
తిరుపతిలో కార్డన్ సెర్చ్ చేస్తున్న పోలీసులు (ఫైల్)
తిరుపతి క్రైం: తిరుపతికి మరో అరుదైన గౌరవం లభించింది. నివాసయోగ్యమైన నగరాలకు సంబంధించి కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థ ఇటీవల ప్రకటించిన ర్యాంకుల్లో తిరుపతి 4వ స్థానం పొందిన విషయం తెల్సిందే. తాజాగా శాంతిభద్రతల పర్యవేక్షణకు పోలీసులు తీసుకుంటున్న చర్యలకు సంబంధించి కేంద్రప్రభుత్వం ప్రకటించిన ర్యాంకుల్లో తిరుపతి అర్బన్ జిల్లాకు దేశంలోనే రెండో స్థానం లభించింది. అత్యంత సురక్షితమైన నగరమంటూ ప్రశంసలు దక్కాయి. నివాసయోగ్యమైన నగరాలకు సంబంధించి మొదటి స్థానంలో నిలిచిన పూణె.. ఈ ర్యాంకుకు వచ్చే సరికి 25వ స్థానంలో నిలవడం గమనార్హం. ఉత్తమ ర్యాంకు లభించడంతో అర్బన్ జిల్లా పోలీసు అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎస్పీగా అభిషేక్ మొహంతి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తీసుకున్న వివిధ రకాలైన భద్రతా చర్యలే ఉత్తమ ర్యాంకు సాధనకు దోహదపడ్డాయని పోలీసులు చెబుతున్నారు.
ప్రజల సంక్షేమానికి పెద్దపీట..
అర్బన్ జిల్లా పరిధిలో అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపడమేకాకుండా ప్రజలకు పోలీసులను చేరువచేసేందుకు ఎస్పీ మొహంతి ఎంతగానో కృషి చేశారు. అందులో భాగంగా ఏర్పాటు చేసినవే షీటీం, మహిళా రక్షక్ బృందాలు. వీరు ర్యాగింగ్, ఈవ్‌టీజింగ్‌కు పాల్పడే వారిని గుర్తించి కౌన్సెలింగ్ ఇస్తారు. తద్వారా ఈవ్‌టీజింగ్ కేసులు గణనీయంగా తగ్గాయి. ఇటీవల మహిళల కోసం ప్రత్యేకంగా షీ బోట్ అనే అప్లికేషన్‌నూ రూపొందించారు.
⇔ నగరంలో ఆకస్మిక తనిఖీలు, నాకాబంధీ, రౌడీషీటర్లపై ప్రత్యేక దృష్టి సారించడం, వారు నివసించే ప్రాంతాల్లో కార్డన్ సర్చ్‌లు నిర్వహించి అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం వంటివి నిరంతరం చేపడుతూనే ఉన్నారు. ప్రతి సోమవారం రౌడీషీటర్లకు పోలీస్‌స్టేషన్‌లలో కౌన్సెలింగ్ ఇస్తున్నారు.
⇔ సిబ్బంది ప్రతిరోజూ నగరంలో బేసిక్ పోలీసింగ్ నిర్వహించి సమాచారాన్ని పోలీసు ఉన్నతాధికారులకు చేరవేస్తారు. నగరంలో ప్రతిరోజూ విజువల్ పోలీసింగ్ నిర్వహిస్తూ తిరుపతికి వచ్చే భక్తులకు భద్రతతో పాటు ప్రజారక్షణకు తోడుగా నిలుస్తున్నారు. బ్లూకోల్డ్ రక్షక్ సిబ్బంది దాదాపు 150 మంది విజువల్ పోలీసింగ్ నిర్వహిస్తున్నారు. నగరంలో ఏం జరిగినా సంఘటనా స్థలానికి నిముషాల్లో చేరుకుంటున్నారు.
⇔ నగరంలో 350 కెమెరాలతో నిఘా నిర్వహిస్తూ ఈస్ట్ పోలీస్ స్టేషన్ మిద్దెపై ఉన్న కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షిస్తున్నారు.
⇔ డయిల్ 100 ద్వారా ఫోన్ చేసిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు తక్షణ సాయం అందిస్తున్నారు.
⇔ నగరంలో నేర నియంత్రణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఇవి రాత్రి 10 నుంచి వేకువజాము 4 గంటల వరకు తిరుగుతూ దొంగతనాలు, దోపిడీలు, నేరాలు జరగకుండా చర్యలు చేపడుతున్నాయి.
⇔ షాపింగ్‌మాల్, దుకాణాల్లో ప్రజారక్షణ చట్టం ద్వారా భద్రతకు ప్రాధాన్యమిచ్చారు. ప్రతి వ్యాపార సంస్థలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. తద్వారా నగరంలో దాదాపు 8 వేల సీసీ కెమెరాలు షాపులు, షాపింగ్‌మాల్స్‌లలో ఏర్పాటయ్యాయి.
⇔ నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను నేరుగా పోలీసులకు తెలిపే విధంగా పోలీస్ కేసు, వాట్సాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. వచ్చిన సమస్యను పరిశీలించి తక్షణమే సహాయ సహకారాలు అందిస్తున్నారు.
ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి
ఆధ్యాత్మిక నగరంలో నిరంతరం భక్తుల రద్దీ ఉంటుంది. దీంతో ట్రాఫిక్ సమస్యా ఎక్కువే. ఈ సమస్య నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించారు. గూగుల్ మ్యాప్ ద్వారా ట్రాఫిక్ ప్రమాదాలు, రద్దీగుర్తించి సంబంధిత అధికారులను అప్రమత్తం చేసి తద్వారా ట్రాఫిక్ సమస్యను చాలా వరకూ నియంత్రించారు.తగ్గిన నేరాల శాతం (గత సంవత్సరంలో) శారీరకమైన నేరాలు – 21.4%, పెద్ద దొంగతనాలు – 87 %, ఆర్థిక నేరాలు – 35%, గ్రేవ్ కేసులు 60%, రోడ్డు ప్రమాదాల మరణాలు – 17% తగ్గాయి.
Comments
Please login to add a commentAdd a comment