
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా అభంగపట్నం దళిత యువకులపై దౌర్జన్యానికి పాల్పడిన జై భరత్‌రెడ్డిని పోలీసులు ఎట్టకేలకు న్యాయస్థానంలో హాజరుపరిచారు. ముందుగా జై భరత్‌రెడ్డి తనంతట తాను పోలీసులకు లొంగిపోయాడని మీడియాలో ప్రచారం కాగా, తాము అతన్ని అరెస్టు చేశామని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తికేయ ప్రకటించారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం భరత్‌రెడ్డిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ భరత్‌రెడ్డి మహారాష్ట్ర వైపు వెళ్తుండగా కామారెడ్డి సమీపంలోని టేకిర్యాల్ ఎక్స్ రోడ్డు వద్ద పట్టుకున్నామని చెప్పారు. మొరం అక్రమ తవ్వకాలను అడ్డుకున్నారనే నెపంతో అభంగపట్నం గ్రామానికి చెందిన దళిత యువకులు బచ్చుల రాజేశ్వర్, కొండా లక్ష్మణ్‌లను జై భరత్‌రెడ్డి ముక్కు నేలకు రాయించాడు.
అతని ఆదేశాలతో వారు మురికి నీటిలో మునిగారు. సెప్టెంబర్‌లో జరిగిన ఈ ఘటన వీడియో నవంబర్ 11న సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సంచలనం సృష్టించింది. ఈ అకృత్యంపై దళిత, విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి.ఈ నేపథ్యంలోనే నవంబర్ 12న అభంగపట్నానికి వచ్చిన భరత్‌రెడ్డి మీతో మాట్లాడాలని చెప్పి బాధిత యువకులు రాజేశ్వర్, లక్ష్మణ్‌లను కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్లాడు. దీనిపై బాధితుల కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నవీపేట్ పోలీసులు భరత్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, కిడ్నాప్ కేసులు నమోదు చేశారు. అప్పటి నుంచి పరారీలో ఉన్నభరత్‌రెడ్డి ఈనెల 1న బాధితులిద్దరిని హైదరాబాద్‌లో వదిలేయడంతో వారిని పోలీసులు అభంగపట్నం తరలించారు. ఎట్టకేలకు నెల రోజుల తర్వాత జై భరత్‌రెడ్డిని అరెస్టు చేశామని పోలీసులు ప్రకటించారు.
ప్రత్యేక నెట్‌వర్క్..
జై భరత్‌రెడ్డికి నేర చరిత్ర ఉన్నట్లు కమిషనర్ కార్తికేయ చెప్పారు. ఆయనపై మొత్తం ఐదు క్రిమినల్ కేసులు నమోదయ్యాయని, ఇందులో రెండు హత్య కేసులు ఉన్నట్లు వివరించారు. నిందితుడు జై భరత్‌రెడ్డికి ప్రత్యేక నెట్‌వర్క్ ఉన్నట్లు తమ దర్యాప్తులో తేలిందని కార్తికేయ వివరించారు. జై భరత్‌రెడ్డికి కోర్టు 14 రోజులు రిమాండ్‌కు తరలించాలని ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment