emergency response strategy
-
2 వేలు దాటిన అఫ్గాన్ మరణాలు
కాబూల్: అఫ్గానిస్తాన్ పశి్చమ ప్రాంతాన్ని శనివారం కుదిపేసిన పెనుభూకంపంలో మృతుల సంఖ్య రెండువేలు దాటింది. తీవ్ర భూప్రకంపనల కారణంగా మట్టితో నిర్మించిన వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఆరు గ్రామాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఎటు చూసినా శిథిలాలు దుమ్ము ధూళితో నిండిపోయాయి. గత రెండు దశాబ్దాల్లో ఇలాంటి పెను భూకంపం అఫ్గాన్‌ను కుదిపేయడం ఇదే మొదటిసారి. గత ఏడాది జూన్‌లో అఫ్గానిస్తాన్‌లోని పర్వత ప్రాంతాల్లో సంభవించిన భూకంపంలో కనీసం వెయ్యి మంది చనిపోయారు. అఫ్గాన్‌లో నాలుగో అతి పెద్ద నగరమైన హెరాత్ కేంద్రంగా శనివారం భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. మృతుల సంఖ్య 2,100కి చేరువలో ఉందని ఆదివారం తాలిబన్ సమాచార, సాంస్కృతిక శాఖ అధికార ప్రతినిధి అబ్దుల్ వాహిద్ రయాన్ చెప్పారు. మరో 9,240 మందికి తీవ్ర గాయాలయ్యాయని 1,320 ఇళ్లు నేలమట్టమయ్యాయని ఆయన తెలిపారు. డజనుకి పైగా బృందాలు అత్యవసర సహాయ చర్యల్లో మునిగిపోయాయి. కొన్ని గ్రామాల్లోకి సహాయ సిబ్బంది అడుగు పెట్టడానికి కూడా వీల్లేకుండా శిథిలాలతో నిండిపోయాయి. ఎటు చూసినా శిథిలాల్లో చిక్కుకున్న వారి రోదనలే వినిపిస్తున్నాయి. శిథిలాల కింద ఉన్న వారిని కాపాడడానికి సహాయ బృందాలు, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజలు తమ చేతులనే ఆయుధాలుగా చేసుకొని శిథిలాలను తొలగిస్తున్నారు. శిథిలాలు తొలగిస్తున్న కొద్దీ గుట్టలు గుట్టలుగా శవాలు బయటకి వస్తున్నాయి. మరికొందరు స్థానికులు శిథిలాల మీద పాకుతూ వెళుతూ వాటిని తొలగిస్తున్నారు. కొన ఊపిరితో ఉన్న వారిని కాపాడుతున్నారు. హెరాత్‌లో నేలమట్టమైన ఓ ఇంటి శిథిలాల్లో నుంచి ఆదివారం ఒక శిశువును అక్కడి వారు కాపాడుతున్న దృశ్యాన్ని అసోసియేటెడ్ ప్రెస్ ప్రసారం చేసింది. అక్కడే శిథిలాల నుంచి ఓ మహిళ చేయి బయటికి కనిపిస్తుండటం కూడా రికార్డయ్యింది. ఆ మహిళ చిన్నారి తల్లేనని స్థానికులు తెలిపారు. ఆమె బతికున్నదీ లేనిదీ స్పష్టం కాలేదు. క్షతగాత్రులకు చికిత్స అందించడానికి వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. బాధితులకు అందుతున్న సాయం.. అఫ్గాన్‌లో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి నుంచి భూకంప బాధితుల్ని కాపాడేందుకు యూనిసెఫ్ దుస్తులు, దుప్పట్లు, టార్పాలిన్లు తదితరాలను పంపించింది. ఐరాస వలసల విభాగం నాలుగు అంబులెన్సులు, వైద్యులు, ఇతర సిబ్బందిని అక్కడి ఆస్పత్రికి పంపించింది. మూడు మొబైల్ వైద్య బృందాలను జెందాజన్ జిల్లాకు పంపిస్తున్నట్లు వెల్లడించింది. డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్ సంస్థ కూడా 80 మంది రోగులకు సరిపోయే అయిదు మెడికల్ టెంట్లను హెరాత్ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించింది. