సాక్షి, సిటీబ్యూరో : ఎన్నికల నేపథ్యంలో పోలీసింగ్‌కు సంబంధించి ప్రాథమిక, అత్యంత కీలక ఘట్టం బదిలీలు. వీటికోసం అధికారులు అనేక చర్యలు తీసుకుంటూ ఉంటారు. అయినప్పటికీ పరిపాలన ఎన్నికల సంఘం చేతిలోకి వెళ్లిన తర్వాత భారీ స్థాయిలో బదిలీలు అనివార్యంగా మారుతున్నాయి. ఫలితంగా ఆయా స్థానాల్లోకి వస్తున్న కొత్త అధికారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎన్నికల నేపథ్యంలో బదిలీపై బయటి కమిషనరేట్లకు వెళ్తున్న అధికారులు తిరిగి రావడం పెద్ద ప్రహసనంగా మారిపోతోంది. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకున్న ఉన్నతాధికారులు నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో ‘ఎన్నికల బదిలీలకు’ కసరత్తులు చేస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల్లో సాధారణ ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో వీటికి గరిష్టంగా ఏడాది సమయం కూడా లేదు.
ప్రతి సందర్భంలోనూ ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసిన తరవాత బదిలీలకు సంబంధించి చర్యలు తీసుకోవాల్సి వస్తోంది. అప్పుడు పరిపాలన మొత్తం ఈసీ చేతిలో ఉంటుంది. అధికారుల బదిలీపై ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేస్తుందో చెప్పలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ముందస్తు వ్యూహాల్లో భాగంగా అధికారులు సిబ్బంది జాబితాలను సిద్ధం చేయాలని భావిస్తున్నారు. ప్రతిసారీ ఎన్నికల సందర్భంలో బదిలీలు అనివార్యమైన అంశంగా మారుతాయి. కమిషనరేట్లలో పోలీసుస్టేషన్లకు స్టేషన్ హౌస్ ఆఫీసర్లుగా పిలిచే ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారులు నేతృత్వం వహిస్తుంటారు. నిర్ణీత కాలం మించి (2 లేదా 3 ఏళ్లు) ఒకే చోట పని చేస్తున్న అధికారులను బదిలీ చేయాల్సిందిగా ఈసీ స్పష్టం చేస్తుంది. వీటిలోనే ఆ వ్యక్తులు ఏ ప్రాంతానికి చెందిన వారనేది పరిగణనలోకి తీసుకుంటుంది. 2009 ఎన్నికల సందర్భంలో జోన్‌ను యూనిట్‌గా తీసుకుని ఈసీ మార్గదర్శకాలను జారీ చేయగా... 2014 నాటికి కమిషనరేట్ యూనిట్‌గా మారింది. ఫలితంగా పొరుగు కమిషనరేట్‌తో పాటు జిల్లాల్లో ఉన్న వారికి ఇక్కడకు తీసుకువచ్చి, ఇక్కడి వారిని బయటకు పంపాల్సి వచ్చింది. ఆఖరి నిమిషంలో జరిగిన ఈ మార్పుతో కొత్తగా వచ్చిన పూర్తి కొత్త అధికారులు నిలదొక్కుకోవడం సమస్యగా మారుతోంది. దీని ప్రభావం ఎలక్షన్ పోలీసింగ్‌పై పడుతోంది.
సాధారణంగా స్టేషన్ హౌస్ ఆఫీసర్లు తమ సొంత నియోజకవర్గాల్లో లేకుండా చర్యలు తీసుకోవడం ఆనవాయితీ. శాంతిభద్రతల విభాగంతో పాటు ప్రత్యేక విభాగాలైన టాస్క్‌ఫోర్స్, సీసీఎస్‌లు, ట్రాఫిక్ విభాగాన్నీ పరిగణలోకి తీసుకుని బదిలీలు చేయాల్సి ఉంటుంది. ఈసీ నిబంధనలతో నగర కమిషనరేట్‌కు చెందిన వారిని ఇతర ప్రాంతాలకు బదిలీ చేస్తున్నప్పుడు ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తరవాత పాత స్థానాలకే రావచ్చని అధికారులు చెప్తున్నారు. క్రతువు ముగిసిన తర్వాత దీని అమలు కోసం సిటీ నుంచి వివిధ ప్రాంతాలకు బదిలీపై వెళ్లిన అధికారులు తిరిగి రావడానికి ఉన్నతాధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా ఫలితం ఉండట్లేదు. 2014 సాధారణ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా ‘మూడేళ్ల నిబంధన’ విధించిన ఎన్నికల సంఘం ఆ గడువు పూర్తి చేసుకున్న వారిని కమిషనరేట్ నుంచి బయటకు పంపాల్సిందిగా స్పష్టం చేసింది. దీంతో అప్పట్లో ఉన్న రెంటు కమిషనరేట్ల నుంచి భారీగానే ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారులు బదిలీ అయ్యారు. అనేక మంది పొరుగు జిల్లాలకూ ట్రాన్స్‌ఫర్‌పై వెళ్లారు.
ఆ సమయంలో వీరిని పంపిన ఉన్నతాధికారులు ఎలక్షన్ కోడ్ ఉపసంహరించిన వెంటనే తిరిగి పాత స్థానాల్లోనే నియమిస్తామంటూ చెప్పుకొచ్చారు. ఇది పూర్తిస్థాయిలో అమలుకాకపోవడంతో మరికొన్ని ఇబ్బందులు వచ్చాయి. ప్రస్తుతం వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుంటున్న ఉన్నతాధికారులు వచ్చే ఏడాది ఎన్నికల నేపథ్యంలో ఇలాంటి ఇబ్బందులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే ఆగస్టు–సెప్టెంబర్ నాటికి రెండేళ్ళ గడువు పూర్తి చేసుకున్న అధికారుల జాబితాను రూపొందించి బదిలీ చేయాలని నిర్ణయించారు. ఇలా చేస్తే ఎన్నికల నాటికి రెండు, మూడేళ్ళు పూర్తి చేసుకున్న వారు ఎవరూ ఉండరని భావిస్తున్నారు. ఇలా చేస్తే ఎన్నికల సమయానికి పెద్దగా జరిగే బదిలీలు ఉండవని, ఫలితంగా పోలీసింగ్, భద్రత, బందోబస్తుపై ప్రభావం ఉందని అధికారులు యోచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment