
ఇటువంటి చెడు కళ్లకు చెక్ పెట్టడానికే త్వరలో బెంగళూరు సిటీ రోడ్లకు ‘స్మార్ట్ ఐస్’ వస్తున్నాయి.
‘నిర్భయ’ నుంచి నిధులు: ఢిల్లీలో జరిగిన నిర్భయ ఉదంతం నేపథ్యంలో దేశంలోని ప్రధాన నగరాలన్నింటినీ ‘సేఫ్ సిటీ’ ప్లాన్‌లోకి తీసుకొచ్చారు. అందులో భాగంగానే ఈ బిబిఎమ్‌పి అధికారులు స్మార్ట్ ఐస్‌ను అమరుస్తున్నారు. ఇందుకోసం 667 కోట్ల నిర్భయ నిధులు మంజూరయ్యాయి.
అవే కళ్లు... నిఘా కళ్లు... డేగ చూపులకంటే తీక్షణమైన చూపులు. ఈ మాటలన్నీ విలన్‌ని సూచిస్తుంటాయి. రాబోయే ప్రమాదానికి ఉపోద్ఘాతంలా ఉంటాయి. కానీ ఇవన్నీ ఇక మహిళలకు ఫ్రెండ్లీ కళ్లు. ఆ చూపులు ఆడవాళ్లకు అన్నయ్యల్లాంటి చూపులు. ఆ చూపుల కింద ఆడవాళ్లు ధైర్యంగా నడిచి వెళ్లవచ్చు. అది అర్ధరాత్రయినా అపరాత్రయినా సరే! బెంగళూరు పోలీసు వ్యవస్థ చొరవతో రూపొందిన ‘చురుకైన కళ్ల’ ప్రోగ్రామ్ అది. పేరు.. ‘స్మార్ట్ ఐస్’
మహానగరంలో మహిళ
బెంగళూరు అనగానే టెక్నాలజీ హబ్ గుర్తొస్తుంది. హైదరాబాద్ నగరం ఐటి అడుగులు నేర్చుకునేటప్పటికే బెంగళూరులో సాఫ్ట్‌వేర్ రంగం వేళ్లూనుకున్నది. పొరుగు రాష్ట్రాల వలసలతో ఆ నగరం రోజు రోజుకీ విస్తరిస్తోంది. ప్రధానమైన రోడ్డు మీద ఎడమ నుంచి కుడివైపుకి వెళ్లాలంటే యు టర్న్ కోసం కిలోమీటర్లు ప్రయాణించాలి. అలాంటి మహానగరంలో మగవాళ్లతోపాటు మహిళలు కూడా అదే స్థాయిలో ఉద్యోగాలు చేస్తుంటారు. ఇరవై నాలుగ్గంటలూ షిఫ్టులుంటాయి. ఎవరి డ్యూటీ టైమ్‌కి వాళ్లు ఇళ్ల నుంచి బయలు దేరాలి. డ్యూటీ అయిపోయిన తర్వాత ఇళ్లకు చేరాలి. అలాంటి పరిస్థితుల్లో ఎలాంటి ఆపదలు, టీజింగ్‌లు ఎదురైనా సరే ఇట్టే పట్టేయడానికి వీలుగా టెక్నాలజీని అభివృద్ధి చేస్తోంది పాలన వ్యవస్థ. అర్ధరాత్రి అయినా సరే మిట్టమధ్యాహ్నమే అన్నంత ధైర్యంగా ఆడవాళ్లు సంచరించవచ్చు.
మాయగాళ్లపై నిఘా!
ఇప్పటికే ఉన్న ‘సురక్ష మిత్ర’ పథకంలో భాగంగా బెంగళూరు నగరంలోని ప్రధాన రహదారులు, కూడళ్లు, ముఖ్యమైన హాస్పిటళ్లు, ఇతర పబ్లిక్ ప్రదేశాలు... అన్నీ కలుపుకుని మొత్తం 4,500 ప్రదేశాల్లో పదివేల నిఘా కెమెరాలను అమరుస్తోంది బిబిఎమ్‌పి (బృహత్ బెంగళూరు మహానగర పాలికె). జేబుదొంగలు, ఆకతాయిలు, రౌడీషీటర్‌లు, ట్రాఫికింగ్‌కు పాల్పడే కరడుగట్టిన నేరగాళ్ల నుంచి మహిళలకు రక్షణ కల్పించడానికి ఈ ‘స్మార్ట్ ఐస్’ ఆలోచన రూపుదాల్చింది. రోజులో 24 గంటలూ ఈ కళ్లు పని చేస్తూనే ఉంటాయి. వీటిని ‘ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సిస్టమ్’ పర్యవేక్షిస్తూ ఉంటుంది. ఉదాహరణకు నగరంలో ఒక వ్యక్తి రోజూ ఒక రోడ్డు మీద ప్రయాణిస్తూ, అదే వ్యక్తి ఒక్కరోజు ఊహించని మరోచోట సంచరించినట్లయితే ఆ ‘మార్పు’ కూడా వెంటనే రికార్డు అవుతుంటుంది. అవసరమైతే కెమెరా బ్యాకప్‌తో విశ్లేషించడానికి సాధ్యమవుతుంది. అలా నగరంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తి మీద మూడో కంటికి తెలియకుండానే పోలీస్ నిఘా మొదలవుతుంది.
– మను
Comments
Please login to add a commentAdd a comment