భూమాయ!
భూమాయ!
Published Sat, Jul 22 2017 11:01 PM | Last Updated on Tue, Aug 21 2018 9:20 PM
- పోలీసుస్టేషన్ భూమి ఇతరుల పేరు మీద మార్పిడి
- కాసులకు కక్కుర్తి పడిన రెవెన్యూ అధికారులు
- ఆన్‌లైన్‌లో హైదరాబాదుకు చెందిన సంస్థ పేరు ఎక్కింపు
- ఆలస్యంగా వెలుగుచూసిన అధికారుల భూమాయ!
పైసామే పరమాత్మ అని మన పెద్దలు ఏ సందర్భంలో చెప్పారో ఏమో తెలియదు కానీ రెవెన్యూ అధికారులు మాత్రం ప్రతి విషయంలో దాన్నే ఫాలో అవుతున్నారు. కాసులిస్తే చాలు కాదనుకున్న పని కూడా చేసి పెడతారు. ఒక్క మాటలో చెప్పాలంటే తిమ్మిని బమ్మిచేస్తారు..బమ్మిని తిమ్మి చేస్తారు. జూపాడుబంగ్లా పోలీస్‌స్టేషన్ స్థలాన్ని ఇతరుల పేరు మీద మార్చి వారికి డీ పట్టా పాసుపుసక్తం జారీ చేయడం వారి లీలలకు మచ్చుక. ఆలస్యంగా వెలుగుచూసిన భూమాయపై సాక్షి ప్రత్యేక కథనం.
జూపాడుబంగ్లా: రెవెన్యూ అ«ధికారులు అడంగల్ ప్రకారం 105 సర్వేనెంబరులో 15.88 ఎకరాల భూమి ఉంది. ఆర్‌ఎస్‌ఆర్(రెవెన్యూ సర్వే రికార్డు) లో 105 సర్వేనెంబర్ అస్సలు లేదు. 105ఏ సర్వేనెంబరు ఉండగా అందులో 2.58 ఎకరాలు, 105బీలో 15.38 ఎకరాల స్థలం ఉంది. రెండు సర్వేనెంబర్లలో మొత్తం 17.96 ఎకరాలు ఉంది. అందులో వెంకటమ్మ పేరు మీద ఉన్న ఐదెకరాలను ఆమె సాగు చేసుకోవడం లేదనే కారణంతో 1993లో జూపాడుబంగ్లా పోలీసుస్టేషన్ నిర్మాణం కోసం కేటాయించారు.
మార్పిడి జరిగిందిలా: పోలీసు స్టేషన్‌కు కేటాయించిన ఐదు ఎకరాల్లో స్టేషన్, సిబ్బంది క్వార్టర్స్ నిర్మాణానికి రెండు ఎకరాలు పోగా మూడు ఎకరాలు మిగిలింది. దీన్ని గుట్టుచప్పుడు కాకుండా వెంకటమ్మ.. వెంకటరెడ్డి అనే వ్యక్తికి విక్రయించింది. తర్వాత అతడు పోలీసుస్టేషన్‌కు కేటాయించిన భూమిగా గుర్తించి నెమ్మదిగా హైదరాబాదుకు చెందిన ఓ సంస్థకు విక్రయించాడు. వారికి అసలు విషయం తెలియడంతో ఆ భూమిని ఏడాది క్రితం హైదరాబాదుకు చెందిన కొత్తపల్లి మేరీగోమేధిక అనే సంస్థకు విక్రయించారు. వారు రెవెన్యూ అధికారులకు ముడుపులు ముట్టజెప్పడంతో ఆ భూమిని ఆసంస్థ పేరుపై ట్రాన్స్‌ఫర్‌చేసి వారికి డిపట్టాపాసుపుస్తకాలు ఇచ్చారు. అంతేకాదు వారి పేరు మీదనే ఆన్‌లైన్‌లో ఎక్కించారు.
వెలుగుచూసిందిలా: మండలానికి చెందిన సుంకులమ్మ అనే మహిళ పోలీసు స్టేషన్ నిర్మించిన స్థలం తనదేనంటూ హైకోర్టులో రిట్ దాఖలు చేసింది. కోర్టు నుంచి నోటీసులు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. స్టేషన్ భూమి ఎంతవరకు ఉందో తెలియజేయాలంటూ రెవెన్యూ అధికారులను సంప్రదించారు. సరైన సమాధానం రాకపోవడంతో కలెక్టర్‌ను ఆశ్రయించి విషయం చెప్పారు. స్పందించిన ఆయన గతంలో స్టేషన్‌కు కేటాయించిన ఐదెకరాల స్థలం వారికి చూపించమని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. దిక్కుతోచని ఆ శాఖ అధికారులు పోలీసుస్టేషన్ స్థలం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందో కొలతలు వేశారు. ఆక్రమణకు గురైన స్థలం స్టేషన్‌దేనని తేలింది.
అధికారులపై ఆరోపణల వెల్లువ:
తహసీల్దార్ కార్యాలయానికి కూతవేటు దూరంలో పోలీస్‌స్టేషన్ ఉంది. ఈ స్టేషన్‌కు సంబంధించి మూడెకరాల స్థలాన్ని కొందరు అక్రమంగా కొనుగోలు చేసి కంచెవేసినా రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడం వెనుక ఏదో మతలాబు ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
స్టేషన్‌కు 5 ఎకరాల స్థలం కేటాయించారు: అశోక్, ఎస్‌ఐ, జూపాడుబంగ్లా
హైకోర్టులో ఓ మహిళ రిట్‌వేసేదాకా పోలీసుస్టేషన్‌కు స్థలం ఎంత ఉందనే విషయం పూర్తిగా తెలియదు. తర్వాత విచారించగా 5 ఎకరాల స్థలం కేటాయించినట్లు తెలిసింది. ఈ విషయాన్ని ఎస్పీ, డీఎస్పీ, సీఐ ల సహకారంతో జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లం. పోలీసుస్టేషన్‌కు 5ఎకరాల స్థలం కేటాయించాలని కలెక్టర్ ఆదేశాలు జారీచేశారు.
అనుభవంలో లేకపోవడంతో కబ్జాచేశారు: జాకీర్‌హుసేన్, తహసీల్దారు జూపాడుబంగ్లా
జూపాడుబంగ్లా పోలీసుస్టేషన్‌కు 25 ఏళ్ల క్రితం 5 ఎకరాల స్థలాన్ని అప్పటి కలెక్టర్ కేటాయించారు. అయితే 2ఎకరాల్లో మాత్రమే స్టేషన్, భవనాలు నిర్మించుకున్నారు. మిగిలిన 3 ఎకరాల స్థలం ఖాళీగా ఉండటం..దాని చుట్టూ కంచెవేసుకోకపోవటంతో ఇతరులు కబ్జాచేసి విక్రయించుకున్నారు. ప్రస్తుతం దాన్ని రద్దుచేసి పోలీసుస్టేషన్‌కు అప్పగిస్తాం.
Advertisement