గౌష్ ఆలమ్‌కు బెస్ట్ ఆల్‌రౌండర్ అవార్డును అందజేస్తున్న అమిత్‌షా
సాక్షి, హైదరాబాద్: శాంతిభద్రతలు అదుపులో ఉంటేనే దేశ ఆర్థికాభివృద్ధి బలోపేతం అవుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీలో 2017 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ ప్రొబెషనర్లు శిక్షణ పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం నిర్వహించిన పాసింగ్ అవుట్ పరేడ్‌కు షా ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ‘‘దేశ తొలి హోంమంత్రి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ పేరిట ఉన్న జాతీయ పోలీసు అకాడమీలోకి రావడం చాలా ఆనందంగా ఉంది. ప్రస్తుతం శిక్షణ పూర్తి చేసుకున్న 103 మంది ఐపీఎస్‌లకు శుభాకాంక్షలు. ప్రొబేషనర్లలో ఆరుగురు భూటాన్, ఐదుగురు నేపాల్ జాతీయులతోపాటు 15 మంది మహిళా అధికారులు ఉండటం సంతోషకరం.
ఈ సందర్భంగా మనం సర్దార్ పటేల్‌ని స్మరించుకోవాలి. ప్రస్తుతం మనమున్న హైదరాబాద్‌ను దేశంలో విలీనం చేయడంలో పటేల్ పాత్ర మరువలేనిది. ఆయన పట్టుదల కారణంగానే నిజాం రాజు హైదరాబాద్ సంస్థానాన్ని ఇండియన్ యూనియన్‌లో విలీనం చేశారు. దేశంలో 530 చిన్న సంస్థానాల విలీనంలో ఉక్కుమనిషి పటేల్ చూపిన చొరవ కారణంగానే ఈరోజు దేశానికి సమగ్రత చేకూరింది. కాశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కలిగించే ఆర్టికల్ 370ని ఇటీవల ఎత్తేయడం ద్వారా కశ్మీర్‌ను దేశంలో విలీనం చేసి ప్రధాని మోదీ.. సర్దార్ పటేల్ స్వప్నాన్ని నెరవేర్చారు.
ఈ దేశానికి అత్యంత కీలకమైనవి రెండు. శాసనాల ద్వారా ఎన్నుకున్న ప్రజాపరిపాలనా వ్యవస్థ, సివిల్స్ ద్వారా ఎంపికైన అధికారుల వ్యవస్థ. దేశాన్ని ముందుకు నడిపించడంలో ఈ రెండు వ్యవస్థల కృషి ఎనలేనిది. సివిల్స్ విధానాన్ని దేశంలో ప్రవేశపెట్టిన పటేల్ స్ఫూర్తిని మనం మరచిపోకూడదు. ప్రపంచ పటంలో దేశం సమున్నత స్థానంలో ఉండాలంటే అందుకు మీ భాగస్వామ్యం ఎంతో అవసరం. మీరంతా దేశ సేవలో పునరంకితం అయినప్పుడే ఈ కల నెరవేరుతుంది. ఈ రోజు మీరు చేసిన ప్రతిజ్ఞను జీవితాంతం స్మరించండి.
శనివారం సర్దార్ వల్లభాయ్‌పటేల్ పోలీస్ అకాడమీలో జరిగిన పాసింగ్ ఔట్ పరేడ్‌లో ఐపీఎస్ ప్రొబెషనర్లు
‘స్మార్ట్’గా ముందుకెళ్లండి...
ఏ దేశానికైనా శాంతిభద్రతలు అదుపులో ఉంటేనే మెరుగైన ఆర్థిక ప్రగతి సాధ్యమవుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. మన దేశానికి పట్టిన ఉగ్రవాదం, తీవ్రవాదాల చీడ తొలగించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన వేలాది మంది పోలీసు అధికారులు, జవాన్లను స్మరించుకోవాలని, వారి త్యాగాల వల్లే మనం ఈ రోజు ఇక్కడ ఉన్నామని, వారి లక్ష్యం నెరవేర్చినప్పుడే వారి ఆత్మబలిదానాలకు సార్థకత చేకూరుతుందన్నారు. ‘‘ఐపీఎస్ శిక్షణతో మీ కల పూర్తవలేదు. వాస్తవానికి ఇప్పటి నుంచి మీ అసలు లక్ష్యం మొదలవనుంది. సురక్షిత, అభివృద్ధి చెందిన దేశ లక్ష్యం. సర్వీసులో ఉత్తమ ఫలితాలు రావాలంటే ప్రజలతో మమేకం కండి.
కోట్లాది మంది పేదలకు చేయూత అందించాల్సిన బాధ్యత మీ భుజాలపై ఉంది. స్మార్ట్ పోలీసింగ్ ప్రధాని మోదీ ఆశయం. ఆయన ప్రకారం స్మార్ట్ పోలీసింగ్ అంటే ఎస్ అంటే సెన్సిటివ్, ఎమ్ అంటే మోరల్ వ్యూ, ఏ అంటే అలర్ట్, ఆర్ అంటే రెస్పాన్సిబుల్, టీ అంటే టెక్ శావీ (టెక్నాలజీ వాడకంలో నిష్టాతుడు). ఈ నినాదంతో మీరు కెరీర్‌లో ముందుకెళ్లండి. ప్రజాసేవలో మాకు కేవలం ఐదేళ్లే అధికారం ఇచ్చారు. మరో ఐదేళ్లు కావాలంటే ప్రజలు ఆలోచిస్తారు. కానీ మీకు అలాకాదు. మీ చేతిలో 30 ఏళ్లు అవకాశం ఉంది. కాబట్టి విధినిర్వహణలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎన్ని ఒత్తిళ్లు ఎదుర్కొన్నా ఎక్కడా రాజీపడకూడదు’’అని అమిత్ షా పిలుపునిచ్చారు.
ప్రతిభావంతులకు పురస్కారాలు
ఎన్‌పీఏ డైరెక్టర్ అభయ్ కేడేట్లకు అకాడమీలో ఇచ్చిన శిక్షణ విశేషాలను అంతకుముందు వివరించారు. అనంతరం శిక్షణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన కేడెట్లకు అమిత్ షా పురస్కారాలు అందజేశారు. ట్రైనింగ్ మొత్తంలో అత్యధిక అవార్డులతో ఆల్‌రౌండ్ ప్రతిభ కనబరిచిన ఢిల్లీకి చెందిన గోష్ ఆలమ్ తెలంగాణ కేడర్‌కు సెలెక్ట్ అయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ బ్యాచ్‌లో మొత్తం ఆరుగురు అధికారులు శిక్షణ పూర్తి చేసుకున్నారు. అనంతరం ఎన్‌పీఏ ప్రాంగణంలోని న్యూ ఆఫీసర్స్ మెస్‌ను అమిత్ షా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, ఎన్‌పీఏ మాజీ డైరెక్టర్లు అరుణా బహుగుణ, బర్మన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment