
సాక్షి, యాదాద్రి: తిరుమల తిరుపతి స్థాయిలో యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వం.. భక్తుల భద్రతకు అంతే పెద్దపీట వేస్తోంది. యాదాద్రి క్షేత్రం పనులు పూర్తయితే దేశ, విదేశాల నుంచి ప్రముఖులు, భక్తులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది. వీరి భద్రత కోసం ఎప్పటికప్పుడు ఇతర ప్రాంతాల నుంచి పోలీసులను తీసుకొచ్చే కంటే స్థానికంగా ఆర్మ్‌డ్ ఫోర్స్‌ను సిద్ధంగా ఉంచాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా క్షేత్రం భద్రతకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికను రూపొందించింది.
యాదాద్రి రక్షణ దళం
ప్రధానంగా భక్తుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలి. సీసీ కెమెరాల నిఘాలో శాంతిభద్రతల పర్యవేక్షణ ఉండాలి. వైటీడీఏ స్వయంగా సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేసుకుంటుంది. దీనికి అనుగుణంగా పోలీసు వ్యవస్థ సిద్ధంగా ఉండాలి. 100 నుంచి 150 మంది సాయుధ పోలీసులు నిత్యం అందుబాటులో ఉండాలి. దానికోసం రాచకొండ పోలీసు కమిషనరేట్‌కు చెందిన ఏఆర్ హెడ్‌క్వార్టర్‌ను యాదాద్రిలోనే ఏర్పాటు చేస్తారు. యాదాద్రికి ప్రత్యేకంగా ఏసీపీ కార్యాలయం, టెంపుల్ సిటీకి ప్రత్యేకంగా పోలీస్‌స్టేషన్ మంజూరు చేశారు. మొత్తం పోలీసు శాఖకు కావాల్సిన కార్యాలయాలు, క్వార్టర్‌లు నిర్మించుకోవడానికి 50 ఎకరాల స్థలం కేటాయిస్తున్నారు.
సాయుద దళం ఏర్పాటు
వీవీఐపీలు వచ్చినప్పుడు, అత్యవసర పరిస్థితుల రక్షణ బాధ్యతలను చూడటానికి సాయుధ దళాన్ని ఏర్పాటు చేస్తారు. రిజర్వ్‌పోలీస్, ఆక్టోపస్ గ్రేహౌండ్స్ పోలీస్‌లు నిరంతరం అందుబాటులో ఉంటారు. ఇందులో మొత్తం మూడు ప్లాటూన్‌ల సాయుధ పోలీస్‌లు నిరంతరం యాదాద్రి క్షేత్ర రక్షణ బాధ్యతలను చూస్తుంటారు. 25 మందితో ఆక్టోపస్ పోలీస్ దళం పనిచేస్తుంది.
ఇదీ స్వరూపం..
యాదాద్రి పుణ్యక్షేత్రం బాధ్యతలను చూడటానికి ఏసీపీ స్థాయిలో అ«ధికారి పర్యవేక్షణలో ప్రత్యేక పోలీస్ డివిజన్ ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఏసీపీని నియమించారు. కొండపైన అప్‌హిల్ పోలీస్ స్టేషన్, సీసీఎస్, మహిళా పోలీస్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, ప్రస్తుతం ఉన్న యాదగిరిగుట్ట పీఎస్‌తోపాటు మరో పోలీస్‌స్టేషన్ ఏర్పాటు అవుతుంది. వీటికి స్టేషన్ హౌజ్ అధికారులుగా ఇన్‌స్పెక్టర్‌లు ఉంటారు. దీంతోపాటు మొత్తంగా ఎస్‌ఐలు, ఏఎస్‌ఐలు, హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు మొత్తంగా 300 మంది వరకు అదనంగా రానున్నారు.