ఇంటర్నెట్‌ సేవలపై కొనసాగుతున్న ఆంక్షలు...! | Restrictions On Internet Services | Sakshi
Sakshi News home page

ఇంటర్నెట్‌ సేవలపై కొనసాగుతున్న ఆంక్షలు...!

Published Sun, Apr 8 2018 8:46 AM | Last Updated on Sun, Apr 8 2018 12:37 PM

Restrictions On Internet Services - Sakshi

ప్రపంచంలోని ఇతర దేశాలతో పోల్చితే భారత్‌లోనే అత్యధికంగా ఇంటర్నెట్‌ సేవలు (షట్‌డౌన్‌) నిలిపివేయడం వంటివి చోటుచేసుకున్నట్టు వెల్లడైంది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో శాంతి, భద్రతల పరిస్థితి క్షీణించే పరిస్థితులు, ఏవైనా ఘర్షణాత్మక పరిణామాలు చోటు చేసుకున్నపుడు ఆయా ప్రాంతాల్లో తాత్కాలికంగా ఇంటర్నెట్‌ సేవలు నిలిపేస్తున్నారు. ఇంటర్నెట్‌ సేవలు ఉపయోగించుకుని వాట్సాప్, ఫేస్‌బుక్‌ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా వేగంగా వదంతులు వ్యాపించే అవకాశమున్నందున దీనిపైనే అధికంగా దృష్టి కేంద్రీకరిస్తున్నట్టు తెలుస్తోంది.

 2012 నుంచి ఇప్పటివరకు 161 సందర్భాల్లో ఈ సేవలకు అంతరాయం ఏర్పడినట్టు ఢిల్లీకి చెందిన లాభాపేక్ష లేని ‘సాఫ్ట్‌వేర్‌ ఫ్రీడం లా సెంటర్‌’ గణాంకాలను బట్టి తెలుస్తోంది. అందులో  అధిక శాతం గత రెండున్నరేళ్లలోపు జరిగినవే. 2016లో 31, 2017లో 70, ఈ ఏడాది ఇప్పటివరకు 32 సందర్భాలున్నాయి. అయితే భారత్‌లో ఎక్కువస్థాయిలో నియంత్రణ విధించడాన్ని మానవహక్కుల సంఘాలు, పత్రికా స్వేచ్ఛ సంస్థలు తప్పుబడుతున్నాయి. మానవహక్కుల ఉల్లంఘనతో పాటు పత్రికాస్వేచ్ఛకు భంగం వంటి కారణాల వల్ల ఇలాంటివి సరికాదని వాదిస్తున్నాయి. 

గత 15 రోజుల్లోనే ఆరు రాష్ట్రాల్లో...

మరీ ముఖ్యంగా గత రెండువారాల్లోనే ఆరురాష్ట్రాల్లో ఈ షట్‌డౌన్‌ చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్‌ , పశ్చిమబెంగాల్, జమ్మూ కశ్మీర్, రాజస్థాన్, పంజాబ్, ఉత్తరప్రదేశ్‌లో  ప్రధానంగా శాంతి,భద్రతల పరిరక్షణలో భాగంగానే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. అయితే మధ్యప్రదేశ్, పంజాబ్‌ మాత్రమే కేంద్ర ప్రభుత్వం 2017లో నిర్దేశించిన నియమ,నిబంధనల ప్రక్రియను పాటించాయి. బెంగాల్‌లో శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా చోటుచేసుకున్న ఉద్రిక్తతల కారణంగా, కశ్మీర్‌లో మిలిటెంట్లపై భద్రతాదళాలు జరిపిన భారీ ఆపరేషన్‌ సందర్భంగా, ఎస్సీ,ఎస్టీల అత్యాచారాల నిరోధకచట్టంపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో దళితసంఘాల భారత్‌బంద్‌ సందర్భంగా ఇవి చోటుచేసుకున్నాయి.  ప్రాథమిక నిషేదాజ్ఞలు,  ప్రజల కదలికలపై నియంత్రణలతో పాటు ఆయా రాష్ట్రాల్లోని అధికారులు ప్రభావిత ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ సేవలను స్తంభింపజేశారు. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడినపుడు ఇంటర్నెట్‌సేవలు ఆపివేయడాన్ని ఒక ప్రామాణిక ప్రక్రియగా కొనసాగుతోంది.  పుకార్లు, వదంతులు త్వరగా వ్యాపించేందుకు తరచుగా ఇంటర్నెట్‌ను ఉపయోగించడం, దాని ద్వారా హింస, అల్లర్లు రెచ్చగొట్టే అవకాశం ఏర్పడుతోందని స్థానిక అధికార యంత్రాంగం వాదిస్తోంది. అందువల్లే పరిమిత కాలానికి తాత్కాలికంగా ఈ సర్వీసును నిలిపివేయాల్సి వస్తోందని చెబుతోంది. దీని ద్వారా శాంతి,భద్రతల పరిస్థితిని నియంత్రణలో ఉంచేందుకు వీలు కలుగుతోందని వాదిస్తోంది. 

కొత్త నిబంధనలు...

ప్రస్తుతం వివిధ పనులు, అవసరాల కోసం విస్తృతంగా ఇంటర్నెట్‌ సేవలు ఉపయోగిస్తున్నందున ఇలాంటి నియంత్రణలపై ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే ఈ పరిస్థితిని అధిగమించేందుకు  గత సెప్టెంబర్‌లో కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చింది. ప్రజా భద్రతకు భంగం, అత్యవసర పరిస్థితి వంటిది ఏర్పడినపుడు తాత్కాలికంగా టెలికం సర్వీసులు సస్పెండ్‌ చేసేందుకు పాటించాల్సిన ప్రక్రియను కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ ప్రకటించింది. 1885 ఇండియన్‌ టెలిగ్రాఫ్‌ చట్టంలో భాగంగా ‘టెంపరరీ సస్పెన్షన్‌ ఆఫ్‌ సర్వీసెస్‌ (పబ్లిక్‌ ఎమర్జెన్సీ ఆర్‌ పబ్లిక్‌ సెఫిటీ)రూల్స్,2017గా ఈ నిబంధనలు ఖరారు చేసింది. ఇలాంటి సందర్భాల్లో  కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసే పక్షంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శికి ఆ అధికారాలు కల్పిస్తారు.

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలకు రాష్ట్ర హోంశాఖ కార్యదర్శికి ఆ అధికారం ఉంటుంది. తప్పనిసరి పరిస్థితుల్లో జాయింట్‌ సెక్రటరీ స్థాయి అధికారి (కేంద్ర/ రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి అనుమతితో) జారీచేయవచ్చు. అయితే ఈ నిబంధనల పట్ల కూడా కొందరు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. అయితే ఈ నిబంధనలకు విరుద్ధంగా బెంగాల్‌లోని పశ్చిమ వర్థమాన్‌ జిల్లాలో మొబైల్, ఇంటర్నెట్, బ్రాడ్‌బ్రాండ్‌ సర్వీసులు (స్థానిక కేబుల్‌ టీవీ వార్తా ప్రసారాలు సహా) రెండున్నర రోజుల పాటు నిలిపివేశారు. జిల్లా మేజిస్ట్రేట్‌కు సెక్షన్‌–144 కింద ఉన్న అపరిమిత అధికారాలను దీనికి ఉపయోగించారు. కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చే వరకు కూడా  దేశంలోని ఇంటర్నెట్‌ సేవల నిలుపుదల ఉత్తర్వులు ఎక్కువగా ఇదే తరహాలో ఇస్తూ వచ్చారు. నూతన నిబంధనలు వచ్చాక కూడా పాత పద్థతే కొన్ని చోట్ల కొనసాగుతోంది. ఇతర రాష్ట్రాలకు భిన్నంగా మధ్యప్రదేశ్, పంజాబ్‌లలో మాత్రం కేంద్ర ప్రభుత్వ కొత్త నిబంధనలు పాటిస్తూ ఇటీవల ఇంటర్నెట్‌ సేవల తాత్కాలిక నిలుపుదల ఉత్తర్తులిచ్చాయి.  –సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement