law and orders
-
సమష్టి కృషితోనే నేరాలకు అడ్డుకట్ట
సూరజ్‌కుండ్(హరియాణా): దేశవ్యాప్తంగా విస్తరించిన నేర సామ్రాజ్యాన్ని కూల్చేయడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమష్టి బాధ్యత అని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పునరుద్ఘాటించారు. హరియాణాలోని సూరజ్‌కుండ్‌లో జరుగుతున్న అన్ని రాష్ట్రాల హోం శాఖ మంత్రులు, పోలీసు ఉన్నతాధికారుల ‘చింతన్ శిబిర్’ సదస్సులో అమిత్ షా ప్రసంగించారు. ‘ స్వాతంత్య్ర దినోత్సవం రోజు ప్రధాని మోదీ అభిలషించిన పంచప్రాణ లక్ష్యాలు, వందేళ్ల స్వతంత్రభారతం(2047 దార్శనికత)ను సాకారం చేసుకోవడానికి ఈ చింతన్ శిబిర్‌లో ఫలవంత కార్యాచరణను సంసిద్ధం చేసుకుందాం. జమ్మూకశ్మీర్, విదేశీ అక్రమ విరాళాలు, మాదకద్రవ్యాల నిరోధం, ఈశాన్యరాష్ట్రాల్లో వేర్పాటువాదుల లొంగుబాటుతో సమస్యలను అణచేసి దేశ అంతర్గత భద్రతను పెంచడంలో మోదీ సర్కార్ సఫలత సాధించింది. ‘పశుపతి(నాథ్) నుంచి తిరుపతి వరకు వామపక్ష తీవ్రవాదం ఉండేది. అదీ సద్దుమణిగింది. ఇక, రాష్ట్రంలో శాంతిభద్రత అనేది ఆ రాష్ట్ర అంశమే. కానీ, మనందరం ఉమ్మడిగా పోరాడి అన్ని రాష్ట్రాల్లో నేరాలను అణచివేద్దాం. ఇది మనందరి సమష్టి బాధ్యత’ అని హోం మంత్రులతో షా వ్యాఖ్యానించారు. ‘కొన్ని ఎన్జీవోలు మతమార్పిడి వంటి దుశ్చర్యలకు పాల్పడ్డాయి. దేశార్థికాన్ని బలహీనపరిచేలా, అభివృద్ధిని అడ్డుకునేలా దేశ వ్యతిరేక కార్యకలాపాలకు విదేశీ నిధులను దుర్వినియోగం చేశాయి. వీటిపై విదేశీ విరాళాల నియంత్రణ చట్టం కింద ఆంక్షల చర్యలు తీసుకున్నాం’ అని షా చెప్పారు. -
అవిశ్వాసానికి ముందే ఇమ్రాన్‌ఖాన్‌ను అరెస్టు చేయాలి!
Nawaz Sharif Allegedly Attacked in UK: పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ పై ప్రతిపక్ష పార్టీ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే అవిశ్వాస తీర్మానానికి ముందు తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసం ఇమ్రాన్‌ఖాన్ శనివారం దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు. అంతేకాదు ఇమ్రాన్ ఖాన్ జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఈ కుట్రకు వ్యతిరేకంగా శని, ఆదివారాల్లో ఆందోళన చేయాలని పాకిస్తాన్ యువతని కోరారు. మరోవైపు యూకెలో ఉన్న పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌పై దాడి జరిగింది. షరీఫ్ పై ఇమ్రాన్ ఖాన్ పార్టీ కార్యకర్త దాడికి పాల్పడినట్లు పాకిస్తాన్ మీడియా శనివారం వెల్లడించింది. దీంతో నవాజ్ షరీఫ్ కూతురు, పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ పార్టీ నాయకురాలు మర్యమ్ నవాజ్ షరీఫ్ ఇమ్రాన్ ఖాన్ పై నిప్పులు చెరిగారు. ఇమ్రాన్ ఖాన్ని అవిశ్వాస తీర్మానానికి ముందే అరెస్టు చేయాలని ట్విట్టర్లో పిలుపునిచ్చారు. హింసను ప్రేరేపించి శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు గానూ ఆయన పై దేశద్రోహం కేసు నమోదు చేయాలి అని అన్నారు. ఆదివారం ఇమ్రాన్‌ఖాన్ ప్రభత్వం పై జరగనున్న అవిశ్వాస తీర్మానానికి ఒక రోజు ముందే నవాజ్ షరీఫ్ పై దాడి జరగడం గమనార్హం. ఇమ్రాన్‌ఖాన్ విదేశాల నుంచి వచ్చిన బెదిరింపు లేఖ గురించి ప్రస్తావించడమే కాకుండా దానికి ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానానికి ముడిపెట్టాడని విమర్శించారు. తమ పార్లమెంట్ కమిటీ కూడా ఆ పత్రాన్ని పరిశీలిస్తోందని తెలిపారు. ప్రముఖ పాకిస్తానీ జర్నలిస్ట్ అహ్మద్ నూరానీ ట్విట్టర్లో.. ఇమ్రాన్‌ఖాన్ పార్టీ అన్ని హద్దులు అతిక్రమంచింది. శారీరక దాడిని సహించం. నవాజ్ షరీఫ్ పై జరిగిన దాడిలో ఆయన బాడీగార్డు గాయపడ్డాడు. నిందితులను సత్వరమే పట్టుకునేలా తగిన చర్యలు తీసుకోవాలి. (చదవండి: అవిశ్వాస’ పరీక్షలో ఇమ్రాన్ నెగ్గేనా?) -
నేరాల నియంత్రణలో ఏపీ భేష్
సాక్షి, అమరావతి: నేరాల కట్టడి, శాంతిభద్రతల పరిరక్షణలో రాష్ట్ర ప్రభుత్వం మరోసారి శభాష్ అనిపించుకుంది. ప్రజలకు భద్రత కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వ సమర్థ పనితీరుకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. రాష్ట్రంలో నేరాలు తగ్గాయని కేంద్ర హోం శాఖకు చెందిన ‘జాతీయ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) వార్షిక నివేదిక–2020’లో ప్రకటించడమే ఇందుకు నిదర్శనం. 2020లో దేశవ్యాప్తంగా నేరాలకు సంబంధించిన కేసులు, గణాంకాలను క్రోడీకరించి ఎన్సీఆర్బీ ఈ నివేదికను బుధవారం విడుదల చేసింది. 2019తో పోలిస్తే 2020లో ఆంధ్రప్రదేశ్‌లో నేరాలు 15 శాతం తగ్గాయని ఈ నివేదిక వెల్లడించడం విశేషం. 2018తో పోలిస్తే నేరాలు 20 శాతానికిపైగా తగ్గడం ప్రాధాన్యం సంతరించుకుంది. హత్యలు, హత్యాయత్నాలు, అత్యాచారాలు, అత్యాచార యత్నాలు, మహిళలపై ఇతరత్రా వేధింపులు, దోపిడీలు, ఎస్టీ, ఎస్సీలపై నేరాలు ఇలా అన్నీ తగ్గాయి. 2020లో కరోనా వ్యాప్తిని కట్టడి చేసే చర్యల్లో భాగంగా లాక్డౌన్, కర్ఫ్యూలను అమలు చేసేందుకు పోలీసులు నమోదు చేసిన కేసులే ఎక్కువగా ఉన్నాయి. ఇసుక, మద్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు ఉద్దేశించిన కేసులు కూడా అధికమే. ఈ కేసులు శాంతిభద్రతలకు సంబంధించినవి కావని ఎన్సీఆర్బీ స్పష్టం చేసింది. ఎన్సీఆర్బీ నివేదికలోని ప్రధాన అంశాలు.. నేర స్వభావం ఉన్న కేసులు తక్కువే.. 2019లో రాష్ట్రంలో ఐపీసీ సెక్షన్ల కింద 1,19,229 కేసులు నమోదయ్యాయి. కాగా, 2020లో 1,88,997 కేసులు నమోదు చేశారు. కానీ వాటిలో 88,377 కేసులు కరోనా కట్టడి కోసం నమోదు చేసిన కేసులే. అంటే.. లాక్డౌన్, కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘించి రోడ్ల మీద తిరుగుతున్నవారు, అనుమతించిన సమయం దాటాక కూడా దుకాణాలు నిర్వహించినవారిపై నమోదైన కేసులే అవి. వాటిని మినహాయిస్తే నేర స్వభావం ఉన్న కేసులు కేవలం 1,00,620 మాత్రమే. అంటే.. 2019 కంటే 2020లో 18,609 కేసులు తగ్గాయి. తద్వారా రాష్ట్రంలో నేరాలు 15 శాతం తగ్గిపోయాయి. ఇక టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న 2018లో అయితే రాష్ట్రంలో 1,26,635 కేసులు నమోదయ్యాయి. వాటితో పోలిస్తే 2020లో నేర స్వభావం ఉన్న కేసులు 26,015 తగ్గడం వైఎస్సార్సీపీ ప్రభుత్వ సమర్థ పనితీరుకు నిదర్శనం. ఫిర్యాదులపై సత్వర స్పందన వివిధ ఫిర్యాదులపై రాష్ట్ర ప్రభుత్వం సత్వరం స్పందించి ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తోందని ఎన్సీఆర్బీ నివేదిక పేర్కొంది. 2020లో రాష్ట్రంలో ఎఫ్ఐఆర్ నమోదు వివరాలు ఇలా ఉన్నాయి.. అక్రమ దందాకు అడ్డుకట్ట ఇసుక, మద్యం, మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన పనితీరును కనబర్చిందని ఎన్ఎసీఆర్బీ నివేదిక వెల్లడించింది. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను ఏర్పాటు చేసి మరీ ఈ అక్రమ దందాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. అక్రమ దందాను అరికట్టేందుకు.. చట్టాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు నమోదు చేసే ఎస్ఎల్ఎల్ క్రైమ్ (నాన్ కాగ్నిజిబుల్) కేసులు పెరగడమే దీనికి తార్కాణం. 2019తో పోలిస్తే 2020లో ఇలాంటి కేసులు పెరిగాయి. 2019లో 26,522 కేసులు నమోదు కాగా.. 2020లో 49,108 కేసులు నమోదయ్యాయి. -
కష్టం ఎక్కడికీ పోదు
నైపుణ్యం ఉన్నచోట వివక్షకు చోటుండదు.. అందరికీ అన్ని స్థాయుల్లోనూ సవాళ్లు ఎదురవుతాయి.. భయం వీడితే పరిష్కారం అదే దొరుకుతుంది.. లక్ష్యాన్ని చేరుకోవాలంటే క్రమం తప్పకుండా ప్రయత్నించాలి అంటారు అంజిత చేప్యాల... తెలంగాణకు చెందిన ఏజీఎంయూటీ క్యాడర్ ఐపీఎస్. దేశరాజధానిలో రాష్ట్రపతి భవన్, ప్రధాని, హోంమంత్రుల నివాసాలతోపాటు ఇండియా గేట్ వంటి అత్యంత ప్రాముఖ్య ప్రదేశాలున్న లుటియన్స్ జోన్లో శాంతిభద్రతల పర్యవేక్షణాధికారిగా ఆమె విధులు నిర్వర్తిస్తున్నారు. విజ్ఞాన్‌భవన్‌లో ఇటీవల కేంద్ర ప్రభుత్వం, రైతుల సమావేశాల సమయంలో శాంతి భద్రతలు పర్యవేక్షించిన న్యూ ఢిల్లీ జిల్లా అదనపు డీసీపీ (శాంతి భద్రతలు) అంజిత.. సాధనతోనే ఈ స్థాయి సాధించానని చెబుతున్నారు. ఆమె ప్రస్థానం ఆమె మాటల్లోనే.... శిక్షణ అనంతరం ఢిల్లీలోసైబర్ క్రైం విభాగంలో తొలి బాధ్యతలు స్వీకరించా. శిక్షణ, విధుల సమయంలో సహచరుల్లో ఎలాంటి వివక్ష కనిపించ లేదు... నైపుణ్యం ఉన్నచోట వివక్షకు చోటుండదు.. నా విశ్వాసానికి బలం చేకూరింది. అప్పుడప్పుడే సైబర్ నేరగాళ్ల విశ్వరూపం బయటపడుతోంది.. వందలాది ఫిర్యాదులు వచ్చేవి.. ఇంజినీరింగ్ నేపథ్యం కావడంతో సులభంగానే అనేక సవాళ్లు చేధించా.. సొమ్ములు కట్టించుకొని సరకు అందించని ఆన్లైన్ షాపింగ్ టిమ్టారా.కామ్, కాల్‌సెంటర్ మాదిరి ఫోన్ చేసి బ్యాంకు ఖాతా వివరాలు తెలుసుకొని సొమ్ములు కాజేసిన జిమ్తారా సంస్థ మోసాలు అరికట్టడంలో నా భాగస్వామ్యం కూడా ఉంది. మెట్రోపాలిటిన్ సిటీ.. రద్దీ రహదారులు.. వీటితోపాటు నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి నూతన సాంకేతిక ఏర్పాటుకు నేను ట్రాఫిక్ ప్రధాన కార్యాలయంలో డీసీపీగా బాధ్యతలు చేపట్టినప్పుడే అనుమతి వచ్చింది. రూ.1000 కోట్ల ప్రాజెక్టు అది. ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్, సీసీటీవీ, క్యూ లెంగ్త్‌ను చూసి పనిచేసే ఆటోమేటిక్ సిగ్నలింగ్ ఇవన్నీ భవిష్యత్తులో ఢిల్లీ రహదారులపైకి రానున్నాయి. ఈ ప్రాజెక్టు తొలిదశలో నేను కూడా భాగస్వామిని. రహదారులపై ట్రాఫిక్ ఒక ఎత్తు అయితే.. తాజా కరోనా సంక్షోభం నేపథ్యంలో రాజధాని నుంచి వలస కార్మికులు తిరిగి వెళ్లడం.. లక్షలాది మంది ఆనందవిహార్, ఐఎస్బీటీ ప్రాంతాలకు చేరుకోవడం చూస్తే హృదయం ద్రవించి వేసింది. ఈస్ట్‌జోన్ ట్రాఫిక్ డీసీపీగా ఉన్న నేను వారందరికీ కౌన్సెలింగ్ ఇచ్చే ప్రయత్నం చేశా. ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలను వివరించడంతోపాటు ఆహారం, వైద్య సదుపాయం అందజేశాం. మాస్కులు పంపిణీ చేశాం. నవంబరు 11న డీసీపీ (శాంతిభద్రతలు)గా బాధ్యతలు స్వీకరించా.. 25 నుంచే రాజధాని సరిహద్దుల్లో రైతు ఉద్యమం ప్రారంభమైంది... చాలా రోజులు సవాల్‌గానే గడిచాయి. నేను నమ్మిన మాట నిజమైంది! శిక్షణ సమయంలో కార్యాలయంలో వివక్ష ఎదురవుతుందన్న భావన నాకెప్పుడూ అనిపించలేదు. మహిళలు సాహసాలు, అద్భుతాలు చేయాలంటే నేర్పు, ఓర్పు కన్నా ధైర్యం అవసరం అని నమ్మేదాన్ని. తొలిసారే సివిల్స్‌కు ఎంపిక కాలేదని నిరుత్సాహం చెందలేదు. కాలంతో పోరాడి అనుకున్నది సాధించా.. లక్ష్యం చేరుకోవాలంటే క్రమం తప్పకుండా ప్రయత్నించాలన్న మావయ్య నర్సింగ్‌రావు మాటలు గుర్తొచ్చాయి. వారిద్దరూ ప్రత్యేకం... చదువుకొనే రోజుల నుంచి నన్నెంతగానో ప్రోత్సహించింది మా అన్న సంపత్ రావు. ఈ దిశగా వెళ్లు.. ఇలా చేయడం వల్ల నలుగురికీ ప్రయోజనం కల్పించొచ్చు అంటూ సహోదరిని సేవాదారిగా మార్చడంలో అన్ని వేళలా ప్రోత్సహించారు. ఇక నా భర్త నవీన్‌కుమార్.. సివిల్స్‌లో మంచి ర్యాంకు వచ్చి ఎంపిక కాలేకపోయిన నన్నెంతగానో ఓదార్చారు. కోర్టు తీర్పుతో తిరిగి ఎంపిక అయిన తర్వాత అమెరికాలో గృహిణిగా స్థిరపడిన నన్ను విధుల వైపు మళ్లేలా చేశారు. వారిద్దరూ నాకు ఎంతో ప్రత్యేకం. పెద్దపల్లి జిల్లా మేడిపల్లి మా స్వగ్రామం.. రామగుండం, తెనాలి, హైదరాబాద్‌లో ఇంజినీరింగ్ వరకూ చదివాక తల్లిదండ్రులు మంగ, సత్యనారాయణరావుల ప్రోత్సాహంతో సివిల్ సర్వీసెస్ లక్ష్యంగా ముందుకు సాగా.. మూడు ప్రయత్నాలు మిస్సయినా, నాలుగో యత్నంలో 2008 లో మంచి ర్యాంకు వచ్చింది. అయితే, ఆ సమయంలో జనరల్, రిజర్వేషన్ కేటగిరీల గందరగోళంతో నన్ను ఎంపిక చేయలేదు. తర్వాత ఏడాదే బాసరకు చెందిన నవీన్‌కుమార్‌తో వివాహం అయింది. మాకు ఇద్దరు పిల్లలు శాన్వి, మాహిర. పెళ్లి తర్వాత భర్త ఉద్యోగరీత్యా అమెరికా వెళ్లాల్సి వచ్చింది. 2010లో కోర్టు తీర్పుతో జనరల్ కేటగిరీ అభ్యర్థుల్ని తిరిగి ఎంపిక చేయడంతో ఐపీఎస్‌కు ఎంపికయ్యా. –సూర్యప్రకాశ్ కూచిభట్ల, సాక్షి, న్యూఢిల్లీ ఫొటో: ప్రమోద్ మాధుర్ -
శాంతిభద్రతలు భేష్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ శాంతిభద్రతల పరిరక్షణలోనే కాదు, అద్భుతమైన పనితీరులోనూ సత్తా చాటుతోందని కేంద్ర ప్రభుత్వం ప్రశంసించింది. రాష్ట్ర పోలీసులు సాధిస్తున్న అవార్డులే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయని పేర్కొంది. ఇంటర్ ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ (ఐసీజేఎస్)కు మిగతా మూల స్తంభాలైన కోర్టులు, జైళ్లు, ఫోరెన్సిక్, తదితర విభాగాలతో కలసి బాధితులకు సత్వర న్యాయం అందేలా ఏపీ పోలీసులు కృషి చేస్తున్నారని, ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలుస్తున్నారని కేంద్ర హోం శాఖ అభినందించింది. ఐసీజేఎస్ అమలుకు సంబంధించి కేంద్ర హోంశాఖ మంగళవారం అవార్డులను ప్రకటించింది. ఈ విధానం అమలు, వినియోగంలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన ఏపీ పోలీసు శాఖ జాతీయ స్థాయిలో రెండవ స్థానాన్ని సాధించింది. ఈ అవార్డును కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి ద్వారా రాష్ట్ర డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ వర్చువల్ విధానంలో అందుకున్నారు. మొదటి స్థానంలో మహారాష్ట్ర, మూడవ స్థానంలో తెలంగాణ నిలిచాయి. ఈ అవార్డులకు దేశంలోని 25 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు పోటీ పడ్డాయని కిషన్‌రెడ్డి తెలిపారు. ఐసీజేఎస్ అంటే.. క్రిమినల్ జస్టిస్ సిస్టమ్‌లోని అన్ని విభాగాలను ఏకతాటిపైకి తీసుకువచ్చి, సమాచార మార్పిడి, విశ్లేషణలతో ఆన్లైన్ ద్వారా సమన్వయ పరిచే విధానమే ఇంటర్ ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ (ఐసీజేఎస్). బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు ఈ విధానం ఎంతగానో ఉపయోగపడుతుంది. అన్ని విభాగాలూ ఆన్లైన్లో సమాచారం ఇచ్చిపుచ్చుకుంటూ, వివరాలు ఎప్పటికప్పుడు అందజేస్తుండటంతో కేసుల పరిష్కారానికి పట్టే సమయం గణనీయంగా తగ్గిపోతుంది. ఈ విధానాన్ని ఏపీ పోలీసులు సమర్ధంగా అమలు చేస్తున్నారు. విచారణను వేగవంతంగా పూర్తి చేయడం, అతి తక్కువ సమయంలో చార్జిషీట్లు దాఖలు చేయడం తదితర అంశాల్లో అత్యుత్తమ పనితీరు కనబరచడం, సాధించిన పురోగతితో ఏపీ పోలీసు శాఖ జాతీయ స్థాయిలో రెండవ స్థానాన్ని సాధించింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ శాంతిభద్రతల పరిరక్షణకు చేస్తున్న కృషికి గాను ఏపీ పోలీసులు జాతీయ స్థాయిలో ‘స్కోచ్’ అవార్డులు సాధించడం గమనార్హం. సీఎం ప్రోత్సాహంతోనే సాధ్యమవుతోంది: డీజీపీ జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన అవార్డును దక్కించుకున్న రాష్ట్ర పోలీస్ శాఖను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, హోం మంత్రి మేకతోటి సుచరిత అభినందించినట్టు డీజీపీ గౌతమ్ సవాంగ్ ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్న పోలీసు శాఖకు అవార్డులు వస్తున్నాయని, సీఎం చొరవ, ప్రోత్సాహం వల్లే ఇది సాధ్యమవుతోందని చెప్పారు. రాష్ట్రంలోని మహిళలు, పిల్లలు, అన్ని వర్గాలకు చెందిన బాధితులందరికీ పారదర్శకత, జవాబుదారీతనంతో సత్వర న్యాయం అందుతోందనడానికి ఈ అవార్డులు నిదర్శనమని డీజీపీ పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో ఇప్పటివరకు వచ్చిన 108 అవార్డులు రాష్ట్ర పోలీస్ శాఖ పనితీరును స్పష్టం చేస్తున్నాయన్నారు. -
శాంతిభద్రతలు భేష్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో శాంతిభద్రతలు భేషుగ్గా ఉన్నాయని డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. చిన్నపాటి అవాంఛనీయ ఘటన కూడా చోటుచేసుకోకుండా ముఖ్యమైన కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు. ఆయన శనివారం మంగళగిరిలోని తన కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ నిర్వహించారు. తిరుమల బ్రహ్మోత్సవాలు, విజయవాడ కనకదుర్గ అమ్మవారి దసరా వేడుకలు ప్రశాంతంగా, అత్యంత వైభవోపేతంగా జరిగాయని అన్నారు. లక్షలాది మంది భక్తులు తరలివచ్చిన అంత పెద్ద వేడుకల్లో చిన్నపాటి ఘటన కూడా జరగకుండా పోలీసులు పటిష్ట భద్రత కల్పించారని చెప్పారు. శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. అందుకోసం ఎటువంటి సవాళ్లనైనా ఎదుర్కొంటామన్నారు. సైబర్ సెక్యూరిటీపై పోలీసులకు శిక్షణ రాష్ట్రంలోని మొత్తం పోలీస్ బృందం బాగా పని చేస్తోందని డీజీపీ కితాబిచ్చారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయన్నారు. సైబర్ క్రైమ్, సోషల్ మీడియాలో అసభ్య పోస్టింగ్‌లపై దృష్టి పెట్టామని చెప్పారు. దాదాపు రూ.42 కోట్లతో గతంలో కొనుగోలు చేసిన అధునాతన సాంకేతిక పరికరాలు సరైన నిపుణులు లేని కారణంగా నిరుపయోగంగా ఉన్నాయన్నారు. వాటిని సద్వినియోగం చేసుకుని, ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా సైబర్ క్రైమ్ విషయంలో పోలీసులకు శిక్షణ ఇస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటివరకు రెండు బ్యాచ్‌లకు సైబర్ సెక్యూరిటీపై శిక్షణ ఇచ్చామన్నారు. సోషల్ మీడియాలో అసభ్య పోస్టింగ్‌లపై ఇటీవల ఫిర్యాదులు పెరిగాయని, వాటికి కారకులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకునేలా ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేసినట్టు గౌతమ్ సవాంగ్ తెలిపారు. సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలతో పోస్టింగ్‌లు పెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. డీఎస్పీల పాసింగ్ఔట్ పెరేడ్‌కు సీఎం రాక శిక్షణ పూర్తి చేసుకున్న 25 మంది డీఎస్పీల పాసింగ్ఔట్ పెరేడ్ నిర్వహిస్తున్నట్టు డీజీపీ వెల్లడించారు. ఈ నెల 16వ తేదీన ఉదయం 8 గంటలకు మంగళగిరి ఏపీఎస్పీ బెటాలియన్ పెరేడ్ గ్రౌండ్లో జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరవుతారని తెలిపారు. రాష్ట్ర విభజన అనంతరం ఇంత పెద్ద సంఖ్యలో డీఎస్పీల పాసింగ్ఔట్ పెరేడ్ నిర్వహిస్తుండడం విశేషమని చెప్పారు. 25 మంది కొత్త డీఎస్పీల్లో 11 మంది మహిళలు ఉండటం మరో విశేషమని అన్నారు. -
క్రిమినల్స్‌తో పోలీసుల స్నేహం: నటి
చెన్నై, టీ.నగర్: తమినాడు రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించినట్లు నటి మీరా మిథున్ అన్నారు. తానా సేంద కూట్టం వంటి చిత్రాల్లో నటించారు మీరామిథున్. మోడల్ అయిన ఈమె బ్యూటీ కాంటెస్ట్‌లో గెలుపొంది అవార్డును అందుకున్నారు. తర్వాత అనేక వివాదాల కారణంగా అవార్డు ఉపసంహరించుకోబడింది. మొదట్లో అందాల పోటీలు జరపనున్నట్లు తెలిపి పలువురు మహిళల వద్ద నగదు మోసం చేసినట్లు ఫిర్యాదుల్లో చిక్కుకున్నారు. దీంతో ఆమెకు అందజేసిన మిస్ సౌత్ ఇండియా బ్యూటీ అవార్డు వెనక్కి తీసుకున్నారు. బిగ్‌బాస్ కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. దీని ద్వారా చేరన్‌పై పరువునష్టం ఫిర్యాదు చేయడంతో బిగ్‌బాస్ హౌస్ నుంచి ఆమెను తొలగించారు. ఆమెపై హత్యా బెదిరింపుల కేసు కూడా నమోదైంది. మీరామిథున్ ప్రస్తుతం పోలీసు శాఖపై ట్విటర్లో విమర్శలు చేశారు. అన్నా ద్రావిడ మున్నేట్ర కళగం ఉక్కు మహిళ మృతి తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని అన్నారు. చదువుకున్నవారు రాష్ట్రాన్ని పాలించాలని, రాజకీయనేతగా ఉండేందుకు ఇదే పెద్ద అర్హతన్నారు. రాష్ట్రంలో క్షీణిస్తున్న శాంతి భద్రతలపై సీఎం దృష్టి సారించాలని కోరారు. రాష్ట్రంలో మహిళలపై అకృత్యాలు, అవినీతి పెచ్చుమీరాయన్నారు. తమిళనాడు పోలీసులు క్రిమినల్స్‌తో స్నేహం చేస్తున్నారని, తన ఫిర్యాదులపై కమిషనర్ సహా ఏ పోలీసు అధికారి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. పోలీసుల వైఖరితో మనోవేదనకు గురైనట్లు తెలిపారు. -
