Red sanders smugglers
-
ఎర్ర స్మగ్లర్ల కోసం పోలీసుల వేట
ఆత్మకూరురూరల్: ఎర్రచందనం అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఎస్సీ పీహెచ్డీ రామకృష్ణ ఆదేశాల మేరకు ఆత్మకూరు డివిజన్ పరి«ధిలోని పోలీసు అధికారులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి స్మగ్లర్లను వేటాడుతున్నారు. స్థానిక స్మగ్లర్లు అంతర రాష్ట్ర స్మగ్లర్లతో సత్సంబంధాలు ఏర్పరుచుకున్నారు. వారి సాయంతో తమిళనాడు నుంచి కూలీలను తీసుకొచ్చి మర్రిపాడు, అనంతసాగరం మండలాల్లోని అడవుల్లోకి పంపుతున్నారు. ఎర్రచందనాన్ని నరికివేయించి స్మగ్లింగ్ చేస్తున్నారు. రెండు నెలల క్రితం మర్రిపాడు మండలం బాటసింగనపల్లి వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఓ అనుమానస్పద వాహనం కనిపించింది. పోలీసులు అడ్డుకోగా తమిళ కూలీలు దాడులకు పాల్పడ్డారు. 30 అడుగులకుపైగా ఉన్న వంతెనపై నుంచి దూకి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. పోలీసులు అప్రమత్తమై ఎట్టకేలకు వారిని పట్టుకుని అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఎస్పీ ఆదేశాల మేరకు ఆత్మకూరు, గూడూరు, కావలి డీఎస్పీలు ఆత్మకూరు, కలిగిరి, వెంకటగిరి సీఐలు, ఎస్సైలతో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అనుమా నం ఉన్న మండలాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించి పలువురు అక్రమార్కులు, ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం ఆత్మకూరు సీఐ ఎస్కే ఖాజా వళి, మర్రిపాడు ఎస్సై షేక్ అబ్ధుల్ రజాక్ జిల్లా సరిహద్దుల్లో తనిఖీలు నిర్వహిస్తుండగా బొలెరో వాహనం ఆపకుండా వెళ్లిపోయింది. దీంతో ఛేజింగ్ చేసి మర్రిపాడు వద్ద వాహనా న్ని ఎట్టకేలకు పట్టుకున్నారు. ఈ ఘటనలో సైతం స్మగ్లర్లు పోలీసులపై దాడులకు ప్రయత్నించడం గమనార్హం. తమిళనాడులోని పొన్నేరి, గుమ్మడిపూండికి చెందిన ఇద్దరు, వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన మరో ఇద్దరు అంతరరాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్లు పట్టుబడ్డారు. ఆదివారం ఏకకాలంలో మూడు మండలాల్లో నిర్వహించిన దాడుల్లో వెంకటగిరి, డక్కిలి, వెలిగొండ ప్రాంతాలకు చెందిన మొత్తం 15 మంది స్మగ్లర్లతో పాటు నలుగురు అంతరరాష్ట్ర స్మగ్లర్లు పట్టుబడడం విశేషం. ఈ దాడుల్లో రూ.కోటి విలువైన 905 కేజీల బరువు కలిగిన 81 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నట్లు ఆత్మకూరు డీఎస్పీ ఎం రామాంజనేయులరెడ్డి తెలిపారు. రెండు వ్యాన్లు, రెండు మోటార్‌సైకిళ్లు, 10 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. -
ఎర్ర స్మగ్లర్లను పుళల్ జైలుకి అప్పగింత
తడ : ఎర్రచందనం అక్రమ రవాణాపై విచారణ నిమిత్తం కస్టడీకి తీసుకున్న తమిళనాడులోని పుళల్ జైలులో రిమాండ్‌లో ఉన్న దినేష్‌కుమార్, ఆనంద్‌లను తిరిగి తడ పోలీసులు మంగళవారం జైలు అధికారులకు అప్పగించారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌కి సంబంధించి ఈ నిందితులకు ఉన్న సంబంధాలను, వీరి వెనుక ఉన్న మిగిలిన సభ్యులు, ఇతర వివరాలను తెలుసుకునేందుకు వీరిని మూడు రోజుల పాటు పీటీ వారంట్ కింద తీసుకు వచ్చి విచారించారు. దినేష్ కుమార్‌ని సోమవారం తిరుత్తణికి తీసుకు వెళ్లి విచారణ నిర్వహించారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌కి స్థానికంగా ఉన్న అనుబంధం గురించి కూడా వీరి నుంచి వివరాలు సేకరించారు. మంగళవారం గడువు ముగియడంతో సూళ్లూరుపేట కోర్టులో ప్రవేశపెట్టి అనంతరం నిందితులను పుళల్ జైలులో విడిచి పెట్టారు. -
'అసలు ఎర్రచందనం దొంగలు టీడీపీ నేతలే'
చిత్తూరు:ఎర్రచందనం స్మగ్లర్లతో వైఎస్సార్ సీపీ నేతలకు సంబంధాలున్నట్లు ఓ పత్రిక ప్రచురించిన కథనాన్ని వైఎస్సార్ సీపీ తీవ్రంగా ఖండించింది. వైఎస్సార్ సీపీ అభివృద్ధిని చూసి ఓర్వలేక పచ్చ పత్రికలు, టీడీపీ నేతలు లేని పోని ఆరోపణలకు తెరలేపుతున్నారని వైఎస్సార్ సీపీ పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, దేశాయి తిప్పారెడ్డిలు విమర్శించారు. ఎర్రచందనంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హస్తం ఉన్నట్లు ఆరోపించడం తగదని వారు సూచించారు. అవరసరమైతే స్మగ్లర్లు ఎవరు అనే దానిపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. అసలు ఎర్రచంద్రనం దొంగలు టీడీపీ నేతలేనని రామచంద్రారెడ్డి, తిప్పారెడ్డిలు తీవ్రంగా మండిపడ్డారు. -
అట్టుడుకుతున్న తమిళనాడు
చెన్నై: చిత్తూరు జిల్లా శేషాచలం అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ నేపథ్యంలో తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తాయి. తమిళ సంఘాలు చేపట్టిన ఆందోళనలు గురువారం మూడో రోజుకు చేరుకున్నాయి. చెన్నై సెంట్రల్లో తమిళ సంఘాలు రైల్‌రోకో నిర్వహించారు. మద్రాస్ హైకోర్టు ముందు న్యాయవాద సంఘాలు ధర్నా చేపట్టాయి. వేలూరులో చంద్రబాబు దిష్టిబొమ్మను డీకే కార్యకర్తలు దగ్ధం చేశారు. కోయంబత్తూరు, తిరుచ్చిలో నాన్ తమిళర్ కచ్చి కార్యకర్తలు నిరసన చేపట్టారు. తిరువణ్ణామలై, విల్లుపురం వేలూరులో ఆందోళనలు కొనసాగుతున్నాయి. తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా ఏపీ బస్సులు ఎక్కడివక్కడ నిలిపివేశారు. తమిళనాడులోని తెలుగు సంఘాలు, టీటీడీ దేవస్థానం, ఆంధ్రాబ్యాంకుల వద్ద పోలీసులు భారీగా మోహరించారు.