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం వంటి సంస్థలు కూడా అత్యవసరాలను అఫ్గానిస్తాన్‌కు అందజేస్తామని ప్రకటించాయి. -
‘కరోనా’ ప్యాకేజీ 15 వేల కోట్లు
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా దేశవ్యాప్తంగా ఆరోగ్య వ్యవస్థను పూర్తిస్థాయిలో బలోపేతం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ‘భారత్ కోవిడ్–19 అత్యవసర ప్రతిస్పందన, ఆరోగ్య వ్యవస్థ సన్నద్ధత’ ప్యాకేజీకి గురువారం ఆమోదం తెలిపింది. ఈ ప్యాకేజీలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు దశల వారీగా మొత్తం రూ.15,000 కోట్లు అందజేయనుంది. వచ్చే నాలుగేళ్లలో మూడు దశల్లో ఈ ప్రాజెక్టును అమలు చేయనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ఆరోగ్య శాఖల ముఖ్య కార్యదర్శులు, కమిషనర్లకు లేఖ రాసింది. మొదటి దశ కింద రూ.7,774 కోట్లు 2020 జనవరి నుంచి జూన్ వరకు మొదటి దశ, 2021 జూలై నుంచి మార్చి వరకు రెండో దశ, 2021 ఏప్రిల్ నుంచి 2024 మార్చి వరకు మూడో దశ అమలవుతుంది. మొదటి దశ అమలు కోసం కేంద్రం అతి త్వరలో అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు రూ.7,774 కోట్లు విడుదల చేయనుంది. తొలి దశ కింద ఇచ్చే నిధులను కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు ఖర్చు చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. ప్రత్యేక ఆసుపత్రులు, ఐసోలేషన్ యూనిట్లు ఏర్పాటు చేయాలి. వెంటిలేటర్లతో కూడిన ఐసీయూలు నెలకొల్పాలి. ల్యాబ్‌ల్లో అదనపు సౌకర్యాలు కల్పించాలి. అదనంగా ఉద్యోగులను నియమించుకోవాలి. ఔషధాలు, వ్యక్తిగత రక్షణ పరికరాలు(పీపీఈ), ఎన్–95 మాస్కులు, వెంటిలేటర్ల కొనుగోలుకు ఈ నిధులను ఉపయోగించుకోవచ్చు. ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజోపయోగ స్థలాలు, అంబులెన్స్‌లను శుద్ధి చేయడానికి కూడా వెచ్చించవచ్చు. కరోనా కేసుల తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడం, బాధితులకు వైద్య సేవలందించడం రాష్ట్ర ప్రభుత్వాలకు తలకు మించిన భారంగా మారింది. ఈ నేపథ్యంలో కరోనాపై పోరాటానికి ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాలు కోరడంతో కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. ‘భారత్ కోవిడ్–19 అత్యవసర ప్రతిస్పందన, ఆరోగ్య వ్యవస్థ సన్నద్ధత’ ప్యాకేజీకి తాజాగా ఆమోదం తెలిపింది. మరో 