సాక్షి, హైదరాబాద్ : నిజామాబాద్ జిల్లాలో గత 20 రోజుల కిందట అదృశ్యమైన ఇద్దరు దళితుల కేసు ఊహించని మలుపు తిరిగింది. ఓ వైపు రాష్ట్రవ్యాప్తంగా దళిత సంఘాలు వారిని కిడ్నాప్ చెర నుంచి విడుదల చేయాలంటో ఎన్నో ధర్నాలు చేపట్టి, భరత్ రెడ్డిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. మరోవైపు 20 రోజుల తర్వాత కనిపించిన ఆ ఇద్దరు వ్యక్తులు తమను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, సినిమా షూటింగ్ కోసమే అలా నటించామని చెప్పారని పోలీసులు విచారణలో తేలింది.
గత నెలలో నిజామాబాద్ జిల్లాలోని నవీపేటలో బీజేపీ మాజీ నేత భరత్ రెడ్డి చేస్తున్న అక్రమ ఇసుక రవాణాదందాపై దళితులైన లక్ష్మణ్, రాజేశ్వర్ లు ప్రశ్నించారు. దీంతో అభంగపట్నానికి చెందిన దళితులను మురికినీళ్లలో ముంచి భరత్ రెడ్డి వారిని అవమానించాడని, వారిపై దాష్టీకానికి దిగాడని కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో నవంబర్ 12న సామాజిక మాధ్యమాలలో వైరల్ అయింది. దాంతో తొలుత భరత్‌రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లాడు. అనంతరం లక్ష్మణ్, రాజేశ్వర్ లు అదృశ్యమైపోవడం స్థానికంగా కలకలం రేపింది. కొన్ని రోజుల తర్వాత లక్ష్మణ్ భార్య లత, రాజేశ్వర్ భార్య భావన పోలీసులకు ఫిర్యాదు చేశారు.
భరత్‌రెడ్డిపై నవీపేట పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ, కిడ్నాప్ కేసులు నమోదు చేశారు. ఇద్దరు దళితులను భరత్ రెడ్డి కిడ్నాప్ చేశాడని, అతడిని అరెస్టు చేయాలని దళిత సంఘాల రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేపట్టాయి. ఈ క్రమంలో హైదరాబాద్ పోలీసులు అభంగపట్నం దళితులు లక్ష్మణ్, రాజేశ్వర్‌లను గుర్తించి అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. ఆశ్చర్యకర విషయాలు వెలుగుచూశాయి. తమను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, కేవలం సినిమా షూటింగ్ కోసమే మురికినీళ్లలో మునిగినట్లు నటించామని చెప్పడంతో పోలీసులే షాకవుతున్నట్లు తెలుస్తోంది. వారు చెప్పిన విషయాలు నిజమా కాదా అనే కోణంలోనూ విచారణ కొనసాగిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment