పెద్ద సమక్షంలో వివాహం చేసుకున్న శ్రీలత, సురేష్
పొదలకూరు: ప్రేమించుకున్నారు..పెళ్లి వరకు వచ్చేసరికి యువకుడు ముఖం చాటేశాడు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో పోలీస్ అధికారులే పెద్దలుగా కౌన్సెలింగ్ ఇచ్చి.. పోలీస్‌స్టేషన్‌నే కల్యాణ వేదికను చేసి బుధవారం రాత్రి పెళ్లి చేశారు. కొడవలూరు మండలం కొత్తవంగల్లుకు చెందిన శ్రీలతను పొదలకూరు మండలం అంకుపల్లికి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ కొప్పోలు సురేష్ రెండేళ్లుగా ప్రేమించారు. ఇటీవల శ్రీలత వివాహం చేసుకోమనడంతో సురేష్ ముఖం చాటేశాడు. దీంతో శ్రీలత పొదలకూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సీఐ ఏ శివరామకృష్ణారెడ్డి, ఎస్సై అల్లూరు జగత్‌సింగ్ ఒకటి, రెండు పర్యాయాలు ఇద్దరికి కౌన్సెలింగ్ చేసినా వివాహానికి కానిస్టేబుల్ తరఫున వారు సమ్మతించలేదు.
దీంతో చివరి కౌన్సెలింగ్‌ను సీఐ చేపట్టడంతో ఆయన ప్రయత్నం ఫలిచింది. కానిస్టేబుల్ సురేష్ శ్రీలతను వివాహం చేసుకునేందుకు ఒప్పుకోవడంతో కథ సుఖాంతం అయింది. వెంటనే సీఐ శివరామకృష్ణారెడ్డి సర్కిల్ కార్యాలయం వద్దనే ఉన్న వరసిద్ధి వినాయకుని దేవస్థానంలో ఇద్దరిని ఒక్కటి చేశారు. పోలీసు అధికారులు, సిబ్బంది సమక్షంలో శ్రీలత, సురేష్ ఒక్కటై పూలదండలు మార్చుకున్నారు. అమ్మాయి తరఫున చెక్కా మదన్‌మోహన్, దార్ల రాజశేఖర్, తాటిచెట్ల రవీంధ్రబాబు, ఉక్కాల దామోదరం, నంబూరు కరుణాకర్ దగ్గరుండి వివాహం జరిపించారు.
Comments
Please login to add a commentAdd a comment