బైక్‌లపై వచ్చి ఠాణాపై బాంబులు విసిరి..
దివంగత ముఖ్యమంత్రి జయలలిత నివశిస్తున్న పోయెస్ గార్డెన్ నివాసం, అమెరికా రాయబార కార్యాలయం, ముఖ్య ప్రముఖుల నివాసాలు, నక్షత్ర హోటళ్లు ఈ స్టేషన్ పరిధిలోనే ఉన్నాయి. గురువారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో మౌంట్‌రోడ్ నిర్మానుష్యంగా కనిపించింది. ఆ సమయంలో నందనం సిగ్నల్ నుంచి మౌంట్‌రోడ్ వైపుగా రెండు బైక్‌లలో వచ్చిన గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు తేనాంపేట పోలీసు స్టేషన్ రాగానే తమ చేతిలో ఉన్న రెండు పెట్రోలు బాంబులను పోలీసు స్టేషన్ వైపు విసిరారు. దీంతో పెద్ద శబ్దంతో ఓ బాంబు పేలడంతో అక్కడ మంటలు చెలరేగాయి. తెల్లవారుజాము కావడంతో పోలీసులు గస్తీ తిరిగేందుకు వెళ్లారు. పోలీసు స్టేషన్‌లో ముగ్గురు మాత్రమే ఉన్నారు.
ఈ పేలుడు శబ్దానికి మౌంట్‌రోడ్‌లో పోస్టర్లు అతికిస్తున్న ఓ వ్యక్తితోపాటు స్టేషన్‌లోపల ఉన్న ముగ్గురు పోలీసులు బయటికి వచ్చి చూశారు. నలుగురు వ్యక్తులు బైక్‌లలో వచ్చి పెట్రోలు బాంబులు విసిరినట్లు ఆ పోస్టర్ల వ్యక్తి తెలిపాడు. అక్కడి మంటలను పోలీసులు నీళ్లు చల్లి ఆర్పివేశారు. ప్రవేశ ద్వారం వద్ద మరో బాంబు పేలకుండా పడివుంది. ప్రత్యేక బందం పోలీసులు తేనాంపేట పోలీసు స్టేషన్‌లో ఉన్న సీసీ టీవి కెమెరాలను పరిశీలించారు. ఈ పోలీసు స్టేషన్ సమీపాన అమెరికన్ దౌత్యకార్యాలయం ఉన్నందున ఇందులో అంతర్జాతీయ కుట్ర ఉందా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. గురువారం రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు తిరునావుక్కరసర్ 50 ఏళ్ల ప్రజాజీవిత స్వర్ణోత్సవం జరుగనుంది. ఇందులో కూటమి పార్టీల నేతలు పలువురు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమాన్ని భగ్నం చేసే దృష్టితో ఇలా చేశారా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.