కనిపించని నాలుగో సింహం
♦ రాజధానిలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యం
♦ దుండగులు, ఉగ్రవాదులను అడ్డుకునే నైపుణ్యం కరువు
♦ కొరవడిన ‘ఎమెర్జెన్సీ రెస్పాన్స్ స్ట్రాటజీ’
దర్జాగా రావొచ్చు... ఆయుధాలతో విధ్వంసం సృష్టించొచ్చు... కావాల్సినంత దోచుకోవచ్చు... ఎంచక్కా నగరం నుంచి జారుకోవచ్చు... పోలీసులు అడ్డుకోలేరు... సమాచారం ఇచ్చినా పట్టకోలేరు. కళ్లముందే పారిపోతున్నా కట్డడి చేయనూలేరు. ఇదీ అమరావతిలో ఖాకీల దుస్థితి. బెజవాడలో బంగారు ఆభరణాల కార్ఖానాపై దాడి ఉదంతం భద్రతా వ్యవస్థ డొల్లతనాన్ని బట్టబయలు చేసింది.
సాక్షి, అమరావతి బ్యూరో : రాజధానిలో భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఏదైనా భారీ దోపిడీ జరిగితే వెంటనే స్పందించేందుకు పోలీసు యంత్రాంగం సిద్ధంగా లేదు. ఇందుకు మంగళవారం రాత్రి విజయవాడ గోపాలరెడ్డి రోడ్డులో జరిగిన భారీ దోపిడీ నిదర్శనమనే వాదన వినిపిస్తోంది. పోలీసులు కేవలం డ్రంక్ అండ్ డ్రైవ్, ట్రాఫిక్ కేసుల నమోదుకు మాత్రమే పరిమితమవుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొన్ని నెలలుగా కనీసం నాకాబందీ కూడా నిర్వహించడంలేదు. దీంతో నేరస్తులు నిర్భయంగా తమ పని పూర్తి చేసుకుని సులభంగా నగరం దాటి వెళ్లిపోతున్నారు. నలువైపుల నుంచి నగరంలోకి వచ్చి వెళ్లేందుకు మార్గాలు ఉండటం, ఎక్కడా పెద్దగా నిఘా లేకపోవడం నేరస్తులకు కలిసివస్తోంది.
మన పోలీసుల వైఫల్యం ఇలా...
♦ మంగళవారం రాత్రి 9.50గంటలు : అంతర్రాష్ట దొంగల ముఠా విజయవాడలో నగల కార్ఖానాపై దోపిడీ చేసి అక్కడి నుంచి జారుకుంది.
♦ రాత్రి 10గంటలు : ఓ వ్యక్తి నేరుగా పోలీస్ కమిషర్ గౌతం సవాంగ్‌కు ఫోన్ చేసి సమాచారం అందించారు. పది నిమిషాల్లోనే పోలీసులకు సమాచారం చేరింది. ఆయన వెంటనే కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల ఎస్పీలకు సమాచారం అందించారు. కానీ, నగర సరిహద్దులను వెంటనే దిగ్బంధించలేకపోయారు.
♦ రాత్రి 10.10గంటలు : దోపిడీ ముఠా ఎంచక్కా వారధి దాటింది. అక్కడికి కొద్దిదూరంలోనే డీజీపీ కార్యాలయం, మంగళగిరి ఏపీఎస్పీ ఆరో బెటాలియన్ కేంద్రంలో పోలీసు బలగాలు ఉన్నాయి. వారూ దోపిడీ ముఠాను అడ్డుకునేందుకు ప్రయత్నించలేదు.
♦ రాత్రి 10.24 గంటలు : దోపిడీ ముఠా జాతీయ రహదారి మీద ఉన్న కాజా టోల్‌గేట్‌ను దాటింది. అక్కడ కూడా ఆ ముఠాను అడ్డుకునేందుకు ప్రయత్నించనే లేదు.
♦ రాత్రి 10.40 గంటలు : దోపిడీ ముఠా గుంటూరు నగరంలోని కింగ్ హోటల్ వద్దకు చేరుకుంది. అక్కడ ఒక ఎస్‌ఐ, నలుగురైదుగురు కానిస్టేబుళ్లు మాత్రమే ఉన్నారు. కానీ దోపిడీ దొంగలు తమ వాహనాన్ని ఆపకుండా అతి వేగంగా దూసుకుపోయారు. పోలీసులు అడ్డుకోలేకపోయారు.
