సాక్షి ప్రతినిధి, ఏలూరు: అవినీతి ఆరోపణలు రుజువు కావడంతో ప్రస్తుతం వీఆర్‌లో ఉన్న ఎస్సై ఎం.కేశవరావును పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ మేరకు గుంటూరు ఐజీ, ఏలూరు రేంజ్ డీఐజీ ఇన్‌చార్జి కేవీవీ గోపాలరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను ఎస్పీ ఎం.రవిప్రకాష్ ధ్రువీకరించారు. 2016 అక్టోబర్ 12న జంగారెడ్డిగూడెం పోలీ స్‌స్టేషన్‌లో విధుల్లో చేరిన ఎం.కేశవరావు ను పది నెలల కాలంలోనే అంటే 2017 ఆగస్టు 22న పలు అవినీతి ఆరోపణలపై జిల్లా ఎస్పీ వీఆర్‌కు పంపారు. ఎస్సై ఎం.కేశవరావుపై పునరావృతమవుతున్న అవినీతి ఆరోపణలు, ఫిర్యాదుల నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాష్ అప్పట్లో బదిలీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
దీనిపై ‘సాక్షి’ లో పలు కథనాలు ప్రచురితమయ్యాయి. ఎస్సై కేశవరావు ఆది నుంచి వివాదాస్పదంగా వ్యవహరించడంతో పాటు పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. గతంలో జంగారెడ్డిగూడెం సబ్‌డివిజన్ పరిధిలో ధర్మాజీగూడెం పోలీస్‌స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వహించిన సమయంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా పోలీస్‌శాఖ విడుదల చేసిన స్టిక్కర్ల విషయంలో లక్షలాది రూపాయలు వసూలు చేసినట్టు అప్పట్లో ఆరోపణలు ఎదుర్కొన్నారు. దీంతో ఆయన్ను అక్కడి నుంచి వీఆర్‌కు పంపారు. ఆ తరువాత వీఆర్ నుంచి డీసీఆర్‌బీకి బదిలీ చేశారు. ఆ తరువాత డీసీఆర్‌బీ నుంచి జంగారెడ్డిగూడెం బదిలీ చేశారు. అయితే ఎస్సై కేశవరావుపై డీజీపీ, డీఐజీ, ఎస్పీకి కూడా పలు ఫిర్యాదులు అందాయి.
బియ్యం మాఫియాతో సంబంధాలు
గ్రానైట్ రాళ్లు రవాణా చేసే భారీ వాహనాల నుంచి, వ్యభిచార గృహాల నుంచి వసూళ్లకు పాల్పడటమే కాకుండా, అక్రమంగా రవాణా చేస్తున్న రేషన్ బియ్యం మాఫియాతో కూడా కేశవరావుకు సం బంధాలు ఉండటంతో ఉన్నతాధికారులు అతడిపై లోతుగా విచారించారు. వీఆర్‌లో ఉన్న కేశవరావుపై ఉన్న ఫిర్యాదులు, ఆరోపణలపై శాఖాపరమైన దర్యాప్తు చేసి, ఆరోపణలు రుజువు కావడంతో సస్పెండ్ చేస్తున్నట్టు ఉన్నతాధికారులు ఉత్తర్వులలో పేర్కొన్నారు. ఇటీవల జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్‌పై పత్రికల్లో వచ్చిన వార్తల వెనుక కూడా కేశవరావు ఉన్నట్టు పోలీసు అధికారులు అనుమానిస్తున్నారు.
లక్షలాది రూపాయలు చేతులు మారినట్టు..
గత ఏడాది జనవరిలో శ్రీనివాసపురంలో ఖమ్మం జిల్లాకు చెందిన ఒక వ్యక్తి గాల్లోకి రివ్వాలర్ పేల్చి కోడిపందేలు ప్రారంభించిన కేసులో లక్షలాది రూపాయలు చేతులు మారి నట్టు ఆరోపణలు ఉన్నాయి. అలాగే జంగారెడ్డిగూడెంలో ఒక కర్మాగారం నుంచి కేశవరావు లక్ష రూపాయలు తీసుకున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. సివిల్ వివాదానికి సంబంధించి ఒక వ్యక్తి నుంచి రూ. 20 వేలు తీసుకోగా, అతనికి న్యాయం చే యకపోవడంతో ఆ వ్యక్తి, డీఐజీ, డీజీపీ, ఎస్పీకి నేరుగా ఫిర్యాదు చేశారు. స్టేషన్‌లో కొంతమంది సిబ్బందిని, కొంతమంది బయట వ్యక్తులను ఏజెంట్‌లుగా నియమించుకుని పెద్దెత్తున వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి.
క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులు, పశువుల వ్యాపారులు, కోడిపందేలు, పేకాట నిర్వాహకుల నుం చి కూడా రోజూవారీ మామూళ్లు వసూలు చేస్తున్నట్లు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. పందులు పెంపకందారులను కూడా కేశవరావు వదలలేదని బాధితులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. భార్యభర్తల కేసు స్టేషన్‌కు వస్తే ఇరువర్గాలను కౌన్సెలింగ్ చేయాల్సింది పోయి పెద్దెత్తున వసూళ్లకు పాల్పడుతున్నట్లు, ఇక ఇసుక మాఫియా నుంచి ప్రత్యేక వసూళ్ల కోసం కొంతమంది వ్యక్తులను నియమించుకున్నట్టు ఫిర్యాదులు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment