ఔట్‌గోయింగ్‌ కాల్‌ | special story to crime | Sakshi
Sakshi News home page

ఔట్‌గోయింగ్‌ కాల్‌

Published Tue, Mar 27 2018 12:37 AM | Last Updated on Wed, Apr 3 2019 8:03 PM

special  story to  crime  - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

నేరం చీకటి పొదలాంటిది. మనసును తన వైపు లాగుతుంది. ఎవరూ చూడరని ఎవరికీ కనిపించదని మనసును తన వైపు పురిగొల్పుతుంది.కాని చివరకు క్లూ అనే వెలుతురుకు దొరికిపోతుంది.

2015, వేసవి మొదటి నెల, కాకినాడ.ఇన్‌స్పెక్టర్‌కి ఉబ్బరింతగా ఉంది. చెమటతో యూనిఫామ్‌ తడిసిపోయి ఉంది. రాత్రి పదిన్నర దాటిపోవడంతో టీ దొరికే మార్గం కూడా లేదు. గవర్నమెంట్‌ ఆస్పత్రి కాంపౌండ్‌లో చాలాసేపుగా ఉన్నాడు. మళ్లీ ఎమర్జన్సీ వార్డు దగ్గరకు వెళ్లాడు.‘ఎలా ఉంది?’ డాక్టర్‌ని అడిగాడు.‘ఆమె పరిస్థితి క్రిటికల్‌గా ఉంది. అతడు ఔట్‌ ఆఫ్‌ డేంజర్‌ అనుకుంటున్నాము’వాళ్లు స్పృహలోకి రావడం ఇంపార్టెంట్‌. స్పృహలోకి వచ్చి ఏం జరిగిందో చెబితే తప్ప జరిగిందేమిటో పూర్తి పిక్చర్‌ రాదు.ఈ మధ్య కాలంలో ఇలాంటి ఇన్సిడెంట్‌ చూడలేదు. ఇంతటి చిక్కుముడి కూడా. అప్పటికే టౌన్‌ ఔట్‌స్కర్ట్స్‌లో పెట్రోలింగ్‌ పెట్టాడు. అనుమానంగా ఎవరూ దొరకలేదు.మరి దాడి చేసిందెవరు?

కొద్ది సేపటి ముందు.పోలీస్‌ స్టేషన్‌కు ఫోన్‌ వచ్చింది. ‘సార్‌... కాకినాడ– శొంఠివారిపాకల రూట్‌లో పొదల్లో ఒక జంట చావుబతుకుల్లో పడి ఉంది. భార్యాభర్తలు కావచ్చు. మీరు వెంటనే రండి’‘మీరెవరు?’‘ఆ దారిన వెళ్లే గ్రామస్తులమండీ’వెంటనే ఇన్‌స్పెక్టర్‌ అక్కడకు వెళ్లాడు. చుట్టూ చీకటి. సన్నని మట్టి రోడ్డు. కొద్ది దూరంలో ఇద్దరు ముగ్గురు గ్రామస్తులు నిలబడి పొదలవైపు చూపించారు.పొదల్లోంచి మూలుగులు వినిపిస్తున్నాయి. సెల్‌ఫోన్‌ లైట్‌లో చూశాడు ఇన్‌స్పెక్టర్‌. ఓ యువతి, యువకుడు తీవ్ర గాయాలతో పడి ఉన్నారు. భార్యాభర్తలని అనిపించింది. ఆమె నుంచి విపరీతంగా రక్తం కారుతోంది. రోడ్డు పక్కనే మోటారు సైకిల్‌ పడి ఉంది. మరో వైపు బీరుబాటిళ్లు పగిలి పడున్నాయి. బీరుబాటిళ్లను పగలగొట్టి పొడిచినట్టున్నారని అర్థమైంది. గాజు ఒంట్లో దిగితే చాలా ప్రమాదం.చాలా త్వరగా వాళ్లను ఆస్పత్రికి చేర్చే ఏర్పాటు చేశాడు ఇన్‌స్పెక్టర్‌. అతడి జేబులో దొరికిన సెల్‌ఫోన్‌ ద్వారా సంబంధీకులకు సమాచారం కూడా చేరవేశాడు.

టైమ్‌ పదకొండున్నర.ఇద్దరూ స్పృహలోకి రాలేదు.ఏం జరిగిందో తెలియడం లేదు. ఈ పరిస్థితికి ఉబ్బరింత తోడై విసుగ్గా ఉంది. దూరంగా వయసు మీరిన భార్యాభర్తలు దిగులుగా నిలబడి ఉన్నారు. మధ్య మధ్య ఏడుస్తున్నారు. ఇన్‌స్పెక్టర్‌ వాళ్లను కలిశాడు.‘వాళ్లు మీకు ఏమవుతారు?’‘నా కొడుకండీ. పెళ్లయి పదిహేను రోజులవుతోంది. అమ్మాయి మా ఆడపడుచు కూతురు. బయటి సంబంధం ఎందుకు అని చేసుకున్నాం. వాళ్లిద్దరూ చిన్నప్పటి నుంచి కలిసి పెరిగినా మావాడు వయసులో పెద్ద కనుక కొంచెం బెరుగ్గా దూరంగా ఉండేదా అమ్మాయి. పెళ్లయ్యాక కూడా ఆ బెరుకు పోలేదు. కాస్త అలా షికారుకు తీసుకెళితే మాటల్లో పడి బెరుకు పోతుందని సాయంత్రం తీసుకువెళ్లాడు. ఎంతకీ తిరిగి రాకపోవడంతో మేం కంగారు పడుతుంటే మీ వాళ్ల నుంచి ఫోన్‌ వచ్చింది’ ఏడుస్తూ చెప్పిందామె.‘మీకెవరైనా శత్రువులున్నారా?’‘లేరండీ’‘అమ్మాయి ఒంటి మీద బంగారం ఉండాలి. అది లేదు. దొంగలే ఈ పని చేసి ఉండాలి’ అన్నాడు ఆ పెద్దాయన.ఇన్‌స్పెక్టర్‌కు కూడా అదే అనిపిస్తోంది.
 
రాత్రి రెండు మూడు దాక కూడా ఇద్దరికీ స్పృహ రాలేదు.ఇన్‌స్పెక్టర్‌ కాసేపైనా నిద్రపోయి వద్దామని ఇంటికి వెళ్లి తిరిగి తెల్లవారుజామున ఆరు గంటలకు వచ్చాడు. ‘స్పృహ వచ్చిందా’ కాపలా ఉన్న కానిస్టేబుల్స్‌ని అడిగాడు.‘ఆమెకు ఇప్పుడే వచ్చిందని డాక్టర్లు చెప్పారు. అతనికి ఇంకా రాలేదు’ నేరుగా ఆమె దగ్గరకు వెళ్లాడు. భయంతో భీతితో హడలిపోయి ఉంది. కొనప్రాణంతో మాట్లాడినట్టుగా మాట్లాడింది. ‘నా పేరు జయ. నా భర్త పేరు సురేశ్‌. కొత్తగా పెళ్లయ్యింది. నన్ను షికారుకు తీసుకెళదామని మేట్నీకి తీసుకెళ్లాడాయన.  సినిమా అయ్యాక పార్క్‌లో చల్లగాలికి కాసేపు కూర్చున్నాం. ఇక ఇంటికి వెళ్లిపోదామనుకుంటుండగా ఆయనకు బీచ్‌కు తీసుకెళదామనిపించింది. బీచ్‌లో షికారు చేసి హోటల్‌లో భోజనం చేసుకుని ఇల్లు చేరుకుందాం అనుకున్నాం. బీచ్‌లో తొమ్మిది దాకా ఉన్నాం. తిరిగి బయలుదేరాక ఆయన దారిలో పొదల దగ్గర యూరిన్‌ కోసమని ఆగాడు. నేను బైక్‌ దిగి కొంచెం పక్కన నిలుచున్నాను. ఇంతలో ఓ మోటారు సైకిల్‌ వేగంగా వచ్చింది. దాని మీద ముగ్గురు ఉన్నారు. వాళ్లు రావడంతోటే మా మీద దాడికి దిగారు. ఇద్దరు సురేశ్‌ను కొడుతున్నారు. మూడో అతను నా ఒంటిపై ఉన్న నగలు ఇవ్వాలని బెదిరించాడు. నేను ఇవ్వను అనడంతో దగ్గరున్న బీరు సీసాలతో బాగా కొట్టాడు.మరొకడు పగిలిన బీరుసీసాతో నన్ను పొడిచాడు. అంతే నాకు మైకం కమ్మేసింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియలేదు.’చాలా అనుభవం ఉంది ఇన్స్‌పెక్టర్‌కు. ఆమె చెప్పింది అబద్ధం అనిపించలేదు.ఆమె భర్తకు స్పృహ వస్తే ఇంకొంత సమాచారం తెలుస్తుందనిపించింది.ఎనిమిది గంటలప్పుడు భర్తకు స్పృహ వచ్చింది.ఇన్‌స్పెక్టర్‌ మాట్లాడితే భార్య చెప్పిందే అటు ఇటూగా చెప్పాడు. అదనంగా ఏమీ తెలియడం లేదు. ఈ కేస్‌ని ఛేదించాలంటే క్లూ ఏమిటి?

ఉదయం పదిన్నరకు రాత్రి ట్రీట్‌ చేసిన డాక్టర్‌ వచ్చాడు.‘సారీ... కొంచెం లేటయ్యింది. ఇప్పుడే వాళ్లను చూసి వస్తున్నాను. దే ఆర్‌ వెల్‌. బయటపడిపోయారు’ ‘క్లూ ఏమీ దొరకడం లేదు డాక్టర్‌. మీకేం అనిపి
స్తోంది’‘అనిపించేది ఏముంది బ్రూటల్‌ ఎటాక్‌. నగల కోసమో మరెందుకో అయి ఉండాలి. రేప్‌ అటెంప్ట్‌ మాత్రం లేదు’‘అదే అనుకున్నాను. కాని ఆమె కళ్లు తెరుస్తుందనుకోలేదు. ఉదయానికి స్పృహ వచ్చింది.ఆమెకు వచ్చాకే అతనికి వచ్చింది’‘వాట్‌? అంతేం లేదే. అతనికి రాత్రే స్పృహ రావాలే.’ అన్నాడు డాక్టర్‌.‘అవునా?’‘హెడ్‌ ఇంజ్యురీ ఏమీ లేదు కదా ఆఫీసర్‌. పైదెబ్బలు మాత్రమే తగిలాయి. అతడికి రాత్రే స్పృహ వచ్చి ఉండాలి’.ఇన్స్‌పెక్టర్‌ తల పంకించాడు.
 
సురేశ్‌ కాల్‌డేటాలో లాస్ట్‌ కాల్‌ నాగబాబు అని ఉంది.ఎంక్వయిరీ చేస్తే అది సురేశ్‌ తమ్ముడి వరుసయ్యే వ్యక్తిది. క్యాజువల్‌ కాల్‌ కావచ్చు. ఎందుకైనా మంచిదని నాగబాబును పట్టుకొచ్చారు పోలీసులు. అతడు బాగా భయపడిపోయాడు.‘సార్‌ నాకేం తెలియదు. నేనసలు ఊళ్లోనే లేను. ఊరికే కాల్‌ చేశాను. అన్నయ్య ఎక్కడ ఉన్నాడో కనుక్కుందామని. అంతే’ అన్నాడు.ఇన్‌స్పెక్టర్‌ తల ఆడించి ‘సరే వెళ్లు’ అనబోయి మళ్లీ ఆగాడు. సురేశ్‌ కాల్‌డేటాలో ఉన్నది ఔట్‌ గోయింగ్‌. ఇతనేమో తనే ఫోన్‌ చేశాను అంటున్నాడు.‘ఒక్క నిమిషం’ అని ఆపాడు ఇన్‌స్పెక్టర్‌.ఆ తర్వాత కానిస్టేబుల్‌ వైపు తిరిగి ‘లాఠీ తీసుకురా’ అన్నాడు.

