేగుతోంది. ఏసీబీ అధికారుల చేతికి చిక్కిన తర్వాత జరుగుతున్న విచారణలో ఒక్కో అవినీతి వ్యవహారం వెలుగు చూస్తోంది. దీనితో డీఎస్పీ కూర సురేందర్ అవినీతి కార్యకలాపాలకు సహకరించిన, భాగస్వామ్యం పంచుకున్న పోలీసు సిబ్బందిలో టెన్షన్ మొదలైంది. ముఖ్యంగా డీఎస్పీ తర్వాత స్థాయి అధికారుల్లో ఈ భయం పెరుగుతోంది. డీఎస్పీ మద్దతుతో ఇష్టారాజ్యంగా రెచ్చిపోయిన సిబ్బందిపైనా ఏసీబీ దృష్టి సారించింది.
సురేందర్ ఏసీబీకి చిక్కేవరకు ఒక్కరోజు ముందు డీఎస్పీ కార్యాలయం కేంద్రంగా నోట్ల కట్టలు చేతులు మారినట్లుగా ఆరోపణలు వినిపించాయి. కేవలం ఒక్క వ్యక్తి ఇంత భారీస్థాయిలో అవినీతి వ్యవహారాలు చక్కబెట్టడం కష్టంతో కూడుకున్న పని. దీనితో డీఎస్పీ కూర సురేందర్ అవినీతి వ్యవహరాల్లో మరికొందరు పోలీసు అధికారులు, సిబ్బంది పాత్ర ఏంటనే దానిపై ఏసీబీ అధికారులు దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. ఫిర్యాదుదారు, కక్షిదారులు ఇరువురిని ఇబ్బందుల పాలు చేసి డబ్బులు గుంజడంపై పోలీసుశాఖ ఉన్నతాధికారులే విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
తొలుత డీఎస్పీ కార్యాలయం నుంచి బెదిరింపు ఫోన్‌కాల్స్ వెళ్లడం దాని ఆధారంగా కింది స్థాయి సిబ్బంది విచారణ పేరుతో పదేపదే వేధింపులకు గురిచేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. వివిధ సమస్యలతో పోలీసు స్టేషన్ గడప తొక్కితే.. చట్ట ప్రకారం సమస్యలను పరిష్కరించకుండా సివిల్ సెటిల్‌మెంట్ల అడ్డాగా ఠాణాను మార్చడంపై ఇటు ఏసీబీతోపాటు అటూ పోలీసు బాస్ కూడా ఆగ్రహంగా ఉన్నారని ఓ ఉన్నతాధికారి తెలిపారు. జనగామ డీఎస్పీ కార్యాలయం వేదికగా జరిగిన అవినీతి వ్యవహారంలో ఎవరెవరు డీఎస్పీకి సహకరించారనే సమచారాన్ని ఏసీబీతోపాటు పోలీసుబాస్‌లు సేకరించారు. అతిత్వరలోనే వీరిపై చర్యలు ఉపక్రమించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏసీబీకి చిక్కి వారం రోజులు దాటిపోయినా.. ఇప్పటికీ జనగామ డీఎస్పీ అవినీతి వ్యవహరాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
జనగామ-చేర్యాల రోడ్డులో ఉన్న ఓ తోట పేకాట స్థావరంగా పేరుగాంచింది. దీన్ని మూయించాల్సిన డీఎస్పీ అందుకు విరుద్ధంగా వ్యవహరించారు. పేకాటను నిర్వహిస్తున్న వ్యక్తులను స్వయంగా పిలుపించుకున్నారు. నెలవారీ మాముళ్లను రూ.1.50 లక్ష దగ్గర బేరం కుదుర్చుకున్నారు. దీనితో పేకాట స్థావరంగా ఉన్న తోటకాస్త పేకాట క్లబ్బు స్థాయికి ఎదిగింది. దీనిపై నలువైపులా విమర్శలు రావడంతో తర్వాత కొంచెం వెనక్కితగ్గారు.
ఆటోవాలాలు, రోజువారీ కూలీల రక్తాన్ని పీల్చే మట్కా వ్యాపారులతోనూ ములాఖాత్ అవడం ఇక్కడి అవినీతి స్థాయికి అద్దం పడుతోంది. మట్కా మాఫియా నుంచి ఏకమొత్తంగా రూ.3 లక్షలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. పోలీసుల అండ లభించడంతో కొంతకాలం పాటు ఇక్కడ మట్కా వ్యాపారం జోరుగా సాగింది.
‘ఖాకీ’ల్లో కలవరం
Published Sat, Sep 5 2015 4:25 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM
Advertisement