20 మరణాలు ఒక్క రోజులో 591 పాజిటివ్‌లు న్యూఢిల్లీ: కరోనా వైరస్ పంజా విసురుతూనే ఉంది. దేశవ్యాప్తంగా బుధవారం నుంచి గురువారం వరకు.. ఒక్కరోజులో 591 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 20 మంది మృతి చెందారు. మహారాష్ట్రలో 8 మంది, గుజరాత్లో ముగ్గురు, మధ్యప్రదేశ్‌లో ముగ్గురు, జమ్మూకశ్మీర్‌లో ఇద్దరు, పంజాబ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, తమిళనాడులో ఒక్కొక్కరు చొప్పున కన్నుమూశారు. దీంతో దేశంలో మొత్తం మృతుల సంఖ్య 169కు చేరిందని, ఇప్పటిదాకా 5,865 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ గురువారం మీడియా సమవేశంలో ప్రకటించారు. కరోనా నిర్ధారణ పరీక్షల్లో భాగంగా ఇప్పటిదాకా 1,30,000 నమూనాలను పరీక్షించినట్లు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వాల గణాంకాల ప్రకారం కరోనాతో దేశవ్యాప్తంగా 196 మంది మృతి చెందగా, పాజిటివ్ కేసులు 6,500కు చేరాయి. కరోనా వ్యాప్తి నానాటికీ పెరుగుతుండడంతో రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. నిఘాను తీవ్రతరం చేశాయి. పీపీఈల లభ్యతపై ఆందోళన వద్దు కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో వ్యక్తిగత రక్షణ పరికరాల(పీపీఈ) లభ్యతపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని లవ్ అగర్వాల్ స్పష్టం చేశారు. ఈ విషయంలో వదంతులను నమ్మొద్దని కోరారు. ప్రస్తుతం సరిపడా పరికరాలు అందుబాటులో ఉన్నాయని, వాటిని అవసరం మేరకు పొదుపుగా వాడుకోవాలని సూచించారు. దేశంలో 20 సంస్థలు పీపీఈలను తయారు చేస్తున్నాయని, 1.7 కోట్ల పరికరాలు సరఫరా చేయాలంటూ ఆయా సంస్థలకు ఆర్డర్ ఇచ్చామని తెలిపారు. 49,000 వెంటిలేటర్లు త్వరలో అందనున్నాయని చెప్పారు. కరోనా బాధితుల కోసం 10 వైద్య బృందాలను 9 రాష్ట్రాలకు పంపించామని పేర్కొన్నారు. రైల్వే శాఖ 3,250 కోచ్‌లను ఐసోలేషన్ యూనిట్లుగా మార్చిందన్నారు. రైల్వే శాఖ 6 లక్షల ఫేస్ మాస్కులను ఉత్పత్తి చేసిందని, వీటిని మళ్లీ మళ్లీ ఉపయోగించుకోవచ్చని, అలాగే 4,000 లీటర్ల శానిటైజర్‌ను తయారు చేసిందని తెలిపారు. ‘ఆరోగ్య సేతు’ను డౌన్లోడ్ చేసుకోండి: మోదీ న్యూఢిల్లీ: కరోనా వైరస్‌పై పోరులో ఎంతో ఉపయుక్తంగా ఉండే ఆరోగ్యసేతు యాప్‌ను మొబైల్‌లలో డౌన్లోడ్ చేసుకోవాలని ప్రధాని మోదీ ప్రజలను కోరారు. ‘కోవిడ్‌ను చూసి భయపడితే ఎలాంటి లాభం ఉండదు. జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఈ దిశగా కీలకమైన మొదటి అడుగు ఆరోగ్య సేతు. ఇది మీ చుట్టూ కోవిడ్ వైరస్ బాధితులెవరైనా ఉంటే కనిపెడుతుంది. అన్ని రాష్ట్రాల్లోని హెల్ప్‌డెస్క్‌ల ఫోన్ నంబర్లు ఇందులో ఉన్నాయి’అని ట్విట్టర్లో తెలిపారు. -