‘సార్‌... పెళ్లికి ముందే సురేశ్‌కి ఇంకో అమ్మాయితో సంబంధం ఉంది. కాని పెద్దవాళ్లు బలవంతం చేశారని మరదలిని పెళ్లి చేసుకున్నాడు. కాని మొదటి అమ్మాయిని వదులుకోలేకపోయాడు. ఇంకో వైపు అతనికి అప్పులున్నాయి. వీటన్నింటి నుంచి బయటపడటానికి భార్యను చంపేయడమే కరెక్ట్‌ అని నన్ను కాంటాక్ట్‌ చేశాడు’ అన్నాడు నాగబాబు.‘ఏంటి ప్లాన్‌’ అడిగాడు ఇన్స్‌పెక్టర్‌.‘మొదట కిరాయి హంతకులతో హత్య చేయించాలని పథకం వేశాడు. కాని వాళ్లు ఎక్కడ ఉంటారో తెలియలేదు. అందుకని నన్ను కలసి ఈ పని చేస్తే యాభై వేలు ఇస్తానని చెప్పాడు. నేను గోకవరం దగ్గర కొత్తపల్లి సమీపంలోని ఏజన్సీ ప్రాంతానికి చెందిన ఇంకో ఇద్దరిని కలుపుకున్నాను’‘వాళ్లకు ఎంతిస్తానన్నావు?’‘మనిషికి 1500’‘తర్వాత’‘సురేశ్‌ ముందే నిర్ణయించుకున్న విధంగా భార్యను టౌన్‌లో సినిమాకు తీసుకువెళ్లాడు. ఆ తర్వాత బీచ్‌కు తీసుకు వచ్చాడు. అక్కడ ఒక చోట బండి ఆపుతానని వెంటనే దాడి చేసి భార్యను హత్య చేయాలని, ఎవరికీ అనుమానం రాకుండా తనపై కూడా స్వల్పంగా దాడి చేయాలని, అలాగే ఆమె వేసుకున్న నగలు తీసి తనకు ఇవ్వాలని సురేశ్‌ మాకు ముందే చెప్పాడు. సరే అన్నాం. రాత్రి 9 గంటల సమయంలో కొత్తపల్లి మండలం శొంఠివారిపాకలు సమీపంలోకి వచ్చే సరికి యూరిన్‌ విషయం చెప్పి బండిని ఓ వైపుగా ఆపిన సురేశ్‌ పొదల దగ్గరకు వెళ్లాడు. అప్పటికే మాకు కాల్‌ చేసి చెప్పడంతో ఫాలో అయ్యి బండి దగ్గర నుంచుని ఉన్న జయపై ఒక్కసారిగా అటాక్‌ చేశాం. అప్పటికే బీరు తాగుతున్నాం.బాటిల్స్‌ చేతిలో ఉన్నాయి. నేను ఆ సీసాను పగలగొట్టి  ఆమెను పొడిచాను. జయ స్పృహæతప్పి పడిపోవడంతో చనిపోయిందనుకుని, ఆమె ఒంటిపై ఉన్న బంగారు నగలు, ఉంగరాలు, కాళ్లపట్టీలు లాక్కున్నాం. ఎవరికీ అనుమానం రాకుండా ప్లాన్‌ ప్రకారం సురేశ్‌ మెడలో ఉన్న చైన్‌ కూడా లాక్కొని అతడి ఒంటిమీద బీరు సీసాలతో అక్కడక్కడా చిన్న చిన్న గాట్లు పారిపోయాం’ అని ముగించాడు నాగబాబు.నేరం దాగదు. క్లూ తప్పక పట్టి ఇస్తుంది.

క్లూ కథనాలు పంపండి
రెండు రాష్ట్రాలలో ఎందరో గొప్ప పోలీస్‌ ఆఫీసర్లు ఉన్నారు. ఎన్నో గొప్ప కేసులను క్లూల ద్వారా సాల్వ్‌ చేసి ఉంటారు. అలాంటి ఆఫీసర్లకు ఇదే మా ఆహ్వానం. మీరు సాల్వ్‌ చేసిన కేసులను సాక్షి పాఠకులతో పంచుకోండి. నేరస్తుడు తప్పించుకోలేడన్న భావన నేరాన్ని సగం నిరోధిస్తుంది. నేరం లేని సమాజం కోసం సాక్షి చేస్తున్న ఈ ప్రయత్నానికి మీ సహకారాన్ని ఆశిస్తూ... మీరు సాల్వ్‌ చేసిన కేసు వివరాలు పంపాల్సిన ఈ మెయిల్‌: sakshiclue@gmail.com
– వీఎస్‌వీఎస్‌ వరప్రసాద్‌.
సాక్షి, పిఠాపురం, తూర్పుగోదావరి జిల్లా.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement