ఇటీవల కదిరి మున్సిపల్ పరిధిలో జరిగిన పలు దొంగతనాలకు సంబంధించిన దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకొని గత వారం రోజులుగా విచారిస్తున్నట్లు తెలిసింది.
కదిరి: ఇటీవల కదిరి మున్సిపల్ పరిధిలో జరిగిన పలు దొంగతనాలకు సంబంధించిన దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకొని గత వారం రోజులుగా విచారిస్తున్నట్లు తెలిసింది. అయితే ఆ దొంగలు, పోలీస్ అధికారులు ఒక్కటై ఎవరింట్లో దొంగతనం జరిగిందో ఆ బాధితులను పోలీస్ అధికారులు స్టేషన్‌కు పిలిపించి వేధిస్తున్నట్లు సమాచారం. ‘రేయ్ మీ ఇంట్లో 30 తులాలు దొంగతనం అయినట్లు మాకు ఆరోజు ఫిర్యాదులో ఇచ్చావ్. కానీ మీ ఇంట్లో దొంగ ఆరోజు ఎత్తుకెళ్లింది కేవలం 5 తులాలు మాత్రమేనని ఆ దొంగ మాతో చెప్పాడు. రేపో, మాపో ఆ 5 తులాలు రికవరీ చూపిస్తాం. వచ్చి తీసుకెళ్లు..మీ ఇంట్లో ఎంత దొంగతనం అయిందో అంతా రికవరీ చేసి ఇవ్వాలని ఏ చట్టంలో లేదు. మర్యాదగా ఇచ్చింది తీసుకెళ్లు’ అంటూ పోలీస్ అధికారులు బాధితులకు వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం.
ఇంకో బాధితుడు ఆరోజు తన ఇంట్లో ఒక ఎల్‌ఈడీ టీవీ, 5 తులాల బంగారంతో పాటు రూ.50 వేలు నగదు పోయిందని పోలీసులతో మొరపెట్టుకున్నాడు. అయితే టీవీ రికవరి చేయడం సాధ్యం కాదంటూ ఆరోజు పోలీసు అధికారులే ఆ బాధితుడిని తన ఫిర్యాదులో టీవీ విషయం రాయద్దని చెప్పి అలాగే ఫిర్యాదు ఇప్పించుకున్నారు. అయితే ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్న దొంగ తాను సదరు వ్యక్తి ఇంట్లో టీవీ కూడా ఎత్తుకెళ్లినట్లు ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు చేసేది లేక టీవీని సదరు బాధితుడికి అందజేశారు. అయితే అతని ఇంట్లో దోచుకెళ్లిన 5 తులాలు అబద్దమని, దొంగకూడా ఇదే చెబుతున్నాడంటూ బాధితుడిని పోలీసులు బయటకు గెంటేసినట్లు తెలిసింది. దొంగ.. తాను ఏ ఇంట్లో ఎంత దోచుకున్నాడో.. ఏ బంగారు షాపులో అమ్మాడో చెప్పినప్పటికీ పోలీసు అధికారులు మాత్రం బాధితులకు అన్యాయం చేసి, తాము ఇచ్చింది తీసుకోండి అంటూ బెదిరిస్తున్నారట. నేడో, రేపో పోలీసు అధికారులు తమ అదుపులో ఉన్న దొంగలను మీడియా ముందు హాజరు పర్చనున్నట్లు తెలిసింది.