ప్రతీకాత్మక చిత్రం
ఏదైనా నేరం జరిగితే బాధితులు ఫిర్యాదు చేసేందుకు సమీప పోలీస్ స్టేషన్‌కు వెళతారు. అయితే అత్యధికులకు ఎదురయ్యేది స్టేషన్ల పరిధి సమస్య. నగరంలో మూడు పోలీసు కమిషనరేట్లు ఉన్నాయి. హైదరాబాద్‌లో 60, సైబరాబాద్‌లో 36, రాచకొండలో 42 పోలీసుస్టేషన్లు ఉన్నాయి. ఇవి భౌగోళికంగా ఒకటే అయినా.. సాంకేతికంగా వేర్వేరు ప్రాంతాలు. ఒకే రోడ్డుకు ఇరువైపులా ఉన్న ప్రాంతాలు వేర్వేరు పోలీసుస్టేషన్ల పరిధిలోకి వస్తుంటాయి. సరిహద్దుల్లో నేరం జరిగితే ఎవరి పరిధిలోకి వస్తుందో తేలక పోలీసులు చర్యలు తీసుకోవడం లేదు. ఇకపై ఏ స్టేషన్‌కు ఫిర్యాదు వచ్చినా వెంటనే చర్యలు తీసుకోవాల్సిందే.
సాక్షి, సిటీబ్యూరో: ఏదైనా నేరం బారినపడిన బాధితులు తమకు జరిగిన అన్యాయం, ఎదురైన సమస్యలపై స్పందించమంటూ సమీపంలో ఉన్న పోలీసుల వద్దకు పరిగెడతారు. అయితే కొన్నిసార్లు ఆ ప్రాంతం సదరు ఠాణా పరిధిలోకి రాకుంటే... మరో ఠాణాకు వెళ్లమంటూ అధికారులు పంపిస్తుంటారు. ఇకపై కీలకాంశాల్లో ఇలా చేయడానికి కుదరదు. శాంతిభద్రతల సమస్యలకు సంబంధించిన అంశాలపై సమాచారం/ఫిర్యాదు వచ్చిన వెంటనే పరిధులతో సంబంధం లేకుండా స్పందించాల్సిందే. ఈ మేరకు ప్రత్యేకంగా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్‌ఓపీ) రూపొందించిన అధికారులు సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ఫస్ట్‌లాన్సర్ ఉదంతంతో కదిలి..
ఇటీవల హుమయూయున్ నగర్ పోలీసుస్టేషన్ పరిధిలోని ఫస్ట్ లాన్సర్ ప్రాంతంలో ఓ ఉదంతం జరిగింది. రెండు అల్లరి మూకల మధ్య చెలరేగిన ఘర్షణలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఇది జరిగిన ప్రాంతం హుమయూన్ నగర్, బంజారాహిల్స్ ఠాణాల పరిధుల మధ్య ఉంది. దీంతో కొంత గందరగోళం ఏర్పడి పోలీసుల రాక ఆలస్యమైంది. దీన్ని ఉన్నతాధికారులు తీవ్రంగాపరిగణించారు.
ఇకపై అలా కుదరదంటూ..
శాంతి భద్రతలకు సంబంధించిన అంశాల్లో ఇకపై సరిహద్దులు, పరిధులు పట్టించుకోవద్దని అధికారులు సిబ్బందికి స్పష్టం చేశారు. ప్రాథమికంగా ఎవరికి సమాచారం వస్తే వారు తక్షణం స్పందించాలని, ఘటనాస్థలికి చేరుకుని అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆ తర్వాతే పరిధుల విషయం చర్చించాలంటూ ఎస్‌ఓపీ రూపొందించారు. నగర పోలీసు కమిషనర్ వీవీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ‘ఈ పరిధుల అంశంలో ఇకపై సమస్యలు రాకుండా చర్యలు తీసుకున్నాం. మరోపక్క ఆక్టోపస్ కమాండోల మోహరింపు విషయంలోనూ కీలక మార్పులు చేశాం. ఇప్పటి వరకు ఆక్టోపస్ కమాండోలు ఏదో ఒక ప్రాంతంలో స్టాండ్ బైలో ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఇలా ఓ చోట ఉండటానికి బదులు నగరంలోకి కీలక ప్రాంతాల్లో అవసరమైన సంఖ్యలో మోహరించాలని డీజీపీ నిర్ణయించారు. అందులో భాగంగానే గురువారం అసెంబ్లీ, సెక్రటేరియేట్స్ వద్ద వీరిని మోహరించాం. ఇకపై ప్రతి రోజూ వ్యూహాత్మకంగా వీరిని మోహరించనున్నాం’ అని తెలిపారు.
ఉదాహరణకు బంజారాహిల్స్ రోడ్ నెం.1 సిటీ సెంటర్ వైపు బంజారాహిల్స్ ఠాణా పరిధిలోకి, రోడ్డుకు ఇటున్న కేర్ ఆస్పత్రి ప్రాంతం పంజగుట్ట స్టేషన్ పరిధిలోకి వస్తాయి. దిల్‌సుఖ్‌నగర్‌లో కోణార్క్ థియేటర్ రోడ్డుకు ఓ వైపు రాచకొండ కమిషనరేట్‌లోది కాగా, మరోవైపు హైదరాబాద్ కమిషనరేట్‌లోనిది. ఇలాంటి చోట్ల నేరం జరిగితే సరిహద్దుల సమస్య తలెత్తుతుంది.
Comments
Please login to add a commentAdd a comment