కనిపించని నాలుగో సింహం
♦ రాజధానిలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యం ♦ దుండగులు, ఉగ్రవాదులను అడ్డుకునే నైపుణ్యం కరువు ♦ కొరవడిన ‘ఎమెర్జెన్సీ రెస్పాన్స్ స్ట్రాటజీ’ దర్జాగా రావొచ్చు... ఆయుధాలతో విధ్వంసం సృష్టించొచ్చు... కావాల్సినంత దోచుకోవచ్చు... ఎంచక్కా నగరం నుంచి జారుకోవచ్చు... పోలీసులు అడ్డుకోలేరు... సమాచారం ఇచ్చినా పట్టకోలేరు. కళ్లముందే పారిపోతున్నా కట్డడి చేయనూలేరు. ఇదీ అమరావతిలో ఖాకీల దుస్థితి. బెజవాడలో బంగారు ఆభరణాల కార్ఖానాపై దాడి ఉదంతం భద్రతా వ్యవస్థ డొల్లతనాన్ని బట్టబయలు చేసింది. సాక్షి, అమరావతి బ్యూరో : రాజధానిలో భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఏదైనా భారీ దోపిడీ జరిగితే వెంటనే స్పందించేందుకు పోలీసు యంత్రాంగం సిద్ధంగా లేదు. ఇందుకు మంగళవారం రాత్రి విజయవాడ గోపాలరెడ్డి రోడ్డులో జరిగిన భారీ దోపిడీ నిదర్శనమనే వాదన వినిపిస్తోంది. పోలీసులు కేవలం డ్రంక్ అండ్ డ్రైవ్, ట్రాఫిక్ కేసుల నమోదుకు మాత్రమే పరిమితమవుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొన్ని నెలలుగా కనీసం నాకాబందీ కూడా నిర్వహించడంలేదు. దీంతో నేరస్తులు నిర్భయంగా తమ పని పూర్తి చేసుకుని సులభంగా నగరం దాటి వెళ్లిపోతున్నారు. నలువైపుల నుంచి నగరంలోకి వచ్చి వెళ్లేందుకు మార్గాలు ఉండటం, ఎక్కడా పెద్దగా నిఘా లేకపోవడం నేరస్తులకు కలిసివస్తోంది. మన పోలీసుల వైఫల్యం ఇలా... ♦ మంగళవారం రాత్రి 9.50గంటలు : అంతర్రాష్ట దొంగల ముఠా విజయవాడలో నగల కార్ఖానాపై దోపిడీ చేసి అక్కడి నుంచి జారుకుంది. ♦ రాత్రి 10గంటలు : ఓ వ్యక్తి నేరుగా పోలీస్ కమిషర్ గౌతం సవాంగ్‌కు ఫోన్ చేసి సమాచారం అందించారు. పది నిమిషాల్లోనే పోలీసులకు సమాచారం చేరింది. ఆయన వెంటనే కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల ఎస్పీలకు సమాచారం అందించారు. కానీ, నగర సరిహద్దులను వెంటనే దిగ్బంధించలేకపోయారు. ♦ రాత్రి 10.10గంటలు : దోపిడీ ముఠా ఎంచక్కా వారధి దాటింది. అక్కడికి కొద్దిదూరంలోనే డీజీపీ కార్యాలయం, మంగళగిరి ఏపీఎస్పీ ఆరో బెటాలియన్ కేంద్రంలో పోలీసు బలగాలు ఉన్నాయి. వారూ దోపిడీ ముఠాను అడ్డుకునేందుకు ప్రయత్నించలేదు. ♦ రాత్రి 10.24 గంటలు : దోపిడీ ముఠా జాతీయ రహదారి మీద ఉన్న కాజా టోల్‌గేట్‌ను దాటింది. అక్కడ కూడా ఆ ముఠాను అడ్డుకునేందుకు ప్రయత్నించనే లేదు. ♦ రాత్రి 10.40 గంటలు : దోపిడీ ముఠా గుంటూరు నగరంలోని కింగ్ హోటల్ వద్దకు చేరుకుంది. అక్కడ ఒక ఎస్ఐ, నలుగురైదుగురు కానిస్టేబుళ్లు మాత్రమే ఉన్నారు. కానీ దోపిడీ దొంగలు తమ వాహనాన్ని ఆపకుండా అతి వేగంగా దూసుకుపోయారు. పోలీసులు అడ్డుకోలేకపోయారు. ♦ రాత్రి 10.50గంటలు : గుంటూరులోని చుట్టుగుంట సెంటర్ వద్ద ఒక ఎస్ఐ, ఐదారుగురు పోలీసులు మాత్రమే కాపు కాశారు. ముఠా జాతీయ రహదారి వైపు వెళ్తున్నట్లు గుర్తించి అర్బన్ ఎస్పీకి సమాచారం అందించారు. ♦ రాత్రి 11.10 గంటలు : చిలకలూరిపేట సమీపంలోని వై.జంక్షన్ వద్దకు గుంటూరు అర్బన్ ఎస్పీ విజయారావు, డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ శ్రీనివాసరావు పోలీసు బలగాలతో చేరుకున్నారు. జాతీ య రహదారిని దిగ్బంధించి వాహనాలను తనిఖీ చేయసాగారు. ఇలా తప్పించుకున్నారు.. చిలకలూరిపేట సమీపంలోని వై.జంక్షన్ వద్ద ఎక్కడ రోడ్డు బ్లాక్ చేశారో పోలీసులు అంతా అక్కడే ఉండిపోయారు. దీంతో వాహనాలు తనిఖీ చేస్తున్నారని అక్కడికి అర కిలోమీటరు దూరం నుంచే దొంగలు గుర్తించారు. తమ వాహనాన్ని అక్కడే వదిలేసి బంగారం, నగదు తీసుకుని పొలాల్లోకి పరుగుపెట్టారు. అదే పోలీసు అధికారులు కేవలం రోడ్డు బ్లాక్ చేసిన చోట మాత్రమే కాకుండా ఒక కిలో మీటరు ముందు వరకు కూడా సాయుధులైన పోలీసులను మోహరించి ఉంటే దొంగలకు ఆ అవకాశం ఉండేది కాదు. నిద్దరోతున్న భద్రతా వ్యవస్థ రాజధాని స్థాయికి తగ్గట్లుగా విజయవాడ–గుంటూరులో భద్రతా వ్యవస్థను బలోపేతం చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. రాత్రివేళల్లో గస్తీ అన్నదే లేకుండాపోయింది. అందుకు తగిన వాహనాలు కావాలన్న ప్రతిపాదనను పట్టించుకోలేదు. ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో సీసీ కెమెరాలను పూర్తిగా ఏర్పాటు చేయలేదు. నాకా బందీ సక్రమంగా చేయడం లేదు. నిఘా వ్యవస్థ లేకుండాపోయింది. ఇదీ పోలీసుల పరిస్థితి... రాజధాని అవసరాలకు 4వేల మంది పోలీసులు అవసరమని నిర్ధారించారు. ప్రస్తుతం 1,800మంది మాత్రమే ఉన్నారు. కొత్తగా కేటాయించిన 800మంది ఏపీఎస్పీ కానిస్టేబుళ్లు ముఖ్యమంత్రి, మంత్రులు, వీఐపీల భద్రతకే పరిమితమయ్యారు. ఏదైనా దాడి, విపత్తులు సంభవిస్తే రంగంలోకి దిగే మెరుపు బలగాలు లేనే లేవు. ఎమెర్జెన్సీ రెస్పాన్స్ స్ట్రాటజీ ఎక్కడ ? ఏదైనా దోపిడీ, దాడి జరిగితే సమర్థంగా ఎదుర్కోవడానికి పోలీసులు ‘ఎమెర్జెన్సీ రెస్పాన్స్ స్ట్రాటజీ’ని అమలు చేయాలి. అందుకు ముందుగానే ప్రత్యేక బలగాలను నియమించాలి. దాడి సమాచారం తెలిసిన వెంటనే నగరాన్ని శాస్త్రీయ పద్ధతులతో దిగ్బంధించాలి. అయినా తప్పించుకునేందుకు ప్రయత్నిస్తే సాయుధులైన పోలీసులు అడ్డుకోవాలి. అవసరమైతే కాల్పులకు కూడా సిద్ధపడాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ దుండగులు నుంచి తప్పించుకునేందుకు అవకాశం ఇవ్వకూడదు.