రాష్ట్ర విభజన ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. విభజన నేపథ్యంలో తలెత్తే శాంతిభద్రతల సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలి, ఎటువంటి వ్యూహాలను, విధానాలను అనుసరించాలనే దానిపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. టాస్క్‌ఫోర్స్‌కు రిటైర్డ్ ఐపీఎస్, ప్రస్తుతం కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సెక్యూరిటీ విభాగంలో సలహాదారుగా పనిచేస్తున్న కె. విజయ్ కుమార్ నేతృత్వం వహించనున్నారు. మరో ఎనిమిది మంది కేంద్ర ఉన్నతాధికారులను టాస్క్‌ఫోర్స్ బృందంలో నియమించారు. ఈ బృందం మంగళవారం నుంచి ఈ నెల 31వ తేదీ వరకు హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్‌లో రాష్ట్రానికి చెందిన 18 మంది ఐపీఎస్‌లతో సమావేశం కానుంది. ఇందులో డీజీపీ ప్రసాదరావు, ఇంటెలిజెన్స్ అదనపు డీజీ మహేందర్‌రెడ్డి, హైదరాబాద్ పోలీసు కమిషనర్ అనురాగ్‌శర్మతో పాటు రాష్ట్రంలో డీజీపీలుగా పనిచేసి పదవీ విరమణ చేసిన ఐపీఎస్‌లు కూడా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించి కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో తలెత్తే శాంతిభద్రతల సమస్యలు, అంశాలపై టాస్క్‌ఫోర్స్ బృందం రాష్ట్రానికి చెందిన అధికారుల బృందంతో చర్చించనుంది. ప్రధానంగా హైదరాబాద్‌ను పది సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో ఉమ్మడి రాజధాని పరిధితోపాటు ఆ పరిధిలో శాంతిభద్రతల నిర్వహణ ఎలా ఉండాలి? ఉమ్మడి రాజధానిగా కొనసాగినంత కాలం హైదరాబాద్ శాంతిభద్రతల నిర్వహణ బాధ్యతలు కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉండాలా? లేదా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ అధీనంలో ఉండాలా? అనే అంశాలపై కూడా టాస్క్‌ఫోర్స్ బృందం దృష్టి సారించనుంది. అలాగే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో ఎటువంటి శాంతి భద్రతల సమస్యలు ఉత్పన్నం కావచ్చు? వాటిని పరిష్కరించడానికి ఎటువంటి వ్యూహాన్ని అవలంబించాల్సి ఉంటుందనే వివరాలను టాస్క్‌ఫోర్స్ బృందం సభ్యులు రాష్ట్రానికి చెందిన ఐపీఎస్, ఐఏఎస్ అధికారులతో చర్చించనున్నారు. ఉమ్మడి రాజధానిగా ఉన్న కాలంలో హైదరాబాద్‌లోని సీమాంధ్ర ప్రజల రక్షణ విషయంలో ఉత్పన్నమయ్యే సమస్యలు, వాటిని పరిష్కరించేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి ఈ బృందం చర్చించనుంది. ఇరు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో రక్షణకు సంబంధించిన అంశాలతో పాటు, కేంద్ర బలగాలు తదితర అంశాలను కూడా చర్చిస్తుంది. చర్చల అనంతరం సెక్యూరిటీ అంశాలకు అనుసరించాల్సిన వ్యూహ పత్రాన్ని రూపొందిస్తుంది. మంగళవారం నుంచి ఈ నెల 31వ తేదీ వరకు జరిగే టాస్క్‌ఫోర్స్ బృందం సమావేశాలకు ఎంపిక చేసిన రాష్ర్ట ఐపీఎస్ అధికారులందరూ హాజరయ్యేలా తగిన ఆదేశాలు జారీ చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతికి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సూచించింది. అఖిల భారత కేడర్ పంపిణీపై ఢిల్లీలో 30, 31 తేదీల్లో భేటీ... సీఎస్ హాజరు రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు అఖిల భారత కేడర్ అధికారుల పంపిణీపైన కేంద్ర ప్రభుత్వం చర్యలను చేపట్టింది. అఖిల భారత కేడర్ అధికారులను ఇరు రాష్ట్రాలకు ఏ ప్రాతిపదిక పంపిణీ చేయాలనే విషయాలపై లోతుగా చర్చించేందుకు కేంద్ర పర్సనల్ అండ్ శిక్షణ శాఖ ఈ నెల 30, 31 తేదీల్లో సమావేశాలను ఏర్పాటు చేసింది. ఈ సమావేశాలకు పూర్తి సమాచారంతో హాజరు కావాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతికి సూచించింది. ఆయనతో పాటు సాధారణ పరిపాలన శాఖ ఇతర ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి చెందిన అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్, ఐఆర్‌ఎస్, ఐఈఎస్, ఐఐఎస్‌ల వివరాలను సాధారణ పరిపాలన శాఖ సేకరిస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర కేడర్‌కు చెందిన ఐఏఎస్‌లు రాష్ట్రంలో 290 మంది, అలాగే రాష్ట్ర కేడర్‌కు చెందిన ఐపీఎస్‌లు 258 మంది ఉన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లతో సహా మిగతా అఖిల భారత సర్వీసు అధికారులను ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేయాల్సి ఉంది. వచ్చే నెల 1, 2 తేదీల్లో ఢిల్లీలో విద్యుత్ రంగంపై భేటీ రాష్ట్ర విభజన నేపథ్యంలో విద్యుత్ రంగం పంపిణీ అంశాలపై చర్చించేందుకు కేంద్ర ఇంధన శాఖ వచ్చే నెల 1, 2 తేదీల్లో ఢిల్లీలో సమావేశాలను ఏర్పాటు చేసింది. ఆ సమావేశాలకు పూర్తి సమాచారంతో హాజరు కావాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం ఆదేశించింది. విద్యుత్ ప్రాజెక్టులు, విద్యుత్ పంపిణీ, సరఫరా, అలాగే శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నుంచి ఉత్పత్తి అయ్యే జల విద్యుత్, బొగ్గు, గ్యాస్‌లను ఇరు రాష్ట్రాలకు పంపిణీలో అనుసరించాల్సిన విధానంపై సమావేశంలో చర్చించనున్నారు. శాంతిభద్రతలపై టాస్క్‌ఫోర్స్‌లోని సభ్యులు: కేంద్ర హోంశాఖ సెక్యురిటీ సలహాదారు కె.విజయ్‌కుమార్ నేతృత్వం వహిస్తారు. ఆ బృందంలో కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి రాజీవ్ శర్మ, జాతీయ దర్యాప్తు సంస్థ అదనపు డీజీ ఎన్.ఆర్. వాసన్, మధ్యప్రదేశ్ అదనపు డీజీ డి.ఎం. మిత్ర, ఒడిశా ఇంటెలిజెన్స్ అదనపు డీజీ అభయ్‌కుమార్, సరిహద్దు భద్రతా దళం ఐజీ సంతోశ్ మెహ్రా, సీఆర్‌పీఎఫ్ ఐజీ జుల్ఫికర్ హసన్, హోంశాఖ (పర్సనల్) డెరైక్టర్ శంతను, బ్యూరో ఆఫ్ పోలీసు రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ డీఐజీ అన్షుమన్ యాదవ్‌లు ఉన్నారు. టాస్క్‌ఫోర్స్ బృందం చర్చించే రాష్ట్ర అధికారులు: డీజీపీ ప్రసాదరావు, ఇంటెలిజెన్స్ అదనపు డీజీ మహేందర్‌రెడ్డి, హైదరాబాద్ సీపీ అనురాగ్‌శర్మ, ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి అజయ్ మిశ్రా, మాజీ డీజీపీలు హెచ్.జె.దొర, అరవిందరావు, ఆంజనేయరెడ్డి, ఎ.కె.మహంతి, సీనియర్ ఐపీఎస్ అధికారులు ఎ.కె.ఖాన్, జె.వి.రాముడు, విశ్వజిత్ కుమార్, చారు సిన్హా, మల్లారెడ్డి, దామోదర్, ఎన్.ఆర్.కె.రెడ్డి, కె. సజ్జనార్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పాపారావు, ఆస్కీ డీజీ ఎస్.కె.రావు.
Published Tue, Oct 29 2013 7:11 AM | Last Updated on Thu, Mar 21 2024 6:14 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement