ఆత్మకూరురూరల్: ఎర్రచందనం అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఎస్సీ పీహెచ్‌డీ రామకృష్ణ ఆదేశాల మేరకు ఆత్మకూరు డివిజన్ పరి«ధిలోని పోలీసు అధికారులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి స్మగ్లర్లను వేటాడుతున్నారు. స్థానిక స్మగ్లర్లు అంతర రాష్ట్ర స్మగ్లర్లతో సత్సంబంధాలు ఏర్పరుచుకున్నారు. వారి సాయంతో తమిళనాడు నుంచి కూలీలను తీసుకొచ్చి మర్రిపాడు, అనంతసాగరం మండలాల్లోని అడవుల్లోకి పంపుతున్నారు. ఎర్రచందనాన్ని నరికివేయించి స్మగ్లింగ్ చేస్తున్నారు. రెండు నెలల క్రితం మర్రిపాడు మండలం బాటసింగనపల్లి వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఓ అనుమానస్పద వాహనం కనిపించింది.
పోలీసులు అడ్డుకోగా తమిళ కూలీలు దాడులకు పాల్పడ్డారు. 30 అడుగులకుపైగా ఉన్న వంతెనపై నుంచి దూకి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. పోలీసులు అప్రమత్తమై ఎట్టకేలకు వారిని పట్టుకుని అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఎస్పీ ఆదేశాల మేరకు ఆత్మకూరు, గూడూరు, కావలి డీఎస్పీలు ఆత్మకూరు, కలిగిరి, వెంకటగిరి సీఐలు, ఎస్సైలతో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అనుమా నం ఉన్న మండలాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించి పలువురు అక్రమార్కులు, ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నారు.
ఈ క్రమంలోనే ఆదివారం ఆత్మకూరు సీఐ ఎస్‌కే ఖాజా వళి, మర్రిపాడు ఎస్సై షేక్ అబ్ధుల్ రజాక్ జిల్లా సరిహద్దుల్లో తనిఖీలు నిర్వహిస్తుండగా బొలెరో వాహనం ఆపకుండా వెళ్లిపోయింది. దీంతో ఛేజింగ్ చేసి మర్రిపాడు వద్ద వాహనా న్ని ఎట్టకేలకు పట్టుకున్నారు. ఈ ఘటనలో సైతం స్మగ్లర్లు పోలీసులపై దాడులకు ప్రయత్నించడం గమనార్హం. తమిళనాడులోని పొన్నేరి, గుమ్మడిపూండికి చెందిన ఇద్దరు, వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన మరో ఇద్దరు అంతరరాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్లు పట్టుబడ్డారు.
ఆదివారం ఏకకాలంలో మూడు మండలాల్లో నిర్వహించిన దాడుల్లో వెంకటగిరి, డక్కిలి, వెలిగొండ ప్రాంతాలకు చెందిన మొత్తం 15 మంది స్మగ్లర్లతో పాటు నలుగురు అంతరరాష్ట్ర స్మగ్లర్లు పట్టుబడడం విశేషం. ఈ దాడుల్లో రూ.కోటి విలువైన 905 కేజీల బరువు కలిగిన 81 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నట్లు ఆత్మకూరు డీఎస్పీ ఎం రామాంజనేయులరెడ్డి తెలిపారు. రెండు వ్యాన్లు, రెండు మోటార్‌సైకిళ్లు, 10 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment