
వృద్ధురాలికి మంచినీరు తాగిస్తున్న సీఐ సాహేరా బేగం పరామర్శిస్తున్న ఏసీపీ సత్యానందం
గుణదల (విజయవాడ తూర్పు): అన్నీ తానై పెంచిన కన్న తల్లిని కడతేర్చాలనుకున్నోడో ప్రబుద్ధుడు. ఆస్తిని అమ్మేసుకుని చివరికి ఆమెకు వచ్చే పింఛను సైతం తీసుకుంటూ ఆమె అడ్డు తొలగించాలనుకున్నాడు. దీనికి కోడలు కూడా సహకరించడంతో ఏడు పదుల వయస్సులో ఉన్న ఆమె రెండు నెలలుగా నరకాన్ని చవిచూసింది. కూడు, నీరు లేకుండా గొలుసులతో కట్టేసి రెండు నెలలు హింసించారు. స్థానికులు చాటుమాటుగా పెట్టిన ఆహారంతోనే ఆమె జీవించింది. స్థానికుల సమాచారంతో వెలుగుచూసిన ఈ ఘటనతో ఆమె కొడుకు, కోడలు కటకటాలపాలయ్యారు. ఏసీపీ సత్యానందం, మాచవరం సీఐ సహేరాబేగం తెలిపిన వివరాల ప్రకారం.. కంకిపాడు మండలం గొడవర్రు గ్రామానికి చెందిన పోతురాజు ప్రకాశమ్మ (70) ప్రస్తుతం మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని గుణదల బెత్లెహా నగర్‌లోని తన కుమారుడు పోతురాజు అంజయ్య అలియాస్ ఏసు వద్ద ఉంటోంది.
గతంలో ప్రకాశమ్మ పేరిట ఉన్న ఆస్తిని అమ్మేసి తల్లి బాధ్యత తానే తీసుకుంటానని నమ్మబలికాడు ఏసు. ఆఖరికి ప్రకాశమ్మకు వస్తున్న వృద్ధాప్య పింఛను కూడా తీసుకుంటున్న ఆయన తల్లి బాధ్యత మరిచిపోయాడు. అంతే కాక భార్య మేరి నిర్మలారాణి తో కలిసి తల్లిని హింసించడం ప్రారంభించాడు. ఇంటిలోకి రానీయకుండా ఇంటిపై భాగంలో ఫ్లెక్సీలతో పాక నిర్మించి మండుటెండలో వదిలేశాడు. కూడు, నీరు కూడా ఇవ్వలేదు. రెండు నెలలుగా ఆమె ఎండలోనే పడిఉంది. ఆమె ఎటూ కదలకుండా ఇనుప గొలుసులతో కట్టి పడేశారు. దీంతో కాల కృత్యాలు కూడా మంచంలోనే వెళ్లాల్సిన దయనీయ స్థితి. భరించలేని దుర్వాసన వస్తుండటంతో స్థానికులు మాచవరం పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఐసీడీఎస్ అధికారులతో కలిసి వృద్ధురాలి వద్దకు చేరుకున్నారు. వృద్ధురాలిని సంకెళ్లతో చూసి అవాక్కయ్యారు. తొలుత ఆమెకు అల్పాహారం, నీరు అందించి వివరాలు సేకరించారు. అనంతరం ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆ వృద్ధురాలికి వాంబేకాలనీలోని అమ్మ వృద్ధాశ్రమంలో ఆసరా కల్పించారు. ఆమెను కుమారుడు ఏసు, కోడలు మేరి నిర్మలారాణిలను అరెస్టు చేశారు. తెలిపారు.