♦ రాత్రి 10.50గంటలు : గుంటూరులోని చుట్టుగుంట సెంటర్ వద్ద ఒక ఎస్‌ఐ, ఐదారుగురు పోలీసులు మాత్రమే కాపు కాశారు. ముఠా జాతీయ రహదారి వైపు వెళ్తున్నట్లు గుర్తించి అర్బన్ ఎస్పీకి సమాచారం అందించారు.
♦ రాత్రి 11.10 గంటలు : చిలకలూరిపేట సమీపంలోని వై.జంక్షన్ వద్దకు గుంటూరు అర్బన్ ఎస్పీ విజయారావు, డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ శ్రీనివాసరావు పోలీసు బలగాలతో చేరుకున్నారు. జాతీ య రహదారిని దిగ్బంధించి వాహనాలను తనిఖీ చేయసాగారు.
ఇలా తప్పించుకున్నారు..
చిలకలూరిపేట సమీపంలోని వై.జంక్షన్ వద్ద ఎక్కడ రోడ్డు బ్లాక్ చేశారో పోలీసులు అంతా అక్కడే ఉండిపోయారు. దీంతో వాహనాలు తనిఖీ చేస్తున్నారని అక్కడికి అర కిలోమీటరు దూరం నుంచే దొంగలు గుర్తించారు. తమ వాహనాన్ని అక్కడే వదిలేసి బంగారం, నగదు తీసుకుని పొలాల్లోకి పరుగుపెట్టారు. అదే పోలీసు అధికారులు కేవలం రోడ్డు బ్లాక్ చేసిన చోట మాత్రమే కాకుండా ఒక కిలో మీటరు ముందు వరకు కూడా సాయుధులైన పోలీసులను మోహరించి ఉంటే దొంగలకు ఆ అవకాశం ఉండేది కాదు.
నిద్దరోతున్న భద్రతా వ్యవస్థ
రాజధాని స్థాయికి తగ్గట్లుగా విజయవాడ–గుంటూరులో భద్రతా వ్యవస్థను బలోపేతం చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. రాత్రివేళల్లో గస్తీ అన్నదే లేకుండాపోయింది. అందుకు తగిన వాహనాలు కావాలన్న ప్రతిపాదనను పట్టించుకోలేదు. ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో సీసీ కెమెరాలను పూర్తిగా ఏర్పాటు చేయలేదు. నాకా బందీ సక్రమంగా చేయడం లేదు. నిఘా వ్యవస్థ లేకుండాపోయింది.
ఇదీ పోలీసుల పరిస్థితి...
రాజధాని అవసరాలకు 4వేల మంది పోలీసులు అవసరమని నిర్ధారించారు. ప్రస్తుతం 1,800మంది మాత్రమే ఉన్నారు. కొత్తగా కేటాయించిన 800మంది ఏపీఎస్పీ కానిస్టేబుళ్లు ముఖ్యమంత్రి, మంత్రులు, వీఐపీల భద్రతకే పరిమితమయ్యారు. ఏదైనా దాడి, విపత్తులు సంభవిస్తే రంగంలోకి దిగే మెరుపు బలగాలు లేనే లేవు.
ఎమెర్జెన్సీ రెస్పాన్స్ స్ట్రాటజీ ఎక్కడ ?
ఏదైనా దోపిడీ, దాడి జరిగితే సమర్థంగా ఎదుర్కోవడానికి పోలీసులు ‘ఎమెర్జెన్సీ రెస్పాన్స్ స్ట్రాటజీ’ని అమలు చేయాలి. అందుకు ముందుగానే ప్రత్యేక బలగాలను నియమించాలి. దాడి సమాచారం తెలిసిన వెంటనే నగరాన్ని శాస్త్రీయ పద్ధతులతో దిగ్బంధించాలి. అయినా తప్పించుకునేందుకు ప్రయత్నిస్తే సాయుధులైన పోలీసులు అడ్డుకోవాలి. అవసరమైతే కాల్పులకు కూడా సిద్ధపడాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ దుండగులు నుంచి తప్పించుకునేందుకు అవకాశం ఇవ్వకూడదు.