శాంతిభద్రతలతోనే ఆర్థిక వృద్ధి
సాక్షి, హైదరాబాద్: శాంతిభద్రతలు అదుపులో ఉంటేనే దేశ ఆర్థికాభివృద్ధి బలోపేతం అవుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీలో 2017 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ ప్రొబెషనర్లు శిక్షణ పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం నిర్వహించిన పాసింగ్ అవుట్ పరేడ్‌కు షా ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ‘‘దేశ తొలి హోంమంత్రి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ పేరిట ఉన్న జాతీయ పోలీసు అకాడమీలోకి రావడం చాలా ఆనందంగా ఉంది. ప్రస్తుతం శిక్షణ పూర్తి చేసుకున్న 103 మంది ఐపీఎస్‌లకు శుభాకాంక్షలు. ప్రొబేషనర్లలో ఆరుగురు భూటాన్, ఐదుగురు నేపాల్ జాతీయులతోపాటు 15 మంది మహిళా అధికారులు ఉండటం సంతోషకరం. ఈ సందర్భంగా మనం సర్దార్ పటేల్‌ని స్మరించుకోవాలి. ప్రస్తుతం మనమున్న హైదరాబాద్‌ను దేశంలో విలీనం చేయడంలో పటేల్ పాత్ర మరువలేనిది. ఆయన పట్టుదల కారణంగానే నిజాం రాజు హైదరాబాద్ సంస్థానాన్ని ఇండియన్ యూనియన్‌లో విలీనం చేశారు. దేశంలో 530 చిన్న సంస్థానాల విలీనంలో ఉక్కుమనిషి పటేల్ చూపిన చొరవ కారణంగానే ఈరోజు దేశానికి సమగ్రత చేకూరింది. కాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కలిగించే ఆర్టికల్ 370ని ఇటీవల ఎత్తేయడం ద్వారా కశ్మీర్‌ను దేశంలో విలీనం చేసి ప్రధాని మోదీ.. సర్దార్ పటేల్ స్వప్నాన్ని నెరవేర్చారు. ఈ దేశానికి అత్యంత కీలకమైనవి రెండు. శాసనాల ద్వారా ఎన్నుకున్న ప్రజాపరిపాలనా వ్యవస్థ, సివిల్స్ ద్వారా ఎంపికైన అధికారుల వ్యవస్థ. దేశాన్ని ముందుకు నడిపించడంలో ఈ రెండు వ్యవస్థల కృషి ఎనలేనిది. సివిల్స్ విధానాన్ని దేశంలో ప్రవేశపెట్టిన పటేల్ స్ఫూర్తిని మనం మరచిపోకూడదు. ప్రపంచ పటంలో దేశం సమున్నత స్థానంలో ఉండాలంటే అందుకు మీ భాగస్వామ్యం ఎంతో అవసరం. మీరంతా దేశ సేవలో పునరంకితం అయినప్పుడే ఈ కల నెరవేరుతుంది. ఈ రోజు మీరు చేసిన ప్రతిజ్ఞను జీవితాంతం స్మరించండి. శనివారం సర్దార్ వల్లభాయ్‌పటేల్ పోలీస్ అకాడమీలో జరిగిన పాసింగ్ ఔట్ పరేడ్‌లో ఐపీఎస్ ప్రొబెషనర్లు ‘స్మార్ట్’గా ముందుకెళ్లండి... ఏ దేశానికైనా శాంతిభద్రతలు అదుపులో ఉంటేనే మెరుగైన ఆర్థిక ప్రగతి సాధ్యమవుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. మన దేశానికి పట్టిన ఉగ్రవాదం, తీవ్రవాదాల చీడ తొలగించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన వేలాది మంది పోలీసు అధికారులు, జవాన్లను స్మరించుకోవాలని, వారి త్యాగాల వల్లే మనం ఈ రోజు ఇక్కడ ఉన్నామని, వారి లక్ష్యం నెరవేర్చినప్పుడే వారి ఆత్మబలిదానాలకు సార్థకత చేకూరుతుందన్నారు. ‘‘ఐపీఎస్ శిక్షణతో మీ కల పూర్తవలేదు. వాస్తవానికి ఇప్పటి నుంచి మీ అసలు లక్ష్యం మొదలవనుంది. సురక్షిత, అభివృద్ధి చెందిన దేశ లక్ష్యం. సర్వీసులో ఉత్తమ ఫలితాలు రావాలంటే ప్రజలతో మమేకం కండి. కోట్లాది మంది పేదలకు చేయూత అందించాల్సిన బాధ్యత మీ భుజాలపై ఉంది. స్మార్ట్ పోలీసింగ్ ప్రధాని మోదీ ఆశయం. ఆయన ప్రకారం స్మార్ట్ పోలీసింగ్ అంటే ఎస్ అంటే సెన్సిటివ్, ఎమ్ అంటే మోరల్ వ్యూ, ఏ అంటే అలర్ట్, ఆర్ అంటే రెస్పాన్సిబుల్, టీ అంటే టెక్ శావీ (టెక్నాలజీ వాడకంలో నిష్టాతుడు). ఈ నినాదంతో మీరు కెరీర్లో ముందుకెళ్లండి. ప్రజాసేవలో మాకు కేవలం ఐదేళ్లే అధికారం ఇచ్చారు. మరో ఐదేళ్లు కావాలంటే ప్రజలు ఆలోచిస్తారు. కానీ మీకు అలాకాదు. మీ చేతిలో 30 ఏళ్లు అవకాశం ఉంది. కాబట్టి విధినిర్వహణలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎన్ని ఒత్తిళ్లు ఎదుర్కొన్నా ఎక్కడా రాజీపడకూడదు’’అని అమిత్ షా పిలుపునిచ్చారు. ప్రతిభావంతులకు పురస్కారాలు ఎన్పీఏ డైరెక్టర్ అభయ్ కేడేట్లకు అకాడమీలో ఇచ్చిన శిక్షణ విశేషాలను అంతకుముందు వివరించారు. అనంతరం శిక్షణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన కేడెట్లకు అమిత్ షా పురస్కారాలు అందజేశారు. ట్రైనింగ్ మొత్తంలో అత్యధిక అవార్డులతో ఆల్‌రౌండ్ ప్రతిభ కనబరిచిన ఢిల్లీకి చెందిన గోష్ ఆలమ్ తెలంగాణ కేడర్‌కు సెలెక్ట్ అయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ బ్యాచ్‌లో మొత్తం ఆరుగురు అధికారులు శిక్షణ పూర్తి చేసుకున్నారు. అనంతరం ఎన్పీఏ ప్రాంగణంలోని న్యూ ఆఫీసర్స్ మెస్‌ను అమిత్ షా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, ఎన్పీఏ మాజీ డైరెక్టర్లు అరుణా బహుగుణ, బర్మన్ తదితరులు పాల్గొన్నారు. -
రెండింతల ఆనందం
తిరుపతి క్రైం: తిరుపతికి మరో అరుదైన గౌరవం లభించింది. నివాసయోగ్యమైన నగరాలకు సంబంధించి కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థ ఇటీవల ప్రకటించిన ర్యాంకుల్లో తిరుపతి 4వ స్థానం పొందిన విషయం తెల్సిందే. తాజాగా శాంతిభద్రతల పర్యవేక్షణకు పోలీసులు తీసుకుంటున్న చర్యలకు సంబంధించి కేంద్రప్రభుత్వం ప్రకటించిన ర్యాంకుల్లో తిరుపతి అర్బన్ జిల్లాకు దేశంలోనే రెండో స్థానం లభించింది. అత్యంత సురక్షితమైన నగరమంటూ ప్రశంసలు దక్కాయి. నివాసయోగ్యమైన నగరాలకు సంబంధించి మొదటి స్థానంలో నిలిచిన పూణె.. ఈ ర్యాంకుకు వచ్చే సరికి 25వ స్థానంలో నిలవడం గమనార్హం. ఉత్తమ ర్యాంకు లభించడంతో అర్బన్ జిల్లా పోలీసు అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎస్పీగా అభిషేక్ మొహంతి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తీసుకున్న వివిధ రకాలైన భద్రతా చర్యలే ఉత్తమ ర్యాంకు సాధనకు దోహదపడ్డాయని పోలీసులు చెబుతున్నారు. ప్రజల సంక్షేమానికి పెద్దపీట.. అర్బన్ జిల్లా పరిధిలో అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపడమేకాకుండా ప్రజలకు పోలీసులను చేరువచేసేందుకు ఎస్పీ మొహంతి ఎంతగానో కృషి చేశారు. అందులో భాగంగా ఏర్పాటు చేసినవే షీటీం, మహిళా రక్షక్ బృందాలు. వీరు ర్యాగింగ్, ఈవ్‌టీజింగ్‌కు పాల్పడే వారిని గుర్తించి కౌన్సెలింగ్ ఇస్తారు. తద్వారా ఈవ్‌టీజింగ్ కేసులు గణనీయంగా తగ్గాయి. ఇటీవల మహిళల కోసం ప్రత్యేకంగా షీ బోట్ అనే అప్లికేషన్‌నూ రూపొందించారు. ⇔ నగరంలో ఆకస్మిక తనిఖీలు, నాకాబంధీ, రౌడీషీటర్లపై ప్రత్యేక దృష్టి సారించడం, వారు నివసించే ప్రాంతాల్లో కార్డన్ సర్చ్‌లు నిర్వహించి అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం వంటివి నిరంతరం చేపడుతూనే ఉన్నారు. ప్రతి సోమవారం రౌడీషీటర్లకు పోలీస్స్టేషన్లలో కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ⇔ సిబ్బంది ప్రతిరోజూ నగరంలో బేసిక్ పోలీసింగ్ నిర్వహించి సమాచారాన్ని పోలీసు ఉన్నతాధికారులకు చేరవేస్తారు. నగరంలో ప్రతిరోజూ విజువల్ పోలీసింగ్ నిర్వహిస్తూ తిరుపతికి వచ్చే భక్తులకు భద్రతతో పాటు ప్రజారక్షణకు తోడుగా నిలుస్తున్నారు. బ్లూకోల్డ్ రక్షక్ సిబ్బంది దాదాపు 150 మంది విజువల్ పోలీసింగ్ నిర్వహిస్తున్నారు. నగరంలో ఏం జరిగినా సంఘటనా స్థలానికి నిముషాల్లో చేరుకుంటున్నారు. ⇔ నగరంలో 350 కెమెరాలతో నిఘా నిర్వహిస్తూ ఈస్ట్ పోలీస్ స్టేషన్ మిద్దెపై ఉన్న కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షిస్తున్నారు. ⇔ డయిల్ 100 ద్వారా ఫోన్ చేసిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు తక్షణ సాయం అందిస్తున్నారు. ⇔ నగరంలో నేర నియంత్రణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఇవి రాత్రి 10 నుంచి వేకువజాము 4 గంటల వరకు తిరుగుతూ దొంగతనాలు, దోపిడీలు, నేరాలు జరగకుండా చర్యలు చేపడుతున్నాయి. ⇔ షాపింగ్‌మాల్, దుకాణాల్లో ప్రజారక్షణ చట్టం ద్వారా భద్రతకు ప్రాధాన్యమిచ్చారు. ప్రతి వ్యాపార సంస్థలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. తద్వారా నగరంలో దాదాపు 8 వేల సీసీ కెమెరాలు షాపులు, షాపింగ్‌మాల్స్‌లలో ఏర్పాటయ్యాయి. ⇔ నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను నేరుగా పోలీసులకు తెలిపే విధంగా పోలీస్ కేసు, వాట్సాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. వచ్చిన సమస్యను పరిశీలించి తక్షణమే సహాయ సహకారాలు అందిస్తున్నారు. ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి ఆధ్యాత్మిక నగరంలో నిరంతరం భక్తుల రద్దీ ఉంటుంది. దీంతో ట్రాఫిక్ సమస్యా ఎక్కువే. ఈ సమస్య నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించారు. గూగుల్ మ్యాప్ ద్వారా ట్రాఫిక్ ప్రమాదాలు, రద్దీగుర్తించి సంబంధిత అధికారులను అప్రమత్తం చేసి తద్వారా ట్రాఫిక్ సమస్యను చాలా వరకూ నియంత్రించారు.తగ్గిన నేరాల శాతం (గత సంవత్సరంలో) శారీరకమైన నేరాలు – 21.4%, పెద్ద దొంగతనాలు – 87 %, ఆర్థిక నేరాలు – 35%, గ్రేవ్ కేసులు 60%, రోడ్డు ప్రమాదాల మరణాలు – 17% తగ్గాయి. -
కిక్కురు చాలెంజ్!
అనగనగా ఒక దిబ్బరాజ్యం. ఆ రాజ్యానికి ప్రభువు డబ్బరాజు. ఆ రాజ్యంలో రోడ్లు లేవు. బార్లు ఉన్నాయి. ఆ రాజ్యంలో బస్సులు లేవు. బార్లు ఉన్నాయి. ఆ రాజ్యంలో ఉద్యోగాలు లేవు. బార్లు ఉన్నాయి.ఆ రాజ్యంలో సంతోషాలు లేవు బార్లు ఉన్నాయి. సౌకర్యాలు లేవు....బార్లు ఉన్నాయి!‘యథారాజా తథాప్రజా’ అంటారు మాటవరుసకి.కానీ ఇక్కడ అది అక్షరాల నిజం. దిబ్బరాజ్యం రాజు డబ్బరాజు గజతాగుబోతు. ఆయన బాటలోనే ప్రజలు మత్తుగా నడుస్తున్నారు. తూలుతూ నడుస్తున్నారు. అకారణంగా ఎవరినో తిడుతూ నడుస్తున్నారు.రోజు రోజుకూ తాగుబోతుల సంఖ్య అంతకంతకు పెరుగుతూ పోవడంతో రాజ్యంలో వాంతిభద్రతల సమస్యతో పాటు శాంతిభద్రతల సమస్య కూడా తలెత్తింది.అలాంటిలోజుల్లో ఒకరోజు మహామంత్రి మల్లయ్య రాజుగారి దగ్గరికి పరుగెత్తుకు వచ్చి సీరియస్‌గా ఇలా అన్నాడు...‘‘అయ్యా! మీకు మందుచూపు తప్పా... ముందుచూపు బొత్తిగా లోపించింది. ఇలా అయితే మన దిబ్బరాజ్యంలో రాజ్యం మిగలదు. దిబ్బ మాత్రమే మిగులుతుంది. సోషల్‌మీడియా రాజ్యం ఏలుతున్న ఈ కాలంలో మనకేమవుతుందిలే అనుకుంటే మన్ను మాత్రమే మిగులుతుంది. ఆ తరువాత తమ ఇష్టం’’‘‘ఇప్పుడేం చేయమంటారు?’’ ఆరో పెగ్గు అవలీలగా గుటుక్కుమనిపించి అడిగాడు రాజు.‘‘మీరు మందు మానేయండి... ప్రజలు కూడా మానేస్తారు’’ టీవీ యాంకర్లా వంకర్లు తిరుగుతూ సలహా ఇచ్చాడు మంత్రి.‘‘ఓస్... అంతేనా. ఇదే నా ఆన. ఈ ఫుల్‌బాటిల్ కంప్లీట్ చేసి.... ఇక ఈ జన్మలో మందు ముట్టను’’ అని భీషణ ప్రతిజ్ఞ చేయడమే కాకుండా...‘‘ఈరోజు నుంచే రాజ్యంలో మందును నిషేధిస్తున్నాను’’ అని గట్టిగా అరిచాడు.‘‘నిషేధం విధించడం కంటే ప్రజలే స్వచ్ఛందంగా మందు మానేసేలా చేస్తే మంచిది మహారాజా’’ అన్నాడు మంత్రి.‘‘అలాగే’’ అంటూ చివరి పెగ్గు పూర్తి చేశాడు రాజు. ‘మందు మానేసిన వారికి లక్షరూపాయల క్యాష్ అవార్డ్’ ప్రకటించింది ప్రభుత్వం.కనీసం ముగ్గురు కూడా మానలేదు.‘మందు మానేసిన వారికి అయిదు ఎకరాల పొలం’ ప్రకటించింది ప్రభుత్వం.కనీసం ఇద్దరు కూడా మానలేదు.చివరిగా...‘మందుమానేసిన వారికి పది ఎకరాల పొలం, ప్రభుత్వ ఉద్యోగం, ఇంటిస్థలం, అంబాసిడర్ కారు, ఫ్రిజ్జు, ఒనిడా కలర్‌టీవీ....’ ఒకటా రెండా...ఇలా ఎన్నో ప్రకటించింది ప్రభుత్వం.అయినా సరే....కనీసం ఒక్కరు కూడా మానలేదు!రాజుగారు జుట్టు పీక్కుందామని ట్రై చేశారుగానీ... తనది బట్టతల అని గుర్తుకొచ్చి నిరాశగా సైలెంటైపోయారు. రాజుగారికి ఏంచేయాలో పాలు పోవడం లేదు.సరే. పాలు తాగి ఆలోచిద్దాం అనుకున్నాడు.వేడి వేడి పాలుతాగుతున్న రాజుగారి దగ్గరికి కూల్‌గా నడిచి వచ్చాడు మంత్రి.‘‘మంత్రివర్యా! ఒక్కడు కూడా రాజ్యంలో మందుమానలేదయ్య...ఏంచేయాలో పాలు పోక ఇలా పాలు తాగున్నాను. నువ్వు కూడా తాగుతావా? పంచదార వేయమంటావా వద్దా?’’ అడుగుతున్నాడు రాజు.‘‘పాలు–పంచదార–తొక్క–తోటకూర...ఇది కాదు మహారాజా ఈ టైమ్‌లో మనం ఆలోచించాల్సింది. మన రాజ్యంలో ఇకముందు ఒక్కడు కూడా మందు తాగవద్దు. మందు అనే మాట వినబడగానే ముందు వెనక చూడకుండా పరుగెత్తాలి...దీనికి బ్రహ్మాండమైన ఐడియా ఆలోచించాను’’ ఉత్సాహంగా చెప్పాడు మంత్రి.‘ఏమిటా ఐడియా?’’ మరింత ఉత్సాహంగా అడిగాడు రాజు.రాజుగారి చెవిలో ఏదో చెప్పాడు మంత్రి.రాజుగారి ముఖం మున్సిపాలిటీ వారి స్ట్రీటులైటులా వెలిగిపోయింది!రెండు నెలలు తిరక్కుండానే మంత్రిగారు అన్నంత పనీ అయింది. రాజ్యంలో అందరూ మద్యం మానేశారు! ‘‘రాజా! ఇప్పుడు చెప్పు...ఏ ఐడియా ద్వారా మంత్రిగారు మందుబాబులు మందు అంటేనే జడుసుకునేలా చేశారు?’’ విక్రమార్కుడిని అడిగాడు భేతాళుడు.అప్పుడు విక్రమార్కుడు ఏమన్నాడంటే...‘‘భేతాళా! టైమ్లీ ఐడియా అని కొన్ని ఐడియాలు ఉంటాయి. ప్రతి కాలంలోనూ ఒక వేవ్లాంటిది, ట్రెండ్లాంటిది, పిచ్చిలాంటిది ఒకటి వస్తుంది. ఆ సమయంలోనే ఆ పిచ్చిలాంటి ట్రెండ్‌లోకి జంపైపోయి ఒక ఐడియా ప్లాన్ చేస్తే తిరిగే ఉండదు’’‘‘విక్రమార్కా! నువ్వు ఏంచెబుతున్నావో ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు’’ అయోమయంగా అన్నాడు భేతాళుడు.‘‘ఇప్పుడు అందరినీ కిక్ ఎక్కిస్తున్నది ఏమిటి?’’ అడిగాడు విక్రమార్కుడు.‘‘కికి’’ అన్నాడు భేతాళుడు. అప్పుడు విక్రమార్కుడు ఇలా చెప్పాడు...‘‘ఒక కికి చాలెంజ్ అనే ఏమిటి! ప్లాంకింగ్ చాలెంజ్, చోకింగ్ చాలెంజ్, ఫైర్ చాలేంజ్, కట్టింగ్ చాలెంజ్...ఒక్కటా రెండా! ఇలా ఎన్నో చాలేంజ్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో దిబ్బరాజ్యం ‘కిక్కురు’ అనే చాలెంజిని విసిరింది. మందులో కాస్త నీళ్లు పోసుకొని ఎవరైనా తాగుతారు. కానీ అయిదు లీటర్ల నీళ్లలో అర క్వార్టరు మందుతో పాటు, చింతపండు పులుసు, కాస్త ఆముదం కలుపుకొని తాగాలి. ఇదే ‘కిక్కురు చాలెంజి’. ఊహించినట్లుగానే మందుబాబుల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. కిక్కురు చాలెంజిని స్వీకరించని వారిని లెక్కలోకి తీసుకోని పరిస్థితి వచ్చింది. వేలంవెర్రి మొదలైంది. ఎంతో వాటర్+ కొంతమందు+ చింతపండు పులుసు+ కొంత ఆముదం= విరేచనాలు. ఈ ఫార్ములా ప్రకారం రాజ్యంలో ఎటుచూసినా విరేచనాలే. ఈ దెబ్బతో మందుబాబులకు మందు మీద విరక్తి పుట్టడమే కాదు ఒకలాంటి భయం ఏర్పడింది. అలా కేవలం మూడు నెలలలో కాలంలోనే మందుబాబులంతా కిక్కురుమనకుండా మందు మానేశారు. కిక్కురు చాలెంజా మజాకా!’’ – యాకుబ్ పాషా -
బెంగాల్లో మరో హత్య!
పురూలియా / న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్లో మరో వ్యక్తి అనుమానాస్పద రీతిలో మృతిచెందారు. పురూలియా జిల్లా బలరామ్‌పూర్‌కు చెందిన దులాల్ కుమార్(35) మృతదేహం శనివారం దేవా గ్రామ సమీపంలోని ఓ విద్యుత్ హైటెన్షన్ టవర్‌కు వేలాడుతూ కన్పించింది. దీంతో దోషుల్ని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ స్థానికులు బలరామ్‌పూర్ పోలీస్‌స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. కాగా, తమ పార్టీ కార్యకర్త అయినందునే దులాల్ కుమార్‌ను హత్యచేశారని బీజేపీ నేతలు విమర్శించారు. నాలుగు రోజుల్లో ఇద్దరు కార్యకర్తలు మృతి చెందడంపై విచారం వ్యక్తంచేసిన బీజేపీ చీఫ్ అమిత్ షా.. బెంగాల్లో శాంతిభద్రతల పరిరక్షణలో మమత ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. మరోవైపు ఈ రెండు హత్యలపై సీఐడీ విచారణకు ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం.. పురూలియా సూపరింటెండెంట్(ఎస్పీ) జోయ్ బిశ్వాస్‌పై బదిలీ వేటువేసింది. -
వదంతులను నమ్మొద్దు
వనపర్తి క్రైం: శాంతిభద్రతలు, పౌరసమాజ రక్షణ కోసం కార్డెన్ సర్చ్ నిర్వహిస్తున్నామని జిల్లా అదనపు ఎస్పీ భాస్కర్ అన్నారు. శనివారం తెల్లవారుజామున పట్టణంలోని 26వ వార్డు రాంనగర్‌కాలనీలో జిల్లా పోలీసులు 78 మంది సిబ్బందిచే సోదా చేశారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ కాలనీలో సోదాలు జరపాలని ప్రజల నుంచి వచ్చిన వినతుల మేరకు రాంనగర్ కాలనీలో తనిఖీ చేపట్టామన్నారు. సెర్చ్‌లో పత్రాలు 32 బైకులు, 2 ఆటోలు, 11 మంది రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన అనుమానిత వ్యక్తులను అదపులోకి తీసుకున్నామన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నమ్మవద్దని, అనుమానిత వ్యక్తులు సంచరిస్తే వారిపై దాడిచేయకుండా పోలీసులకు సమాచారం అందించాలన్నారు. నేరాలు అరికట్టేందుకు పోలీసులకు ప్రజలు సహకరించాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ సృజన, సీఐ సూర్యనాయక్, సీసీఎస్ సీఐ నరేందర్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ వెంకటేష్, పట్టణ ఎస్ఐ నాగశేఖరరెడ్డి, జిల్లాలోని ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
కానిస్టేబుళ్లకు వీక్లీ ఆఫ్ ఏదీ?
సాక్షి, హైదరాబాద్: పోలీసు శాఖ ఓవైపు అధునాతన టెక్నాలజీని వినియోగిస్తూ దూసుకెళ్తుంటే.. మరోవైపు కింది స్థాయి సిబ్బంది మాత్రం ఇంకా నైరాశ్యంలోనే కొట్టుమిట్టాడుతున్నారు. వారంలో ఒక్కరోజైనా వీక్లీ ఆఫ్‌గా తీసుకునే అవకాశం లేక సతమతమవుతున్నారు. మద్యానికి బానిసై కుటుంబాలకు దూరం కావొద్దంటూ కిందిస్థాయి పోలీసు సిబ్బందికి సందేశాలు పంపిస్తున్న ఉన్నతాధికారులు.. వారికి వీక్లీ ఆఫ్ మంజూరు అంశంలో మాత్రం విఫలమవుతున్నారు. వీక్లీ ఆఫ్ హామీ పదేళ్లుగా ఏ మాత్రం ముందుకు కదలకపోవడం గమనార్హం. ఇదేమిటంటే సిబ్బంది కొరత, శాంతి భద్రతల విధుల కారణంగా వీక్లీ ఆఫ్ ఇవ్వలేని పరిస్థితి ఉందనే సమాధానం వస్తోంది. అయితే గత మూడు నాలుగేళ్లలో పోలీసు శాఖలో వేల సంఖ్యలో పోస్టులను భర్తీ చేసినా కూడా.. వీక్లీ ఆఫ్ ఎందుకు అమలు కావడం లేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సిబ్బంది కొరత పేరిట..: పోలీసుశాఖలో దాదాపు 46 వేల మందికిపైగా కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు పనిచేస్తున్నారు. అందులో మెజారిటీ శాతం సివిల్ విభాగంలో పనిచేసేవారే. వీరికి వీక్లీ ఆఫ్ ఇస్తామని పదేళ్లుగా ఉన్నతాధికారులు ప్రకటిస్తూ వస్తున్నారు. సివిల్ విభాగం శాంతి భద్రతల పరిరక్షణలో కీలకం కాబట్టి అమలు చేయడం కష్టమని చెబుతూ దాటవేస్తున్నారు. కొత్తగా పెద్ద సంఖ్యలో కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేసినందున సిబ్బంది కొరత అనేది పెద్ద సమస్య కాదని.. దీనిని అధిగమించేందుకు ఉన్నతాధికారులు కసరత్తు చేయకపోవడమే ఆందోళనకరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనికితోడు టెక్నాలజీ పెరిగినకొద్దీ పనిభారం తగ్గుతోందని.. ఈ నేపథ్యంలో వీక్లీ ఆఫ్ అమలు చేయాలని డిమాండ్లు వస్తున్నాయి. తగిన విధంగా వినియోగించుకుంటే.. పోలీస్‌స్టేషన్‌లో ఉన్న సిబ్బందిని సరైన రీతిలో ఉపయోగించుకుంటే వీక్లీ ఆఫ్ ఇవ్వడం కష్టం కాదన్నది కొందరు సీనియర్ ఐపీఎస్‌ల అభిప్రాయం. ఠాణాల వారీగా సిబ్బంది ఎంత మంది ఉన్నారు, వారి డ్యూటీ చార్ట్, సెక్టార్ల కేటాయింపు తదితరాలపై వారం పదిరోజులు కసరత్తు చేస్తే వీక్లీ ఆఫ్ అమలు పెద్ద కష్టం కాదని పేర్కొంటున్నారు. ఒక కానిస్టేబుల్‌కు ఠాణా లో పక్కాగా ఒక డ్యూటీ కేటాయించడం, ఆ వ్యక్తికి రిలీవర్‌గా మరో కానిస్టేబుల్‌ను నియమించి నెల, రెండు నెలల పాటు పైలట్‌గా డ్యూటీలు చేయించడం ద్వారా ఏదైనా సమస్యలు ఉంటాయా? ఉంటే వాటిని ఎలా అధిగమించాలన్న దానిపై సబ్ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్ స్థాయిలో కసరత్తు చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఇది ఆయా ఠాణాల పరిధిలో శాంతి భద్రతల పరిస్థితి, సిబ్బంది సామర్థ్యంపై ఆధారపడి ఉంటుందని సీనియర్ అధికారులు చెబుతున్నారు. గ్రామీణ ఠాణాల్లో పరిస్థితి ఇదీ.. జిల్లాల్లోని మండల స్థాయి పోలీస్స్టేషన్లు/ఎస్సై స్టేషన్ హౌజ్ ఆఫీసర్‌గా ఉన్న ఠాణాల్లో 21 మంది కానిస్టేబుళ్లు, నలుగురు హెడ్ కానిస్టేబుళ్లు, ఇద్దరు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్లు, ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఉంటారు. ఒక మండల స్థాయి ఠాణా పరిధిలో గరిష్టంగా 22 నుంచి 25 గ్రామాలు ఉంటాయి. ఠాణాకు రోజువారీ ఫిర్యాదులు, ఎఫ్ఐఆర్ నమో దు తదితర స్టేషన్ మేనేజ్మెంట్కు ఒక ఏఎస్సై అడ్మిన్‌గా ఉంటే.. బందోబస్తు, కేసుల దర్యాప్తులకు మరో ఏఎస్సై, ఒక హెడ్‌కానిస్టేబుల్, నలుగురు కానిస్టేబుళ్లను కేటాయించుకోవచ్చు. మిగతా వారు గ్రామాలు, అక్కడ జరుగుతున్న నేరాలు, రోజువారీ శాంతి భద్రతలు, స్టేషన్ డ్యూటీలను పర్యవేక్షిస్తారు. సరైన రీతిలో వర్క్ మేనేజ్మెంట్ ఉపయోగిస్తే వీరందరికీ వీక్లీ ఆఫ్ కేటాయించడం పెద్ద కష్టం కాదన్నది జిల్లా ఎస్పీల అభిప్రాయం. అర్బన్ స్టేషన్లలో కష్టమే! పోలీస్ కమిషనరేట్లు, అర్బన్ ప్రాంతాల్లో ఒక్కో ఠాణాకు ఒక ఇన్స్పెక్టర్, 4 ఎస్సై, 6 ఏఎస్సైలు, 8 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 30 మంది కానిస్టేబుళ్లు ఉంటారు. పట్టణ ప్రాంతాల్లో వీఐపీల బందోబస్తు, నేరాలు కారణంగా వీక్లీ ఆఫ్ కొంత కష్టమని చెబుతున్నారు. ప్రతి ఠాణాకు మరో 6 నుంచి 8 మంది కానిస్టేబుళ్లను కేటాయిస్తే, వీక్లీ ఆఫ్ అమలు సులభమని పోలీస్ కమిషనర్లు చెబుతున్నారు. -
ఇంటర్నెట్ సేవలపై కొనసాగుతున్న ఆంక్షలు...!
