సాక్షి, హైదరాబాద్: సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ఈ నెల 24న(శనివారం) 70వ బ్యాచ్ ఐపీఎస్ ప్రొబేషనర్ల దీక్షాంత పరేడ్ జరగనుందని డైరెక్టర్ అభయ్ తెలిపారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొని గౌరవ వందనం స్వీకరిస్తారని పేర్కొన్నారు. గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ఈ బ్యాచ్‌లో 92 మంది ఆఫీసర్లు శిక్షణ పొందారని, వీరిలో 12 మంది మహిళలు ఉన్నారని తెలిపారు. వీరిలో తెలంగాణ కేడర్‌కు ముగ్గురు ప్రొబేషనర్లు ఎంపికైనట్లు తెలిపారు. శిక్షణ పొందిన 11 మంది విదేశీ ఆఫీసర్లలో ఆరుగురు భూటన్, ఐదుగురు నేపాల్ పోలీస్ ఆఫీసర్లు ఉన్నారన్నారు.
ఈ బ్యాచ్‌లో ఉత్తమ ప్రొబెషనర్‌గా పురుషుల విభాగంలో తెలంగాణ కేడర్‌కు చెందిన గౌష్ ఆలమ్, మహిళల విభాగంలో రాజస్తాన్ కేడర్‌కు చెందిన రిచా తోమర్‌లు ఎంపికైనట్లు అభయ్ వెల్లడించారు. ఉత్తమ ఆల్‌రౌండ్ ప్రొబెషనర్‌గా ఎంపికైన గౌష్ ఆలమ్ ప్రధాన మంత్రి బేటన్, హోంమంత్రి రివాల్వర్ అందుకుంటారని తెలిపారు. ప్రొబేషనర్లు ఎక్కువ శాతం సామాన్య కుటుంబాలకు చెందిన వారని, ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ వారు ఐపీఎస్ ఆఫీసర్లుగా కఠోర శిక్షణ పూర్తి చేసుకున్నారని అభయ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment