ఒకరితో ప్రేమ.. మరొకరితో పెళ్లి | Constable Cheating Woman in East Godavari | Sakshi
Sakshi News home page

ఒకరితో ప్రేమ.. మరొకరితో పెళ్లి

Published Wed, Aug 1 2018 6:46 AM | Last Updated on Tue, Mar 19 2019 5:52 PM

Constable Cheating Woman in East Godavari - Sakshi

కుటుంబీకులతో కలిసి గొల్లపాలెం పోలీస్టేషన్‌ ఆందోళన చేస్తున్న ఎదుట సంధ్య, వివాహం చేసుకున్న యువతితో కలిసి పోలీసుల విచారణకు హాజరైన నాగబాబు

తూర్పుగోదావరి ,కాజులూరు (రామచంద్రపురం): ఓ కానిస్టేబుల్‌ తనను ప్రేమించి పెళ్లి చేసుకోకుండా మోసగించాడంటూ గొల్లపాలెం పోలీసు స్టేషన్‌ ఎదుట ఒక యువతి మంగళవారం ఆందోళనకు దిగింది. బాధితురాలు, నిందితుడు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని శలపాకకు చెందిన వాకపల్లి నాగబాబు ఇండియన్‌ టిబెట్‌ బోర్డర్‌ ఫోర్స్‌లో కానిస్టేబుల్‌గా హర్యానాలో పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన పోలినాటి సంధ్య, నాగబాబు ప్రేమించుకుంటున్నారు. సంధ్య కాకినాడలో బీఎస్సీ నర్సింగ్‌ కోర్సు చదువుతుంది. ఈ క్రమంలో జూలై 23న సంధ్యతో కలిసి నాగబాబు బైక్‌పై వెళుతున్నారు. కాకినాడ సమీపంలోని అచ్చంపేట కూడలి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇరువురికీ గాయాలయ్యాయి. దీంతో వారి ప్రేమ సంగతి తెలుసుకున యువతి కుటుంబీకులు ఇరువురికీ వివాహం చేయమని నాగబాబు కుటుంబీకులను అడిగారు. నాగబాబు ఆసుపత్రి నుంచి వచ్చాక మాట్లాడదామంటూ అతడి తల్లిదండ్రులు విషయాన్ని దాటవేశారు.

దీంతో సంధ్య కుటుంబీకులు జూలై 29న కాకినాడ వెళ్లి ఎస్పీ ఆఫీసులో ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న నాగబాబు ఆమెను ఎలాగైనా వదిలించుకోవాలని తలంచాడు. అదే రోజు రాత్రి శలపాక గ్రామానికే  చెందిన దడాల పద్మశ్రీ అనే మరో అమ్మాయిని తుని చర్చిలో వివాహం చేసుకున్నాడు. దీంతో సంధ్య మంగళవారం తన బంధువులతో వచ్చి గొల్లపాలెం పొలీసు స్టేషన్‌ ఎదుట ఆందోళనకు దిగింది. ఎస్సై షేక్‌ జబీర్‌ ఆందోళనకారులను శాంతింపజేసి నిందితుడు నాగబాబును పోలీసు స్టేషన్‌కు రప్పించారు. తాను ముందు నుంచీ దడాల పద్మశ్రీనే ప్రేమిస్తున్నానని జూలై 14న తమ ఇద్దరికీ వివాహమైందంటూ అబద్ధం చెప్పాడు. సంధ్య ఆరోపించినట్టుగా తమ విహహం జూలై 29న జరగలేదని, ఆ రోజు తాను గాయాలతో ఆసుపత్రిలో ఉన్నానని నిందితుడు ఫొటోలు, ఇతర ఆధారాలు చూపి, పోలీసులు, స్థానికులను నమ్మించే ప్రయత్నం చేశాడు. దీంతో నిందితుడు, అతడి స్నేహితుల సెల్‌ఫోన్లు సేకరించిన ఎస్సై షేక్‌ జబీర్‌ ఇరు వర్గీయులను విచారించారు. బాధితురాలు జూలై 29న ఎస్పీకి ఫిర్యాదు చేశాక, అదే రోజు రాత్రి నిందితుడు దడాల పద్మశ్రీని వివాహం చేసుకున్నాడు. ఆ సమయానికి అతడికి అంత తీవ్రమైన గాయాలు లేవు. ఈ విషయాన్ని అతడి స్నేహితులు సెల్‌ఫోన్‌లో తీసిన ఫొటోలు బయట పెట్టారు. దీంతో నిందితుడు నాగబాబు తాను చేసిన మోసాన్ని అంగీకరించాడు.దీంతో నాగబాబుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని ఎస్సై షేక్‌ జబీర్‌ చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement