సాక్షి, హైదరాబాద్: పోలీసు శాఖ ఓవైపు అధునాతన టెక్నాలజీని వినియోగిస్తూ దూసుకెళ్తుంటే.. మరోవైపు కింది స్థాయి సిబ్బంది మాత్రం ఇంకా నైరాశ్యంలోనే కొట్టుమిట్టాడుతున్నారు. వారంలో ఒక్కరోజైనా వీక్లీ ఆఫ్‌గా తీసుకునే అవకాశం లేక సతమతమవుతున్నారు. మద్యానికి బానిసై కుటుంబాలకు దూరం కావొద్దంటూ కిందిస్థాయి పోలీసు సిబ్బందికి సందేశాలు పంపిస్తున్న ఉన్నతాధికారులు.. వారికి వీక్లీ ఆఫ్ మంజూరు అంశంలో మాత్రం విఫలమవుతున్నారు. వీక్లీ ఆఫ్ హామీ పదేళ్లుగా ఏ మాత్రం ముందుకు కదలకపోవడం గమనార్హం. ఇదేమిటంటే సిబ్బంది కొరత, శాంతి భద్రతల విధుల కారణంగా వీక్లీ ఆఫ్ ఇవ్వలేని పరిస్థితి ఉందనే సమాధానం వస్తోంది. అయితే గత మూడు నాలుగేళ్లలో పోలీసు శాఖలో వేల సంఖ్యలో పోస్టులను భర్తీ చేసినా కూడా.. వీక్లీ ఆఫ్ ఎందుకు అమలు కావడం లేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
సిబ్బంది కొరత పేరిట..: పోలీసుశాఖలో దాదాపు 46 వేల మందికిపైగా కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు పనిచేస్తున్నారు. అందులో మెజారిటీ శాతం సివిల్ విభాగంలో పనిచేసేవారే. వీరికి వీక్లీ ఆఫ్ ఇస్తామని పదేళ్లుగా ఉన్నతాధికారులు ప్రకటిస్తూ వస్తున్నారు. సివిల్ విభాగం శాంతి భద్రతల పరిరక్షణలో కీలకం కాబట్టి అమలు చేయడం కష్టమని చెబుతూ దాటవేస్తున్నారు. కొత్తగా పెద్ద సంఖ్యలో కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేసినందున సిబ్బంది కొరత అనేది పెద్ద సమస్య కాదని.. దీనిని అధిగమించేందుకు ఉన్నతాధికారులు కసరత్తు చేయకపోవడమే ఆందోళనకరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనికితోడు టెక్నాలజీ పెరిగినకొద్దీ పనిభారం తగ్గుతోందని.. ఈ నేపథ్యంలో వీక్లీ ఆఫ్ అమలు చేయాలని డిమాండ్లు వస్తున్నాయి.
తగిన విధంగా వినియోగించుకుంటే..
పోలీస్‌స్టేషన్‌లో ఉన్న సిబ్బందిని సరైన రీతిలో ఉపయోగించుకుంటే వీక్లీ ఆఫ్ ఇవ్వడం కష్టం కాదన్నది కొందరు సీనియర్ ఐపీఎస్‌ల అభిప్రాయం. ఠాణాల వారీగా సిబ్బంది ఎంత మంది ఉన్నారు, వారి డ్యూటీ చార్ట్, సెక్టార్ల కేటాయింపు తదితరాలపై వారం పదిరోజులు కసరత్తు చేస్తే వీక్లీ ఆఫ్ అమలు పెద్ద కష్టం కాదని పేర్కొంటున్నారు. ఒక కానిస్టేబుల్‌కు ఠాణా లో పక్కాగా ఒక డ్యూటీ కేటాయించడం, ఆ వ్యక్తికి రిలీవర్‌గా మరో కానిస్టేబుల్‌ను నియమించి నెల, రెండు నెలల పాటు పైలట్‌గా డ్యూటీలు చేయించడం ద్వారా ఏదైనా సమస్యలు ఉంటాయా? ఉంటే వాటిని ఎలా అధిగమించాలన్న దానిపై సబ్‌ఇన్‌స్పెక్టర్, ఇన్‌స్పెక్టర్ స్థాయిలో కసరత్తు చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఇది ఆయా ఠాణాల పరిధిలో శాంతి భద్రతల పరిస్థితి, సిబ్బంది సామర్థ్యంపై ఆధారపడి ఉంటుందని సీనియర్ అధికారులు చెబుతున్నారు.
గ్రామీణ ఠాణాల్లో పరిస్థితి ఇదీ..
జిల్లాల్లోని మండల స్థాయి పోలీస్‌స్టేషన్లు/ఎస్సై స్టేషన్ హౌజ్ ఆఫీసర్‌గా ఉన్న ఠాణాల్లో 21 మంది కానిస్టేబుళ్లు, నలుగురు హెడ్ కానిస్టేబుళ్లు, ఇద్దరు అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్లు, ఒక సబ్ ఇన్‌స్పెక్టర్ ఉంటారు. ఒక మండల స్థాయి ఠాణా పరిధిలో గరిష్టంగా 22 నుంచి 25 గ్రామాలు ఉంటాయి. ఠాణాకు రోజువారీ ఫిర్యాదులు, ఎఫ్‌ఐఆర్ నమో దు తదితర స్టేషన్ మేనేజ్‌మెంట్‌కు ఒక ఏఎస్సై అడ్మిన్‌గా ఉంటే.. బందోబస్తు, కేసుల దర్యాప్తులకు మరో ఏఎస్సై, ఒక హెడ్‌కానిస్టేబుల్, నలుగురు కానిస్టేబుళ్లను కేటాయించుకోవచ్చు. మిగతా వారు గ్రామాలు, అక్కడ జరుగుతున్న నేరాలు, రోజువారీ శాంతి భద్రతలు, స్టేషన్ డ్యూటీలను పర్యవేక్షిస్తారు. సరైన రీతిలో వర్క్ మేనేజ్‌మెంట్ ఉపయోగిస్తే వీరందరికీ వీక్లీ ఆఫ్ కేటాయించడం పెద్ద కష్టం కాదన్నది జిల్లా ఎస్పీల అభిప్రాయం.
అర్బన్ స్టేషన్లలో కష్టమే!
పోలీస్ కమిషనరేట్లు, అర్బన్ ప్రాంతాల్లో ఒక్కో ఠాణాకు ఒక ఇన్‌స్పెక్టర్, 4 ఎస్సై, 6 ఏఎస్సైలు, 8 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 30 మంది కానిస్టేబుళ్లు ఉంటారు. పట్టణ ప్రాంతాల్లో వీఐపీల బందోబస్తు, నేరాలు కారణంగా వీక్లీ ఆఫ్ కొంత కష్టమని చెబుతున్నారు. ప్రతి ఠాణాకు మరో 6 నుంచి 8 మంది కానిస్టేబుళ్లను కేటాయిస్తే, వీక్లీ ఆఫ్ అమలు సులభమని పోలీస్ కమిషనర్లు చెబుతున్నారు.
కానిస్టేబుళ్లకు వీక్లీ ఆఫ్ ఏదీ?
Published Sun, May 13 2018 1:22 AM | Last Updated on Tue, Aug 21 2018 9:20 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment