పోలీస్ స్టేషన్లా....టీడీపీ కార్యాలయాలా...!
♦ ఖాకీల తీరుపై వైఎస్సార్ సీపీ మండిపాటు
♦ శహపురం ఘటనపై కలెక్టరేట్ వద్ద ధర్నా
♦ ఎమ్మెల్యేపై కేసు, ఎస్సై సస్పెన్షన్‌కు డిమాండ్
♦ జీజీహెచ్ నుంచి కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ
కాకినాడ: ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీస్‌స్టేషన్లు తెలుగుదేశం పార్టీ కార్యాలయాల్లా తయారయ్యాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడ్డారు. రాజకీయాలపై ఆసక్తి ఉంటే పోలీసులు పచ్చ చొక్కాలు వేసుకుని టీడీపీలో చేరాలని ఎద్దేవా చేశారు. పెదపూడి మండలం శహపురం గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త రాయుడు సత్యనారాయణ ఆత్మహత్య ఘటనకు బాధ్యులైన ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఎస్సై కిశోర్‌బాబులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జిల్లా పార్టీ అధ్యక్షుడు కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో పార్టీ నేతలు మంగళవారం కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేశారు. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన కో–ఆర్డినేటర్లు, నాయకులు, కార్యకర్తలు తొలుత ప్రభుత్వాస్ప్రతి మార్చురీకి చేరుకుని మృతుని కుటుంబాన్ని ఓదార్చారు.
భవిష్యత్తు కార్యాచరణపై నాయకులంతా చర్చించారు. అనంతరం జీజీహెచ్ నుంచి ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకుని బైఠాయించారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు మాట్లాడుతూ తమ పార్టీ నాయకులు, కార్యకర్తలను రౌడీలు, గూండాల్లా ముద్రవేసి అక్రమ కేసులు పెడుతున్నారంటూ మండిపడ్డారు. అధికార పార్టీకి పోలీసులు తొత్తులుగా మారారంటూ ధ్వజమెత్తారు. ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ మాట్లాడుతూ తెలుగుదేశం పాలనలో పోలీస్ స్టేషన్లు అధికార పార్టీ పరిపాలనా కేంద్రాలుగా మారాయంటూ విమర్శించారు. కొన్నిచోట్ల ఫిర్యాదుదారులు, ముద్దాయిలు ఎవరో కూడా తెలియకుండానే కేసులు కూడా నమోదవుతున్నాయని ఎద్దేవా చేశారు.
రక్షక భటులా...రాక్షస భటులా...
తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా మాట్లాడుతూ కొన్ని సామాజిక వర్గాలను లక్ష్యంగా చేసుకుంటూ తెలుగుదేశం ప్రభుత్వం దాడులకు పాల్పడుతుందని మండిపడ్డారు. రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి మాట్లాడుతూ తప్పుడు కేసులపై తెలుగుదేశం ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ చంద్రబాబు దుర్యోధన, దుశ్శాసన పాలనకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారని, సౌమ్యంగా ఉండే ఈ ప్రాంత ప్రజలు తిరగబడే పరిస్థితి తెచ్చుకోవద్దని హితవు పలికారు. అనపర్తి కో–ఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి మాట్లాడుతూ గడచిన కొద్ది నెలలుగా తమ పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు, వేధింపులు ఎక్కువయ్యాయన్నారు. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ పార్టీ కేడర్‌కు ఎక్కడ అన్యాయం జరిగినా ఉపేక్షించబోమని హెచ్చరించారు.
మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు మాట్లాడుతూ కేసులతో తమను ఎవ్వరూ భయపెట్టలేరని, తిరగబడే పరిస్థితులు తెచ్చుకోవద్దని హెచ్చరించారు. ప్రత్తిపాడు కో–ఆర్డినేటర్ పర్వత పూర్ణచంద్రప్రసాద్ మాట్లాడుతూ రౌడీషీట్లు, తప్పుడు కేసులకు తమ పార్టీ ఏ మాత్రం బెదరదన్నారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా మాట్లాడుతూ కనీసం మానవత్వం కూడా లేకుండా 64 ఏళ్ళ వృద్ధునిపై రౌడీషీట్ పేరుతో ఇబ్బందులకు గురిచేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. జిల్లా యూత్ అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్ మాట్లాడుతూ రాజకీయ కక్షలకు తెరలేపి ప్రశాంతంగా ఉండే తూర్పు గోదావరి జిల్లాను సమస్యాత్మక ప్రాంతంగా చేస్తున్నారని ధ్వజమెత్తారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు మాట్లాడుతూ జిల్లాలో పోలీసులు రక్షక భటుల్లా కాక, రాక్షస భటుల్లా తయారయ్యారన మండిపడ్డారు. ఆందోళన అనంతరం కలెక్టర్ కార్తికేయమిశ్రాను కలిసి జిల్లాలో వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై పెరిగిన దాడులు, అక్రమ కేసులపై వినతిపత్రం అందజేశారు. అక్కడి నుంచి ఎస్పీ విశాల్‌గున్నిని కూడా కలిసి టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పెట్టిన కేసులపై పునఃసమీక్షించాలని కోరుతూ మరో వినతిపత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో వివిధ నియోజకవర్గాల కో–ఆర్డినేటర్లు వేగుళ్ళ లీలాకృష్ణ, కొండేటి చిట్టిబాబు, తోట సుబ్బారావునాయుడు, ముత్యాల శ్రీనివాస్, రాష్ట్ర అధికార ప్రతినిధి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, రాష్ట్ర ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శులు మిండకుదిటి మోహన్, వట్టికూటి రాజశేఖర్, మోతుకూరి వెంకటేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టిబత్తుల రాజబాబు, కాకినాడ నగర అధ్యక్షుడు ఆర్‌వీజేఆర్ కుమార్, జిల్లా మైనార్టీసెల్, పంచాయతీరాజ్ అభియాన్ అధ్యక్షుడు అబ్దుల్‌బషీరుద్దీన్, హరనా«థ్, జిల్లా అధికార ప్రతినిధి సత్తి వీర్రెడ్డి, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి సత్తి వీర్రెడ్డి, రాజమహేంద్రవరం మైనార్టీసెల్ అధ్యక్షుడు ఆరీఫ్, రాష్ట్ర రైతు విభాగం కార్యనిర్వాహక కార్యదర్శి కొవ్వూరి త్రినాథరెడ్డి, ముమ్మిడివరం నగరపంచాయతీ ప్లోర్‌లీడర్ కాశిమునికుమారి, కాకినాడ నగర విద్యార్థి, మైనార్టీ విభాగాల కన్వీనర్లు రోకళ్ళ సత్యనారాయణ, అక్బర్ అజామ్ తదితరులు హాజరయ్యారు.