ప్రపంచంలోని ఇతర దేశాలతో పోల్చితే భారత్‌లోనే అత్యధికంగా ఇంటర్నెట్ సేవలు (షట్‌డౌన్) నిలిపివేయడం వంటివి చోటుచేసుకున్నట్టు వెల్లడైంది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో శాంతి, భద్రతల పరిస్థితి క్షీణించే పరిస్థితులు, ఏవైనా ఘర్షణాత్మక పరిణామాలు చోటు చేసుకున్నపుడు ఆయా ప్రాంతాల్లో తాత్కాలికంగా ఇంటర్నెట్ సేవలు నిలిపేస్తున్నారు. ఇంటర్నెట్ సేవలు ఉపయోగించుకుని వాట్సాప్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా వేగంగా వదంతులు వ్యాపించే అవకాశమున్నందున దీనిపైనే అధికంగా దృష్టి కేంద్రీకరిస్తున్నట్టు తెలుస్తోంది. 2012 నుంచి ఇప్పటివరకు 161 సందర్భాల్లో ఈ సేవలకు అంతరాయం ఏర్పడినట్టు ఢిల్లీకి చెందిన లాభాపేక్ష లేని ‘సాఫ్ట్వేర్ ఫ్రీడం లా సెంటర్’ గణాంకాలను బట్టి తెలుస్తోంది. అందులో అధిక శాతం గత రెండున్నరేళ్లలోపు జరిగినవే. 2016లో 31, 2017లో 70, ఈ ఏడాది ఇప్పటివరకు 32 సందర్భాలున్నాయి. అయితే భారత్‌లో ఎక్కువస్థాయిలో నియంత్రణ విధించడాన్ని మానవహక్కుల సంఘాలు, పత్రికా స్వేచ్ఛ సంస్థలు తప్పుబడుతున్నాయి. మానవహక్కుల ఉల్లంఘనతో పాటు పత్రికాస్వేచ్ఛకు భంగం వంటి కారణాల వల్ల ఇలాంటివి సరికాదని వాదిస్తున్నాయి. గత 15 రోజుల్లోనే ఆరు రాష్ట్రాల్లో... మరీ ముఖ్యంగా గత రెండువారాల్లోనే ఆరురాష్ట్రాల్లో ఈ షట్‌డౌన్ చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్ , పశ్చిమబెంగాల్, జమ్మూ కశ్మీర్, రాజస్థాన్, పంజాబ్, ఉత్తరప్రదేశ్‌లో ప్రధానంగా శాంతి,భద్రతల పరిరక్షణలో భాగంగానే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. అయితే మధ్యప్రదేశ్, పంజాబ్ మాత్రమే కేంద్ర ప్రభుత్వం 2017లో నిర్దేశించిన నియమ,నిబంధనల ప్రక్రియను పాటించాయి. బెంగాల్లో శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా చోటుచేసుకున్న ఉద్రిక్తతల కారణంగా, కశ్మీర్లో మిలిటెంట్లపై భద్రతాదళాలు జరిపిన భారీ ఆపరేషన్ సందర్భంగా, ఎస్సీ,ఎస్టీల అత్యాచారాల నిరోధకచట్టంపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో దళితసంఘాల భారత్‌బంద్ సందర్భంగా ఇవి చోటుచేసుకున్నాయి. ప్రాథమిక నిషేదాజ్ఞలు, ప్రజల కదలికలపై నియంత్రణలతో పాటు ఆయా రాష్ట్రాల్లోని అధికారులు ప్రభావిత ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను స్తంభింపజేశారు. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడినపుడు ఇంటర్నెట్‌సేవలు ఆపివేయడాన్ని ఒక ప్రామాణిక ప్రక్రియగా కొనసాగుతోంది. పుకార్లు, వదంతులు త్వరగా వ్యాపించేందుకు తరచుగా ఇంటర్నెట్ను ఉపయోగించడం, దాని ద్వారా హింస, అల్లర్లు రెచ్చగొట్టే అవకాశం ఏర్పడుతోందని స్థానిక అధికార యంత్రాంగం వాదిస్తోంది. అందువల్లే పరిమిత కాలానికి తాత్కాలికంగా ఈ సర్వీసును నిలిపివేయాల్సి వస్తోందని చెబుతోంది. దీని ద్వారా శాంతి,భద్రతల పరిస్థితిని నియంత్రణలో ఉంచేందుకు వీలు కలుగుతోందని వాదిస్తోంది. కొత్త నిబంధనలు... ప్రస్తుతం వివిధ పనులు, అవసరాల కోసం విస్తృతంగా ఇంటర్నెట్ సేవలు ఉపయోగిస్తున్నందున ఇలాంటి నియంత్రణలపై ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే ఈ పరిస్థితిని అధిగమించేందుకు గత సెప్టెంబర్‌లో కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చింది. ప్రజా భద్రతకు భంగం, అత్యవసర పరిస్థితి వంటిది ఏర్పడినపుడు తాత్కాలికంగా టెలికం సర్వీసులు సస్పెండ్ చేసేందుకు పాటించాల్సిన ప్రక్రియను కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ ప్రకటించింది. 1885 ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టంలో భాగంగా ‘టెంపరరీ సస్పెన్షన్ ఆఫ్ సర్వీసెస్ (పబ్లిక్ ఎమర్జెన్సీ ఆర్ పబ్లిక్ సెఫిటీ)రూల్స్,2017గా ఈ నిబంధనలు ఖరారు చేసింది. ఇలాంటి సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసే పక్షంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శికి ఆ అధికారాలు కల్పిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలకు రాష్ట్ర హోంశాఖ కార్యదర్శికి ఆ అధికారం ఉంటుంది. తప్పనిసరి పరిస్థితుల్లో జాయింట్ సెక్రటరీ స్థాయి అధికారి (కేంద్ర/ రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి అనుమతితో) జారీచేయవచ్చు. అయితే ఈ నిబంధనల పట్ల కూడా కొందరు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. అయితే ఈ నిబంధనలకు విరుద్ధంగా బెంగాల్‌లోని పశ్చిమ వర్థమాన్ జిల్లాలో మొబైల్, ఇంటర్నెట్, బ్రాడ్‌బ్రాండ్ సర్వీసులు (స్థానిక కేబుల్ టీవీ వార్తా ప్రసారాలు సహా) రెండున్నర రోజుల పాటు నిలిపివేశారు. జిల్లా మేజిస్ట్రేట్‌కు సెక్షన్–144 కింద ఉన్న అపరిమిత అధికారాలను దీనికి ఉపయోగించారు. కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చే వరకు కూడా దేశంలోని ఇంటర్నెట్ సేవల నిలుపుదల ఉత్తర్వులు ఎక్కువగా ఇదే తరహాలో ఇస్తూ వచ్చారు. నూతన నిబంధనలు వచ్చాక కూడా పాత పద్థతే కొన్ని చోట్ల కొనసాగుతోంది. ఇతర రాష్ట్రాలకు భిన్నంగా మధ్యప్రదేశ్, పంజాబ్‌లలో మాత్రం కేంద్ర ప్రభుత్వ కొత్త నిబంధనలు పాటిస్తూ ఇటీవల ఇంటర్నెట్ సేవల తాత్కాలిక నిలుపుదల ఉత్తర్తులిచ్చాయి. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
నిరసనలపై మార్గదర్శకాలు అవసరం: సుప్రీం
న్యూఢిల్లీ: ప్రజలు నిరసన తెలిపే సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు కొన్ని మార్గదర్శకాలను తీసుకురావాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు సోమవారం పేర్కొంది. సెంట్రల్ ఢిల్లీ, న్యూఢిల్లీ ప్రాంతాల్లో నిరసనలు తెలపకుండా పోలీసులు ఆంక్షలు విధించడాన్ని అక్రమంగా ప్రకటించాలంటూ దాఖలైన ఓ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ అశోక్ భూషణ్‌ల ధర్మాసనం...కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ పోలీసు విభాగానికి నోటీసులు జారీచేసింది. నిరసన తెలపడం ప్రజల ప్రాథమిక హక్కనీ, దానికి భంగం కలగకుండా, అలాగే శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా మధ్యే మార్గంలో నిరసనలు తెలిపేందుకు కొన్ని మార్గదర్శకాలు అవసరమని ధర్మాసనం అభిప్రాయపడింది. -
భద్రతకు రూ.25 వేల కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో శాంతిభద్రతల వ్యవస్థను మెరుగుపరచడానికి.. పోలీసు బలగాలను ఆధునీకరించడానికి.. ఉగ్రవాదంపై సమర్థవంతంగా పోరాటానికి ఉద్దేశించిన భారీ అంతర్గత భద్రతా పథకానికి కేంద్ర ప్రభుత్వం బుధవారం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. సుమారు రూ.25 వేల కోట్ల విలువైన ఈ పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీఎస్) సమావేశం బుధవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగింది. పోలీసు బలగాలను ఆధునీకరించేందుకుగానూ ‘మాడర్నైజేషన్ ఆఫ్ పోలీస్ ఫోర్సెస్(ఎంపీఎఫ్)’పేరిట 2017–18 నుంచి 2019–20 వరకు మూడేళ్ల పాటు రూ.25,060 కోట్ల మేర వెచ్చించాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకం మొత్తం వ్యయంలో కేంద్ర ప్రభుత్వం వాటా రూ.18,636 కోట్లు కాగా.. రాష్ట్రాల వాటా రూ.6,424 కోట్లుగా ఉంటుందని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ మీడియాకు తెలిపారు. ఇంతకుముందు ఎన్నడూ చేపట్టని అతిపెద్ద పథకం ఇదని చెప్పారు. ఎంపీఎఫ్ పథకం కింద దేశ అంతర్గత భద్రతకు ప్రత్యేక నిబంధనలను పొందుపరిచారు. అలాగే శాంతిభద్రతలు, మహిళల భద్రత, అత్యాధునిక ఆయుధాల లభ్యత, పోలీసు బలగాల రవాణా, సరుకు రవాణా, హెలికాప్టర్లను అందుబాటులో ఉంచడం, పోలీసు వైర్లెస్ వ్యవస్థ, జాతీయ శాటిలైట్ నెట్‌వర్క్‌ను ఆధునీకరించడం, క్రైం, క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్, సిస్టమ్స్, ఈ–జైళ్లు మొదలైన వాటిని కల్పించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఎంపీఎఫ్ పథకంలో భాగంగా అంతర్గత భద్రత కోసం జమ్మూ కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలు, నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో రూ.10,132 కోట్లు వ్యయం చేయనున్నట్టు రాజ్‌నాథ్ చెప్పారు. 35 నక్సల్ ప్రభావిత జిల్లాల్లోని వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి రూ.3వేల కోట్లను వ్యయం చేస్తామన్నారు. పోలీసు మౌలిక వసతుల కల్పన, శిక్షణ సంస్థలు, దర్యాప్తు సదుపాయా ల నిమిత్తం రూ.100 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. ఎంపీఎఫ్ పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అధునాతనమైన ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీని ఏర్పాటు చేస్తామని, జైపూర్ లోని సర్దార్ పటేల్ గ్లోబల్ సెంటర్ ఫర్ సెక్యూరిటీ, కౌంటర్ టెర్రరిజమ్‌ను, అలాగే గాంధీనగర్‌లోని గుజరాత్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీని ఆధునీకరిస్తామని చెప్పారు. ఏఏఐ భూమి ఏపీ ప్రభుత్వానికి రాజమండ్రి విమానాశ్రయం వద్ద ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)కి చెందిన 10.25 ఎకరాల భూమిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇంతే విస్తీర్ణంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ భూమిని ఇస్తుంది. రాజమండ్రి విమానాశ్రయం చుట్టూ గల గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించేందుకు ఈ భూమిని వినియోగిస్తారు. ప్రభుత్వ వైద్యుల ‘రిటైర్మెంట్’ పెంపు కేంద్ర ప్రభుత్వ వైద్యుల పదవీ విరమణ వయసును 65 ఏళ్లకు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆయుష్ మంత్రిత్వ శాఖ, రైల్వే శాఖల్లో పనిచేస్తున్న వారికీ ఇది వర్తిస్తుంది. ప్రస్తుతం కేంద్ర వైద్యుల రిటైర్మెం ట్ వయసు కొన్ని విభాగాల్లో 60 ఏళ్లుగా, మరికొన్నింటిలో 62 ఏళ్లుగా ఉంది. దీంతో వివిధ విభాగాల్లోని 1,445 మంది వైద్యులకు లబ్ధి చేకూరనుంది. మరోవైపు మొబైల్ ఫోన్ కనెక్టివిటీని పెంచేందుకు ఆర్మీ కంటోన్మెంట్ ఏరియాల్లో సెల్ టవర్లు ఏర్పాటు చేసేందుకు ఆమోదముద్ర వేసింది. -
'పవన్ చెప్పిన విషయాలను పరిశీలిస్తున్నాం'
విజయవాడ: కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తన పాదయాత్రతో శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని చూస్తున్నారని ఏపీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. ముద్రగడ పాదయాత్రపై శనివారం విజయవాడలో హోంమంత్రి, ఎమ్మెల్యే బోండా మీడియాతో మాట్లాడారు. ముద్రగడ ఉద్యమంలో పాల్గొంటే కేసుల్లో ఇరుక్కుని జైలుకు కెళ్తారని అన్నారు. అదేవిధంగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చెప్పిన విషయాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. 144 సెక్షన్‌పై విచారించి నిర్ణయం తీసుకుంటామని చినరాజప్ప, బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాపులకు చేసిన ద్రోహానికి నిరసనగా నవంబర్ 16 నుంచి ఐదు రోజుల పాటు సత్యాగ్రహ పాదయాత్ర చేయనున్నట్లు ముద్రగడ పద్మనాభం ప్రకటించిన సంగతి తెలిసిందే. -
పోలీసు అధికారులతో ముగిసిన దత్తాత్రేయ భేటీ
హైదరాబాద్: పోలీస్ ఉన్నతాధికారులతో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ భేటీ ముగిసింది. పోలీసు ఉన్నతాధికారులతో ఆదివారం దత్తాత్రేయ సమావేశమైయ్యారు. ఈ సమావేశంలో హైదరాబాద్ శాంతి భద్రతలపై పోలీసు అధికారులను ఆయన అడిగి తెలుసుకున్నారు. సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఐసిస్‌ను అంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని దత్తాత్రేయ వెల్లడించారు. ఈ సమావేశానికి అడిషనల్ డీజీపీ అంజనీకుమార్, సైబరాబాద్ ఈస్ట్, వెస్ట్ కమిషనర్లు.. మహేశ్ భగవత్, నవీనచంద్, హైదరాబాద్ సీపీ మహేందర్ రెడ్డి, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజీవ్ త్రివేది తదితరులు హాజరయ్యారు. -
'అందుకే మీడియాను నియంత్రించాం'
విజయవాడ: కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం దీక్ష నేపథ్యంలో మీడియా నియంత్రణపై గురువారం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును జర్నలిస్ట్‌లు ప్రశ్నించారు. దాంతో ప్రత్తిపాటి మాట్లాడుతూ.. శాంతి భద్రతల దృష్ట్యా మీడియాను హ్యాండిల్ చేశామంటూ చెప్పుకొచ్చారు. గతంలో తూర్పుగోదావరి జిల్లా తుని సంఘటనలో చోటుచేసుకున్న పరిణామాలు తెలిసిందే కాదా? అని చెప్పారు. మళ్లీ అలాంటి పరిస్థితులు వస్తాయనే మీడియాను నియంత్రించామని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. -
పోలీసుల కనుసన్నలలోనే లూటీలు, దహనాలు
చండీగఢ్: హర్యానాలోని సోన్‌పేట జిల్లాలో ఫిబ్రవరి నెలలో జాట్ల రిజర్వేషన్ల ఆందోళన సందర్భంగా విచ్చల విడిగా కొనసాగిన లూటీలు, దహనకాండ, హింస, అత్యాచారాలకు పౌర, పోలీసు అధికారులే ప్రధాన బాధ్యులని ఈ దారుణాలపై విచారణకు నియమించిన ప్రకాష్ కమిటీ నిగ్గు తేల్చింది. అల్లరి మూకలు రోడ్లపై స్వైర విహారం చేయడానికి, దాబాలను, దుకాణాలను దోచుకోవడానికి, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేయడానికి స్వచ్ఛందంగా పోలీసులు అనుమతించారని ప్రకాష్ కమిటీ వెల్లడించింది. ఈ కమిటీ నివేదికను హర్యానా ప్రభుత్వం మంగళవారం అధికారికంగా విడుదల చేసింది. ముఖ్యంగా సోన్‌పేట జిల్లాలోని ముర్తాలో ఎక్కువ విధ్వంసం చెలరేగడానికి అక్కడి డీఎస్పీ సతీష్ కుమార్, స్టేషన్ హౌజ్ ఆఫీసర్ ధన్కర్ బాధ్యులని నివేదిక పేర్కొంది. అల్లరి మూకలను అదుపు చేయడానికి, శాంతి భద్రతలను పరిరక్షించేందుకు వీరు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ప్రకాష్ కమిటీ ఆరోపించింది. బాధ్యులను శాఖాపరంగా, చట్టపరంగా కఠినంగా శిక్షించాలని సిఫార్సు చేసింది. ఫిబ్రవరి 21, 22 తేదీల మధ్య రాత్రి సుఖ్‌దేవ్ దాబా సమీపంలో అల్లరి మూకలు విచ్చలవిడిగా లూటీలు, దహనాలకు పాల్పడ్డారని కమిటీ తెలిపింది. దాడులకు గురైన బాధితులు ఇరుగు పొరుగు ఇళ్లలో తలదాచుకున్నారని పేర్కొంది. ముఖాలకు ముసుగులు ధరించి వచ్చి లూటీలకు పాల్పడిన యువకులు దాదాపు 50 వాహనాలను దగ్ఢం చేశారని వెల్లడించింది. అదే రాత్రి పలువురు మహిళలపై సామూహిక అత్యాచారాలు కూడా జరిగినట్లు పోలీసు కేసులు నమోదయ్యాయి. అల్లర్లను అదుపు చేసేందుకు పౌర అధికారులు కూడా తగిన చర్యలు తీసుకోలేదని, వారు కూడా ప్రేక్షక పాత్ర వహించారని ప్రకాష్ కమిటీ ఆరోపించింది. ఈ నివేదికపై ఇంకా ప్రభుత్వ స్పందనలు వెలువడాల్సి ఉంది. -
'మందకృష్ణ మాదిగ యాత్రకు అనుమతి లేదు'
- శాంతి భద్రతల దృష్ట్యా యాత్రకు అనుమతి నిరాకరణ - మందకృష్ణపై కొంతమంది మాదిగల ఫిర్యాదు: తిరుపతి అర్బన్ ఎస్పీ గోపీనాథ్ తిరుపతి: ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ రథయాత్రకు అనుమతి లేదని తిరుపతి అర్బన్ ఎస్పీ గోపీనాథ్ వెల్లడించారు. మంగళవారం ఎస్పీ విలేకరులతో మాట్లాడారు. మందకృష్ణ మాదిగ పై చిత్తూరు జిల్లాకు చెందిన కొంతమంది మాదిగలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేసినట్టు ఎస్పీ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో శాంతి భద్రతల దృష్ట్యా మందకృష్ణ మాదిగ యాత్రకు అనుమతిని నిరాకరించినట్టు చెప్పారు. కాగా, ఈ నెల 10న చిత్తూరు జిల్లాలోని నారావారిపల్లె నుంచి మందకృష్ణ మాదిగ యాత్ర చేపట్టనున్న సంగతి తెలిసిందే. -
సాదత్ అహ్మద్‌పై పీడీయాక్ట్
కుత్బుల్లాపూర్: శాంతి భద్రతల విషయంలో పోలీసులకు తలనొప్పి పుట్టిస్తున్న సాదత్ అహ్మద్‌పై సైబరాబాద్ పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. ఇప్పటికే పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న సాదత్‌ను జీడిమెట్ల పోలీసులు ఇటీవలే అరెస్టు చేసి రిమాండ్‌కు పంపిన విషయం తెలిసిందే. తాజాగా బుధవారం సైబరాబాద్ సీపీ ఆనంద్ ఆదేశాల మేరకు సాదత్‌పై పీడీ యాక్ట్ తెరిచారు. సూరారం కాలనీ షిర్డీ సాయిబాబానగర్‌కు చెందిన సాదత్ అహ్మద్ గతంలో హ్యుమన్ రైట్స్ ఇంటర్నేషనల్ ఎస్ఏ ఆర్గనైజేషన్ పేరుతో తన ఇంటినే అడ్డాగా చేసుకుని కుత్బుల్లాపూర్, దుండిగల్, షాపూర్‌నగర్, జీడిమెట్ల ప్రాంతవాసులను భయబ్రాంతులకు గురి చేసి అక్రమార్జనకు తెర లేపాడు. ఫోర్జరీ, చీటింగ్, మహిళలపై అఘాయిత్యాలు, దాడులు వంటి పలు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడటంతో అతనిపై పలు కేసులు నమోదయ్యాయి. 2015, నవంబర్ 25న జీడిమెట్ల పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. జైలు నుంచి బయటకు వచ్చిన సాదత్ తన పంథా మార్చుకోకుండా మళ్లీ రోడామిస్త్రీనగర్కు చెందిన ఓ వ్యక్తిని బెదిరించాడు. ఈ కేసులో తాజాగా పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. సాదత్ అతిప్రమాదకరమైన వ్యక్తిగా భావించిన పోలీసులు చివరకు పీడీ యాక్ట్ నమోదు చేశారు. -
శాంతి భద్రతలపై తెలంగాణ హామీ
కేంద్ర మంత్రి హరీభాయ్ చౌధురీ సాక్షి, న్యూఢిల్లీ: ఉమ్మడి రాజధానిలో శాంతిభద్రతలు కాపాడతామని టీ సర్కార్ హామీ ఇచ్చినందున 2014 జూన్ 4 నాటి మెమోరాండం అంశాన్ని అప్పటితోనే ముగించామని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. గతేడాది జూలై 22న రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి లేవనెత్తిన ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హరీభాయ్ పార్తీ భాయ్ చౌధురి తాజాగా జూన్ 16న లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. ఆ లేఖను పాల్వాయి మంగళవారం మీడియాకు విడుదల చేశారు. గవర్నర్‌కు ప్రత్యేక బాధ్యతలపై ఇచ్చిన మెమోరాండంను హోంశాఖ ఉపసంహరించుకుంటుందా అని పాల్వాయి వేసిన ప్రశ్నకు సమాధానంగా ఈ లేఖ ఇచ్చినట్లు చెప్పారు. -
గవర్నర్‌తో కేసీఆర్ భేటీ.
-
గవర్నర్‌తో కేసీఆర్ భేటీ, తాజా పరిణామాలపై చర్చ
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు మరోసారి గవర్నర్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. ఆయన బుధవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో సమావేశమై తాజా పరిణామాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్‌లో శాంతిభద్రతలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గందరగోళం సృష్టిస్తోందని కేసీఆర్ ఈ సందర్భంగా గవర్నర్ దృష్టికి తీసుకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
లా అండ్ ఆర్డర్ లేదంటే రాజీనామా చేస్తా : నాయిని
హైదరాబాద్: హైదరాబాద్‌లో శాంతిభద్రతలు సరిగా లేవని నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి సవాల్ విసిరారు. తెలంగాణ శాసనమండలిలో మంగళవారం కాంగ్రెస్ సభ్యుడు ఎం.ఎస్.ప్రభాకర్ గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో మాట్లాడుతూ హైదరాబాద్‌లో శాంతిభద్రతలు క్షీణించాయని ఆరోపించారు. మహిళలపై అత్యాచారాలు జరగుతున్నాయని... ప్రభుత్వం శాంతిభద్రతలు కాపాడటంలో విఫలమైందని విమర్శించారు. ఎమ్మెల్యేలకు కూడా రక్షణ లేని నగరాన్ని విశ్వనగరం అంటే ఎలా? అని నిలదీశారు. దీంతో సభలోనే ఉన్న హోంమంత్రి నాయిని వెంటనే లేచి ‘ శాంతి భద్రతలు క్షీణించాయని నిరూపిస్తే రాజీనామా చేస్తానని... శాంతిభద్రతలు సరిగ్గా ఉన్నాయని తేలితే నీవు రాజీనామా చేస్తావా’ అంటూ ఎమ్మెల్యేకు సవాల్ విసిరారు. దీంతో సభలో కాసేపు గందరగోళం నెలకొంది. పలువురు కాంగ్రెస్ సభ్యులు లేచి ఛైర్మన్ స్వామిగౌడ్‌ను నిలదీశారు. ‘నాయిని పెద్దమనిషి. అలాగే మాట్లాడుతాడు’ అంటూ సముదాయించారు. దీంతో గొడవ సద్దుమణిగింది. -
నగరంలో నిషేధాజ్ఞల పొడిగింపు
హైదరాబాద్ : నగరంలో కొనసాగుతున్న నిషేదాజ్ఞల గడువును మరో వారం రోజులు పొడిగిస్తూ నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అసెంబ్లీ, సచివాలయం చుట్టుపక్క ప్రాంతాలలో పోలీసు అనుమతి లేకుండా బహిరంగ సభలు, ర్యాలీలు, సమావేశాలు, ధార్నలు, రాస్తారోకోలు, ప్రసంగాలే చేయరాదని ఉత్తర్వులు పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులు ఈ నెల 10వ తేదీ వరకు అమలులో ఉంటాయి. ఉత్తర్వులను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మహేందర్‌రెడ్డి హెచ్చరించారు. -
ఆ అభ్యంతరాలు అపోహ మాత్రమే!
* గవర్నర్‌కు అధికారాల వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు * ప్రత్యేక సందర్భాల్లోనే ఆయన జోక్యం చేసుకుంటారు * కేంద్ర హోంశాఖ వర్గాల స్పష్టీకరణ * బదిలీల ప్రక్రియ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డు చూస్తుంది సాక్షి, న్యూఢిల్లీ: ఉమ్మడి రాజధానిలో శాంతిభద్రతల పర్యవేక్షణ కోసం గవర్నర్‌కు ప్రత్యేక అధికారాలు కట్టబెట్టడంపై వచ్చిన అభ్యంతరాలు కేవలం అపోహలేనని కేంద్ర హోంశాఖ చెబుతోంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లోని సెక్షన్ 8(1) ప్రకారం అపాయింటెడ్ డే నుంచి ఉమ్మడి రాజధానిలో పాలనా వ్యవహారాల నిమిత్తం గవర్నర్‌కు ప్రత్యేక బాధ్యత ఉంది. సెక్షన్ 8(2) ప్రకారం గవర్నర్‌కు శాంతిభద్రతలు, అంతర్గత భద్రత, ఆస్తుల పరిరక్షణ, ముఖ్యమైన సంస్థల భద్రత, ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణ, కేటాయింపు విషయంలో ప్రత్యేక అధికారాలు ఉంటాయి. సెక్షన్ 8(3)ప్రకారం తెలంగాణ ప్రభుత్వ మంత్రి మండలిని సంప్రదించి గవర్నర్ తుది నిర్ణయాన్ని తీసుకోవచ్చు. అయితే ఆగస్టు 8వ తేదీన కేంద్ర హోంశాఖ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి జారీ చేసిన సర్క్యులర్ ఈ వివాదానికి కారణమైంది. స్టేషన్ హౌజ్ ఆఫీసర్ స్థాయి బదిలీకి సైతం గవర్నర్ ఆమోదం తీసుకోవాల్సి ఉంటుందని, ఇది సహేతుకం కాదని టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్లో అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నెల 21వ తేదీన కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో జరిగిన సమావేశంలోనూ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే, ముఖ్యమంత్రి అధికారాలను పలుచన చేసే ఉద్దేశం తమకు లేదని ఆయన వారికి సర్దిచెప్పారు. ఈ విషయమై శుక్రవారం హోంశాఖ అధికారులను సంప్రదించగా.. పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారమే గవర్నర్‌కు అధికారాలు ఉంటాయని స్పష్టంచేశారు. ‘తెలంగాణకు పంపిన సర్క్యులర్‌లో ఎలాంటి మార్పు ఉండదు. బదిలీలనేవి పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డు చూసుకుంటుంది. ఇది సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా పనిచేస్తుంది. ఈ బోర్డు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినదే అయి ఉంటుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్ జోక్యం ఉండదు. అలాగే గవర్నర్ సైతం రోజువారీ వ్యవహారాల్లో కాకుండా కొన్ని ప్రత్యేక సందర్భాల్లోనే జోక్యం చేసుకుంటారు.. దీంతో ఎలాంటి ఇబ్బంది ఉండదు’ అని హోంశాఖకు చెందిన ముఖ్యఅధికారి పేర్కొన్నారు. -
గవర్నర్‌కు అధికారాలపై పిటిషన్ల ఉపసంహరణ
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో శాంతి భద్రతలు, అంతర్గత భద్రత, ముఖ్య సంస్థల పర్యవేక్షణ బాధ్యతలను గవర్నర్‌కు కట్టబెట్టే ఏపీ పునర్ విభజన చట్టంలోని సెక్షన్ 8ని కొట్టివేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్లను పిటిషనర్లు గురువారం ఉపసంహరించుకున్నారు. పిటిషన్లను రిట్లుగా దాఖలు చేయడంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ పిటిషన్లను ఉపసంహరించుకుని ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేసుకోవచ్చని కోర్టు సూచించింది. -
26 వరకు సెక్రటేరియట్ పరిసరాల్లో నిషేధాజ్ఞలు
సాక్షి, హైదరాబాద్: శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా హైదరాబాద్ నగరంలో ఈ నెల 26 వరకు నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని హైదరాబాద్ సిటీ కమిషనర్ అనురాగ్ శర్మ పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. సచివాలయం, బూర్గుల రామకృష్ణారావు భవన్, జీహెచ్ఎంసీ, కమిషనర్ ఆఫ్ ఫిషరీస్, మింట్ కాంపౌండ్, నిజాం కాలేజ్, ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్ బండ్, నెక్లెస్‌రోడ్, ఐమాక్స్ థియేటర్, నాంపల్లి, అసెంబ్లీ పరిసరాల్లో ర్యాలీలు, బహిరంగ సభలు, ధర్నాలను నిషేధిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 26 వరకు ఆదేశాలు అమల్లో ఉంటాయన్నారు. -
యూపీలో మెరుగైన శాంతిభద్రతలు ఆశించొద్దు: ములాయం
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో తమ పార్టీ పాలనలో శాంతిభద్రతలు దిగజారాయన్న విమర్శల నేపథ్యంలో సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ ములాయంసింగ్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర జనాభా 21 కోట్లకుపైగా ఉన్నప్పుడు శాంతిభద్రతలు మెరుగ్గా ఎలా ఉంటాయని శుక్రవారం లక్నోలో ఆయన ప్రశ్నించారు. ‘ఢిల్లీతో యూపీని పోల్చకండి. దేశ రాజధానికన్నా యూపీ 10 రెట్లు పెద్దది. కానీ యూపీతో పోలిస్తే ఢిల్లీలో నేరాలు 10 రెట్లు ఎక్కువ నమోదవుతున్నాయి. 21 కోట్లకుపైగా జనాభా ఉన్న రాష్ట్రంలో మెరుగైన శాంతిభద్రతలను ఎలా ఆశిస్తారు?’ అని ఈ అంశంపై తన అభిప్రాయం అడిగిన విలేకరులను ములాయం ఎదురు ప్రశ్నించారు. యూపీలో ఇటీవల జరిగిన ముజఫర్‌నగర్ అల్లర్లను అదుపు చేయడంలో అఖిలేశ్ సర్కారు ఘోరంగా విఫలమైందన్న విమర్శల నేపథ్యంలో ములాయం ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. 2013లో దేశంలోకెల్లా అత్యధికంగా యూపీలో 247 మతహింస సంబంధిత ఘటనలు జరిగినట్లు కేంద్రం ఈ నెల 5న రాజ్యసభలో తెలిపింది. -
నగర రక్షణకు ప్రణాళిక
= ఆరు ప్రధాన సెంటర్లలో పోలీసు సబ్కంట్రోల్స్ = ఆర్టీసీ బస్టాండ్‌లో నాలుగు సీసీ కెమెరాల ఏర్పాటు = సీసీఎస్, ట్రాఫిక్ విభాగాలపై ప్రత్యేక శ్రద్ధ = జిల్లాలో ఎస్సైల బదిలీలకూ రంగం సిద్ధం సాక్షి, ఒంగోలు: రానున్నది ఎన్నికల సీజన్.. శాంతిభద్రల పర్యవేక్షణలో ఏమాత్రం తేడా వచ్చినా ఇబ్బందే. దీన్ని దృష్టిలో పెట్టుకొని జిల్లాలో పోలీసు వ్యవస్థను గాడిలో పెట్టేందుకు జిల్లా యంత్రాంగం నడుం బిగిస్తోంది. దీనిలో భాగంగా ముందుగా పోలీసు అధికారుల బదిలీలు జరగనున్నాయి. దీనిపై ఇప్పటికే ఎస్పీ కసరత్తు పూర్తి చేశారు. మరో వారం రోజుల్లో జిల్లా స్థాయిలో రెండేళ్ల కాలపరిమితి పూర్తై అధికారులను, పూర్తి కాకపోయినా.. పనితీరులో వెనుకబడి ఉన్న వారిని బదిలీ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. ముఖ్యంగా ఒంగోలు నగరంలో శాంతిభద్రతలు, నేర పరిశోధన, ట్రాఫిక్, రక్షక్, బ్లూకోల్ట్స్ తదితర అన్ని విభాగాల్లో సమూల మార్పులు చేపట్టేందుకు రంగం సిద్ధం చేశారు. రెస్ట్హౌస్లా ‘రక్షక్’ నగరంలో ఒన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఒకటి, తాలూకా పోలీస్‌స్టేషన్ పరిధిలో మరొక రక్షక్ వాహన సిబ్బంది విధి నిర్వహణలో మందకొడిగా ఉన్నట్లు పోలీసు అధికారులు గుర్తించారు. నిత్యం గస్తీ తిరుగుతూ అనుమానాస్పద వ్యక్తులను గుర్తించడం, నేరం జరిగిన చోటుకు తక్షణమే వెళ్లడం, రెస్క్యూ చేయడం, ప్రాథమికంగా తీసుకోవాల్సిన చర్యలు చేపడుతూ ప్రజల రక్షణ బాధ్యత చూడాల్సిన వీరు రక్షక్ అంటే ఒక రెస్ట్హౌస్లా భావిస్తున్నారు. చేయాల్సిన పనులను వదిలి కోర్టు విధులకు, నిందితులను కోర్టుకు, రిమాండ్‌కు తరలించడం వంటి పనులకే పరిమితమవుతున్నారు. రాత్రి వేళల్లో కేవలం రెండు మూడుసార్లు మాత్రమే తిరుగుతున్నట్లు తెలిసింది. బ్లూ కోల్ట్స్లోనూ మార్పు.. పోలీస్‌స్టేషన్ పరిధిలో మోటార్‌బైక్‌లపై తిరుగుతూ నిత్యం అసాంఘిక కార్యకలాపాలపై నిఘా ఉంచి ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు తెలియజేయాల్సిన బ్లూకోల్ట్స్ పరిస్థితీ అదేవిధంగా తయారైంది. ఇకపై చురుగ్గా వ్యవహరించే యువకులైన పోలీసు సిబ్బందిని ఈ బ్లూకోల్ట్స్ విభాగంలో నియమించనున్నారు. నగరంలో ఆరు పోలీసు సబ్ కంట్రోల్స్ ఏర్పాటు ఒంగోలు నగరంలో రద్దీ అధికంగా ఉండే ఆరు ప్రాంతాల ను గుర్తించి అక్కడ పోలీసు సబ్ కంట్రోల్‌లను కొత్తగా ఏర్పాటు చేయనున్నారు. అక్కడ నిత్యం ఒక హెడ్ కానిస్టేబుల్, ముగ్గురు కానిస్టేబుళ్లు ఉంటూ ఆయా ప్రాంతాల్లో పోలీసు పరంగా చేపట్టాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకోనున్నారు. ఏదైనా నేరం జరిగినట్లు సమాచారం అందితే వెంటనే ఈ ఆరు సెంటర్లను దిగ్బంధిస్తే నేరస్తుడు ఎటూ తప్పించుకు పోయే పరిస్థితి ఉండదు. అదేవిధంగా ఆర్టీసీ బస్టాండ్‌లో కొత్తగా నాలుగు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. బ్యాంకులు, రైల్వే స్టేషన్, బస్టాండ్లలో పోలీసు నిఘాను మరింత పెంచేలా చర్యలు చేపట్టనున్నారు. కొత్తగా పోలీసు కానిస్టేబుళ్లుగా ఎంపికై శిక్షణ పూర్తిచేసుకున్న 300 మంది కానిస్టేబుళ్లను ఎస్పీ 12 బృందాలుగా ఏర్పాటు చేశారు. వారికి ప్రస్తుతం ఎక్కడా పోస్టింగ్‌లు ఇవ్వకుండా ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అందుబాటులో ఉండేలా అన్ని విధాలుగా సిద్ధం చేశారు. నగర డీఎస్పీ ఆధ్వర్యంలో ఆరు పోలీసు సబ్ కంట్రోల్స్, రెండు రక్షక్‌లు పనిచేస్తాయి. భారీగా ఎస్సైల బదిలీలు జిల్లావ్యాప్తంగా పలు స్టేషన్లకు సంబంధించి మరో వారం రోజుల్లో ఎస్సైల బదిలీలు జరగనున్నాయి. వీరిలో పలువురికి రెండేళ్లు పూర్తై సందర్భంగా స్థాన చలనం కలగనుండగా.. అనేక మందిని పనితీరు, సమర్ధత కొలమానంగా బదిలీ చేసేందుకు కసరత్తు పూర్తయింది. ఇక ప్రతి స్టేషన్లోనూ తప్పనిసరిగా ఒక సమర్ధుడైన యువ ఎస్సైను నియమించనున్నారు. ఒంగోలు ఒన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ప్రస్తుతం నలుగురు ఎస్సైలుండగా వారిలో ముగ్గురికి స్థాన చలనం తప్పేలా లేదు. టూ టౌన్లో ఉన్న ఇద్దరిలో ఒకరిపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో బదిలీ వేటు తప్పనిసరి. తాలూకా పోలీస్‌స్టేషన్‌లో ఉన్న ముగ్గురు ఎస్సైలలో ఇద్దరు యథాస్థానంలో కొనసాగనుండగా మరొకరికి బదిలీ జరగనున్నట్లు సమాచారం. ఇక సీసీఎస్ విభాగంలో పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయనున్నారు. సీఐల విషయంలో కూడా ప్రస్తుతం ముగ్గురు ఉండగా వారిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత అప్పగించి నేర పరిశోధనలో సమూల మార్పులు తేనున్నారు. సీసీఎస్‌లో పనిచేసే ఒక సీఐ నాయకత్వంలో ఇకపై కొద్దిమంది యువకులైన పోలీసు సిబ్బంది పగటి పూట మఫ్టీలో మోటార్ సైకిళ్లపై తిరుగుతూ గస్తీ నిర్వహించనున్నారు. నగర ట్రాఫిక్‌లో ప్రస్తుతం కేవలం ఇద్దరు ఎస్సైలు మాత్రమే ఉండగా మరో ఇద్దరు లేక ముగ్గురు ఎస్సైలను ట్రాఫిక్‌కు అటాచ్మెంట్ ఇవ్వనున్నట్లు తెలిసింది. నాగులుప్పలపాడు, సింగరాయకొండలకు కొత్తగా ఎస్సైలు రానున్నారు. సంతనూతలపాడులో ఎస్సైగా ఉన్న ఆరోగ్యరాజుకు ఇప్పటికే రెండేళ్లు పూర్తి కావడంతో ఆయన్ను బదిలీ చేయనున్నారు. ఆయనను అద్దంకి పోలీస్‌స్టేషన్‌కు, కొండపి పోలీస్‌స్టేషన్‌లో ఎస్సైగా ఉన్న సోమశేఖర్‌ను దర్శికి బదిలీ చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. జరుగుమల్లి స్టేషన్ ఎస్సై వచ్చే నెలాఖరున పదవీ విరమణ చేయనుండడంతో జనవరి మొదటి వారంలో ఆ స్టేషన్‌కు కొత్త ఎస్సైను నియమించనున్నారు. మద్దిపాడు ఎస్సై పదోన్నతి జాబితాలో ఉండడంతో ఆ స్థానం ఖాళీ అయిన తరువాత కొత్తగా ఎస్సైను నియమించే అవకాశం ఉంది. -
శాంతిభద్రతలపై టాస్క్‌ఫోర్స్
-
శాంతిభద్రతలపై టాస్క్‌ఫోర్స్
రాష్ట్ర విభజన ప్రక్రియను వేగవంతం చేసిన కేంద్రం ‘శాంతిభద్రతల’పై టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం హోంశాఖ సలహాదారు విజయ్‌కుమార్ నేతృత్వం విభజన నేపథ్యంలో తలెత్తే శాంతిభద్రతల సమస్యలను పరిష్కరించడానికే.. నేటి నుంచి 31 వరకు డీజీపీ సహా రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులతో హైదరాబాద్‌లో భేటీలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. విభజన నేపథ్యంలో తలెత్తే శాంతిభద్రతల సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలి, ఎటువంటి వ్యూహాలను, విధానాలను అనుసరించాలనే దానిపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. టాస్క్‌ఫోర్స్‌కు రిటైర్డ్ ఐపీఎస్, ప్రస్తుతం కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సెక్యూరిటీ విభాగంలో సలహాదారుగా పనిచేస్తున్న కె. విజయ్ కుమార్ నేతృత్వం వహించనున్నారు. మరో ఎనిమిది మంది కేంద్ర ఉన్నతాధికారులను టాస్క్‌ఫోర్స్ బృందంలో నియమించారు. ఈ బృందం మంగళవారం నుంచి ఈ నెల 31వ తేదీ వరకు హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్‌లో రాష్ట్రానికి చెందిన 18 మంది ఐపీఎస్‌లతో సమావేశం కానుంది. ఇందులో డీజీపీ ప్రసాదరావు, ఇంటెలిజెన్స్ అదనపు డీజీ మహేందర్‌రెడ్డి, హైదరాబాద్ పోలీసు కమిషనర్ అనురాగ్‌శర్మతో పాటు రాష్ట్రంలో డీజీపీలుగా పనిచేసి పదవీ విరమణ చేసిన ఐపీఎస్‌లు కూడా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించి కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో తలెత్తే శాంతిభద్రతల సమస్యలు, అంశాలపై టాస్క్‌ఫోర్స్ బృందం రాష్ట్రానికి చెందిన అధికారుల బృందంతో చర్చించనుంది. ప్రధానంగా హైదరాబాద్‌ను పది సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో ఉమ్మడి రాజధాని పరిధితోపాటు ఆ పరిధిలో శాంతిభద్రతల నిర్వహణ ఎలా ఉండాలి? ఉమ్మడి రాజధానిగా కొనసాగినంత కాలం హైదరాబాద్ శాంతిభద్రతల నిర్వహణ బాధ్యతలు కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉండాలా? లేదా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ అధీనంలో ఉండాలా? అనే అంశాలపై కూడా టాస్క్‌ఫోర్స్ బృందం దృష్టి సారించనుంది. అలాగే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో ఎటువంటి శాంతి భద్రతల సమస్యలు ఉత్పన్నం కావచ్చు? వాటిని పరిష్కరించడానికి ఎటువంటి వ్యూహాన్ని అవలంబించాల్సి ఉంటుందనే వివరాలను టాస్క్‌ఫోర్స్ బృందం సభ్యులు రాష్ట్రానికి చెందిన ఐపీఎస్, ఐఏఎస్ అధికారులతో చర్చించనున్నారు. ఉమ్మడి రాజధానిగా ఉన్న కాలంలో హైదరాబాద్‌లోని సీమాంధ్ర ప్రజల రక్షణ విషయంలో ఉత్పన్నమయ్యే సమస్యలు, వాటిని పరిష్కరించేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి ఈ బృందం చర్చించనుంది. ఇరు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో రక్షణకు సంబంధించిన అంశాలతో పాటు, కేంద్ర బలగాలు తదితర అంశాలను కూడా చర్చిస్తుంది. చర్చల అనంతరం సెక్యూరిటీ అంశాలకు అనుసరించాల్సిన వ్యూహ పత్రాన్ని రూపొందిస్తుంది. మంగళవారం నుంచి ఈ నెల 31వ తేదీ వరకు జరిగే టాస్క్‌ఫోర్స్ బృందం సమావేశాలకు ఎంపిక చేసిన రాష్ర్ట ఐపీఎస్ అధికారులందరూ హాజరయ్యేలా తగిన ఆదేశాలు జారీ చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతికి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సూచించింది. అఖిల భారత కేడర్ పంపిణీపై ఢిల్లీలో 30, 31 తేదీల్లో భేటీ... సీఎస్ హాజరు రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు అఖిల భారత కేడర్ అధికారుల పంపిణీపైన కేంద్ర ప్రభుత్వం చర్యలను చేపట్టింది. అఖిల భారత కేడర్ అధికారులను ఇరు రాష్ట్రాలకు ఏ ప్రాతిపదిక పంపిణీ చేయాలనే విషయాలపై లోతుగా చర్చించేందుకు కేంద్ర పర్సనల్ అండ్ శిక్షణ శాఖ ఈ నెల 30, 31 తేదీల్లో సమావేశాలను ఏర్పాటు చేసింది. ఈ సమావేశాలకు పూర్తి సమాచారంతో హాజరు కావాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతికి సూచించింది. ఆయనతో పాటు సాధారణ పరిపాలన శాఖ ఇతర ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి చెందిన అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్, ఐఈఎస్, ఐఐఎస్‌ల వివరాలను సాధారణ పరిపాలన శాఖ సేకరిస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర కేడర్‌కు చెందిన ఐఏఎస్‌లు రాష్ట్రంలో 290 మంది, అలాగే రాష్ట్ర కేడర్‌కు చెందిన ఐపీఎస్‌లు 258 మంది ఉన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లతో సహా మిగతా అఖిల భారత సర్వీసు అధికారులను ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేయాల్సి ఉంది. వచ్చే నెల 1, 2 తేదీల్లో ఢిల్లీలో విద్యుత్ రంగంపై భేటీ రాష్ట్ర విభజన నేపథ్యంలో విద్యుత్ రంగం పంపిణీ అంశాలపై చర్చించేందుకు కేంద్ర ఇంధన శాఖ వచ్చే నెల 1, 2 తేదీల్లో ఢిల్లీలో సమావేశాలను ఏర్పాటు చేసింది. ఆ సమావేశాలకు పూర్తి సమాచారంతో హాజరు కావాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం ఆదేశించింది. విద్యుత్ ప్రాజెక్టులు, విద్యుత్ పంపిణీ, సరఫరా, అలాగే శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నుంచి ఉత్పత్తి అయ్యే జల విద్యుత్, బొగ్గు, గ్యాస్‌లను ఇరు రాష్ట్రాలకు పంపిణీలో అనుసరించాల్సిన విధానంపై సమావేశంలో చర్చించనున్నారు. శాంతిభద్రతలపై టాస్క్‌ఫోర్స్‌లోని సభ్యులు: కేంద్ర హోంశాఖ సెక్యురిటీ సలహాదారు కె.విజయ్‌కుమార్ నేతృత్వం వహిస్తారు. ఆ బృందంలో కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి రాజీవ్ శర్మ, జాతీయ దర్యాప్తు సంస్థ అదనపు డీజీ ఎన్.ఆర్. వాసన్, మధ్యప్రదేశ్ అదనపు డీజీ డి.ఎం. మిత్ర, ఒడిశా ఇంటెలిజెన్స్ అదనపు డీజీ అభయ్‌కుమార్, సరిహద్దు భద్రతా దళం ఐజీ సంతోశ్ మెహ్రా, సీఆర్పీఎఫ్ ఐజీ జుల్ఫికర్ హసన్, హోంశాఖ (పర్సనల్) డెరైక్టర్ శంతను, బ్యూరో ఆఫ్ పోలీసు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డీఐజీ అన్షుమన్ యాదవ్‌లు ఉన్నారు. టాస్క్‌ఫోర్స్ బృందం చర్చించే రాష్ట్ర అధికారులు: డీజీపీ ప్రసాదరావు, ఇంటెలిజెన్స్ అదనపు డీజీ మహేందర్‌రెడ్డి, హైదరాబాద్ సీపీ అనురాగ్‌శర్మ, ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి అజయ్ మిశ్రా, మాజీ డీజీపీలు హెచ్.జె.దొర, అరవిందరావు, ఆంజనేయరెడ్డి, ఎ.కె.మహంతి, సీనియర్ ఐపీఎస్ అధికారులు ఎ.కె.ఖాన్, జె.వి.రాముడు, విశ్వజిత్ కుమార్, చారు సిన్హా, మల్లారెడ్డి, దామోదర్, ఎన్.ఆర్.కె.రెడ్డి, కె. సజ్జనార్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పాపారావు, ఆస్కీ డీజీ ఎస్.కె.రావు. -
సమైక్య సభకు పటిష్ట బందోబస్తు: అనురాగ్ శర్మ
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌లోని లాల్ బహదూర్ స్టేడియంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శనివారం నిర్వహించనున్న బహిరంగ సభకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని సిటీ పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ తెలిపారు. అదనపు పోలీసు కమిషనర్(శాంతిభద్రతలు) అంజనీకుమార్, సంయుక్త పోలీసు కమిషనర్ (స్పెషల్‌బ్రాంచ్) బి.మల్లారెడ్డిలతో కలసి ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. భద్రత ఏర్పాట్ల కోసం నగర పోలీసు సిబ్బందితో పాటు 34 ప్లటూన్ల ఏపీఎస్పీ బలగాలు, 16 కంపెనీల కేంద్రసాయుధ బలగాలు, 1800 మంది సివిల్ పోలీసుల్ని మోహరిస్తున్నామని అనురాగ్ శర్మ వెల్లడించారు. ఇతర జిల్లాల నుంచి వచ్చే వాహనాలకు ప్రత్యేక రూట్లు, పార్కింగ్ సౌకర్యాలు కల్పిస్తున్నామని, ఎవరికీ ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ‘ఈ సభను మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు నిర్వహించుకోవడానికి అనుమతిచ్చాం. ఏపీఎన్జీవోల సభ సమయంలో చోటు చేసుకున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని.. అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్త పడుతున్నాం. ఏపీఎన్జీవోల సభకు హాజరయ్యేవారు గుర్తింపుకార్డుల్ని కచ్చితంగా చూపాల్సి ఉండటంతో స్టేడియం లోపలికి కేవలం రెండు గేట్ల ద్వారానే అనుమతించాం. అయితే వైఎస్సార్సీపీది పబ్లిక్ మీటింగ్ కావడంతో దాదాపు అన్ని గేట్లనూ తెరిచి అనుమతిస్తాం. సభకు లక్షల్లో జనం వస్తారని నిర్వాహకులు చెబుతున్నారు. దానికి తగ్గట్టు ఏర్పాట్లు చేపడుతున్నాం. ఓయూజాక్ సహా మరే ఇతర సంఘాలు సభను అడ్డుకునే విషయంపై మావద్ద ప్రత్యేకంగా ఏ సమాచారం లేదు. అయితే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో చిన్న చిన్న ఘటనలు జరిగే అవకాశం ఉందని భావిస్తున్నాం. ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటాం’ అన్నారు. -
హింసకు పాల్పడితే సహించం: డీజీపీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిన నేపథ్యంలో విజయనగరం, అనంతపురం జిల్లాల్లో ఆందోళనలు హింసాత్మకంగా మారాయని, మిగతా జిల్లాల్లో శాంతిభద్రతల పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి ప్రసాదరావు తెలిపారు. హింసకు పాల్పడితే సహించబోమని, హింసాత్మక ఘటనలకు పాల్పడే వారిపై కేసులు నమోదు చేస్తున్నామన్నారు. రైల్వే ఆస్తులకు నష్టం కలిగిస్తే నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద అరెస్టు చేస్తామని హెచ్చరించారు. శనివారం ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, సీమాంధ్ర జిల్లాల్లో ప్రస్తుతం ఉన్న 45 కంపెనీల పారా మిలటరీ దళాలకు అదనంగా 34 కంపెనీలను మోహరిస్తున్నట్లు వివరించారు. రాజీనామా చేయని ప్రజాప్రతినిధుల ఆస్తులను లక్ష్యంగా చేసుకుని ప్రజలు దాడులుచేస్తున్నందున ఎంపీలు, ఎమ్మెల్యేల ఇళ్ల వద్ద భ ద్రతను పెంచామన్నారు. విజయనగరంలో పరిస్థితి చేయిదాటడంతో ఆంధ్రా రీజియన్ ఐజీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు స్వయంగా అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారని చెప్పారు. ఆందోళనల్లోకి అసాంఘిక శక్తులొచ్చాయనే కోణంలో పరిశీలన జరుపుతున్నామని డీజీపీ తెలిపారు. హైదరాబాద్‌లో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు వీలుగా ఏపీఎస్పీ, పారా మిలటరీ బలగాలను సిద్ధంగా ఉంచామన్నారు. జగన్ దీక్షకు భద్రత కల్పిస్తున్నాం: సమైక్యాంధ్ర కోసం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ఆమరణ నిరశనకు భద్రత కల్పిస్తున్నారని డీజీపీ ప్రసాదరావు తెలిపారు. లోటస్‌పాండ్‌లోని తన ఇంటి వద్దే జగన్ ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించినందున పోలీసుల అనుమతి అవసరం లేదని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. -
కేంద్రం చేతిలో హైదరాబాద్ పోలీస్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం నేపథ్యంలో హైదరాబాద్ శాంతిభద్రతలు ఎవరి పరిధిలో ఉంటాయనేది చర్చనీయాంశంగా మారింది. పదేళ్లపాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంటుందని నోట్లో స్పష్టంచేశారు. దీంతో హైదరాబాద్ శాంతి భద్రతల అంశం ఆ పదేళ్లూ కేంద్ర హోంశాఖ పరిధిలోనే ఉండవచ్చని పోలీసు ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. నిపుణులు, పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్న ప్రకారం... హైదరాబాద్ పోలీస్ కమిషనర్ నియామకం, పోలీసుశాఖపై పర్యవేక్షణ మొత్తం కేంద్ర హోంమంత్రి పర్యవేక్షిస్తారు. హైదరాబాద్ నగర పోలీస్‌లు రెండు రాష్ట్రాల పరిధిలోకి రారు. హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగమైనందున ఆ గవర్నర్‌కు హైదరాబాద్ పోలీసు శాఖపై అజమాయిషీ ఉంటుంది. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ హైదరాబాద్‌లోనే ఉంటారు కాబట్టి వారిద్దరి భద్రత వ్యవహారాలను కూడా గవర్నర్ అధీనంలోని పోలీసు శాఖే చూస్తుంది. రెండు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, హోంమంత్రులకు హైదరాబాద్ పోలీసులపై అజమాయిషీ ఉండబోదు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేసే పోలీసు సిబ్బందిలో ఇరు ప్రాంతాలకు చెందినవారూ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సచివాలయం, శాసనసభలు హైదరాబాద్‌లో పదేళ్లపాటు ఉండనున్నందున ఇరు రాష్ట్రాల డీజీపీలు కూడా హైదరాబాద్‌లోనే ఉండే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆపరేషనల్ కార్యాలయం మాత్రం సీమాంధ్రలో ఏర్పాటు చేసుకుని వారంలో కొన్ని రోజులు అక్కడ్నుంచే కార్యకలాపాలు నిర్వహించవచ్చని ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి వెల్లడించారు. ఇరు రాష్ట్రాల డీజీపీలు హైదరాబాద్‌లో ఉన్నప్పటికీ ఇక్కడి పోలీసు కమిషనరేట్‌పై వారికి ఎలాంటి అజమాయిషీ ఉండబోదు. ఢిల్లీలో పోలీసుశాఖ ఎలా పనిచేస్తోందంటే... ప్రత్యేక రాష్ట్ర హోదా ఉన్న ఢిల్లీకి ముఖ్యమంత్రి ఉన్నా.. పోలీసు శాఖ మాత్రం సీఎం పరిధిలో పనిచేయడం లేదు. కేంద్ర హోంశాఖ అధీనంలో ఢిల్లీ పోలీసు శాఖ పనిచేస్తోంది. లెఫ్ట్‌నెంట్ గవర్నర్ పోలీసు శాఖకు బాస్‌గా వ్యవహరిస్తున్నారు. శాంతిభద్రతల వ్యవహారాలన్నీ లెఫ్ట్‌నెంట్ గవర్నరే చూస్తారు. ఢిల్లీ పోలీసు సిబ్బందిలో అన్ని రాష్ట్రాలకు చెందినవారూ ఉండేలా నియామకం జరుగుతోంది. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని పదేళ్లు నిర్ణీత కాలం మాత్రమే అయినందున నియామక సమస్య ఎదురుకాకపోవచ్చని వాదనగా ఉంది. హైదరాబాద్ ఫ్రీజోన్‌గా ఉన్న సమయంలో ఎంపికైన సిబ్బందిలో కొందరు ఇక్కడేపనిచేస్తూ ఉన్నారు. వారిని యథాతథంగా కొనసాగించడంతోపాటు అవసరానికి అనుగుణంగా సీమాంధ్ర జోన్లకు చెందిన వారిని కూడా కొందర్ని డిప్యూటేషన్‌పై హైదరాబాద్‌కు తీసుకోవచ్చని ఉన్నతాధికారి ఒకరు వివరించారు.