
సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం అభంగపట్నంలో ఇద్దరు దళితులను దారుణంగా అవమానించిన కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు భరత్ రెడ్డి ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నాడు. అతడిని పట్టుకునేందుకు మరో పోలీసు బృందం రంగంలోకి దిగింది. దీంతో మొత్తం మూడు ప్రత్యేక బృందాలు అతని ఆచూకీ కోసం ముమ్మరంగా గాలిస్తున్నాయి.
అయితే, స్థావరాలు మార్చుతూ భరత్‌రెడ్డి పోలీసుల నుంచి తప్పించుకుంటున్నట్లు సమాచారం. అదృశ్యమైన ఇద్దరు దళితులు కూడా భరత్ రెడ్డి వద్దే ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, అభంగ పట్నంలో భరత్ రెడ్డికి వ్యతిరేకంగా దళిత సంఘాల నిరసనలు కొనసాగుతున్నాయి. మట్టిని అక్రమ రవాణా చేస్తున్నారని ప్రశ్నిస్తున్నందుకు ఇద్దరు దళితు వ్యక్తులపై భరత్ రెడ్డి దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. దళితులు ఎంత వేడుకున్నా వినిపించుకోని అతను.. కర్రతో వారిని బెదిరిస్తూ నీటి కుంటలో మునగాలంటూ ఆదేశించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.